అమెరికాలో కూడానా….?

ఈ టపా ఎలెక్షన్లు జరుగుతున్నపుడు వ్రాసాను. పోస్టు చేయలేదు. కానీ ఈ రోజు పోస్టు చేయాలి అనే నిర్ణయానికి వచ్చి అది పోస్టు చేస్తున్నాను. నిన్నవాట్సాప్ లో ఒక వీడియో లో ఎవరో ఒకావిడ, ఆంధ్రాలో  గెల్చిన వారిని మెచ్చుకుంటూ ఒక మాట అన్నది ‘ రెడ్డి కదండీ. అందుకే చెప్పినవన్నీ చేస్తాడు’ అని. ఇక ఓడిపోయిన వారి తాలూకు మనుష్యులు గెలిచిన వారిని తిట్టి పోయడం మొదలుపెట్టారు కూడా(ఎక్కడో ఆంధ్రాలో కాదు, మా అమెరికాలో) !! గెలుపు, ఓటమిలలో  కూడా ఏమి చూస్తున్నామా అని రోత కలుగుతోంది.

 

అసలు టపా:

అమెరికాకి  వచ్చిన కొత్తల్లో  భారతీయుల్లా ఎవరైనా కనిపిస్తే భలే సంతోషం వేసేది. పాకిస్తాన్ వారయినా  సరే. ఒకప్పుడు మనవారే కదా అన్న ఆప్యాయత. బెంగాలీ, గుజరాతి, పంజాబీ ఇలా రకరకాల వారు. అందరూ  స్నేహితులే. కానీ అమెరికాకి వచ్చి ఏళ్ళు గడుస్తున్న కొద్దీ నా స్నేహితుల జాబితా పెరగవలసినది పోయి, అది తెలుగువారి వరకే ఆగిపోయిందా అన్న అనుమానమొస్తోంది.

 

చుట్టు పక్కల తెలుగు, వ్రాసేది తెలుగు,  నేర్పేది తెలుగు . అన్నమయ్య, త్యాగయ్యలు. కూచిపూడులు. అంతా  బాగానే ఉంది. కానీ ఉంటున్నది అమెరికాలో అని మధ్య మధ్యలో గుర్తొస్తుంటుంది. ఇలా నేనే కాదు నాలాంటి వాళ్ళు చాలా మంది మర్చిపోయారు ఎక్కడ ఉంటున్నామో.   భారతదేశ రాజకీయల గురించి చర్చలు, తెలుగు సినిమాలు వస్తే చూడటం. ఇక్కడ వరకూ బాగానే ఉంది. జనాలు పెరిగారు కదా. తిండి, బట్ట, కారు, ఇల్లు చేతిలో చేరాక డబ్బులు మిగలడం మొదలు పెట్టింది..నెమ్మదిగా గుర్తొచ్చాయి కులాలు. ఏ హీరోకి ఆ హీరో కుల గుంపు. మొదటి ఆట సినిమాకి ఆ హీరో టీషీర్ట్ వేసుకుని ర్యాలీలు. సినిమా బాగా లేదు అంటే మనోభావాలు దెబ్బతీస్తున్నారు అంటూ మాట్లాడటం. కొంచెం చిరాకుగా ఉన్నాఇదంతా అభిమానం కదా ఎవరి ఇష్టం వారిది అనిపించింది మొన్న ఈ మధ్య వరకు.

 

ఇక సినిమాలు, హీరోలు ఆ లెవెల్ దాటి ఇంకొంచెం ముందుకి వెళ్లారు. ఇండియా లో ఎన్నికలకు అమెరికా నుంచీ ఏ కులం వారు ఆ కులం ప్రతినిధులకు(ఒక వేళ కులం match కాకపోతే వారి ప్రాంతం వారికీ)  సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం. పొరపాటున నాలాంటిది ఏమన్నా అంటే పెద్ద వాదన. కొందరు ఇంకొంచెం ముందుకెళ్ళి ఆయా రాజకీయ నాయకులకి డబ్బు కూడా విరాళం గా ఇస్తారు అని విన్నాను. ‘ఇస్తే  మీకెందుకండీ బాధ. ఎవరిష్టం వారిది’ అనచ్చు. కానీ ఇచ్చేది ఏదో దేశ సంక్షేమం కోసం ఇస్తే బాధే లేదు!! ‘ఫలానా వాడు నా కులం వాడు కాబట్టి, వాడిని నేను సపోర్ట్ చేస్తాను’ అనే సంకల్పంతో చేస్తేనే బాధగా ఉంటుంది. పోనీ వీళ్ళందరూ మద్దతు చేస్తున్న నాయకులేమన్నా చూడగానే చేతులెత్తి నమస్కారం చేయాలనిపించేలా ఉన్నారా?  అలా ఉన్నారో లేదో వీళ్ళకే తెలియాలి.

 

ఇక సోషల్  మీడియాలో అవతల వారి పార్టీలోని వారిని, వీరి కుసంస్కారమైన పోస్టులతో  దిగజార్చి మాట్లాడటం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది నాకు. గొప్పగొప్ప చదువులు చదివి, అమెరికాకి వచ్చి లక్షలు సంపాదిస్తూ, సంస్కారంతో ఆలోచనా తీరు మార్చుకోవాలి కదా?  ఇదేంటి ఇటువంటి దూషణలు అనిపించింది. ఇక్కడ అమెరికాలో కూర్చోని అక్కడ ప్రజల మధ్యన కులాల ప్రాతపదిక మీద చిచ్చుపెట్టడం ఎంతవరకూ న్యాయం? అణువు అణువు గా విడిపోయి విస్ఫోటకం జరిగినట్లు ఇప్పటికే  తెలుగు అంటే రెండు రాష్ట్రాల క్రింద విడిపోయింది. ఇంకా ఎన్ని భాగాలూ చేయడంలో వీరు భాగస్వామ్యం తీసుకుంటారు?

 

అమెరికాకి వచ్చాము కాబట్టి మన సంస్కృతిని మన మూలాల్ని వదిలేయనక్కరలేదు. చక్కర నైజం తీపి పంచడం. పాలతో కలిస్తే పాలు తీపెక్కుతాయి.. అంటే ఇక్కడ వారితో పాలల్లో చక్కర లాగా కలిసిపోవడం కూడా చేయాలిగా.  అది మనలో లోపిస్తోంది. ఒక వేళ ఎవరైనా అటువంటి మహత్కార్యం చేసినా/ చేస్తున్నా, ఓ హీరో సినిమాకి ప్రచారానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ విషయం చెప్పడానికి ఇవ్వటం లేదు. దానితో ఇక్కడ మన పిల్లలకి తమ చుట్టుపక్కలే ఉన్నతమ జాతిలోని ఇటువంటి హీరోల గురించి తెలియడం కూడా లేదు.

 

అమెరికాలో ఒక భారత జాతి చెందిన ఎవరైనా ఒక మనిషి శరీరం వదిలేస్తే,  వారి పార్థివ శరీరాన్ని కుటుంబాన్ని భారతదేశం చేర్చేవరకూ ఎంత కలిసికట్టుగా పని చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటామే!! అటువంటిది, తాత్కాలికమైన ఈ ఎలెక్షన్ల కోసం అమెరికాలో  కూర్చుని రిమోట్ తో ఈ వ్రాతలతో , చేష్టలతో మన పునాదులని మనమే పీకేసుకుంటున్నాం అని అనిపించట్లేదా?