వేసవి సెలవలు – 3 సినిమా

వేసవి సెలవలలో బిట్రగుంటలో సినిమా చూడటం కూడా ఓ మరచిపోలేని జ్ఞాపకం మాకు.

కొత్త సినిమాలు చూడాలి అంటే బిట్రగుంట థియేటర్లలో వచ్చేవి కాదు. ఇక నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. దానికోసం ముందే ఓ పెద్ద ప్రణాళిక వేసుకునేవాళ్ళం. మాట్నీకి వెళ్ళాలి  అంటే భోజనాలు చేసి హౌరా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాలి. మా మావయ్య, పిన్ని, కొంతమంది పెద్దపిల్లలం మాత్రమే వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ భోజనాలు తొందరగా పెట్టేసేది పాపం.

ఆ హౌరా  ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా వస్తే మాత్రం అంతే సంగతులు!! సాయంత్రం కృష్ణా ఎక్స్ ప్రెస్  వరకూ ఇంకో బండి ఉండేది కాదు. బిట్రగుంట నుంచి నెల్లూరు కి బస్సు లు పెద్దగా ఉండేవి కాదు. ఇక ఆ రోజుకి  సినిమా ప్రోగ్రాం ‘కాన్సల్’ అనేవారు. అలా మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (No 53/54)  లో రాత్రి భోజనాల సమయానికి ఇల్లు చేరేవాళ్ళం.

నెల్లూరులో నాకు గుర్తున్న థియేటర్ లు,  ‘అర్చన’ థియేటర్ & ‘కృష్ణా, కళ్యాణి, కావెరీ ‘ అని మూడు థియేటర్లు కలిపిన కాంప్లెక్స్.  మా మావయ్య ఆ మూడు థియేటర్లకి తీసుకెళ్ళినపుడల్లా ‘ మీ హైదరాబాద్ లో ఏ థియేటర్ పనికొస్తుందే  వీటి ముందు’ అనేవాడు. ‘ అసలు మహేశ్వరి పరమేశ్వరి’ చూసావా అంటూ పోట్లాడేవాళ్ళం నేను & మా అక్క. (మావయ్య తో అంత పోట్లాడేదాన్ని కానీ, ‘మహేశ్వరి పరమేశ్వరి’ నేనే ఎప్పుడూ  వెళ్ళలేదు. వెళదామని ఇప్పుడు అనుకున్నా అంత తీరికా, ఓపికా రెండూ లేవు. అంతా మార్చేసారని విన్నాను)

‘అహ నా పెళ్ళంట’, ‘డాన్స్ మాస్టర్’ నెల్లూరు లోనే చూసాము. ‘క్షణక్షణం’ నెల్లూరులో చూసిన ఆఖరి సినిమా అనుకుంటా.

బిట్రగుంటలో  రెండు థియేటర్ లు ఉండేవి. ఒకటి ‘పంచ రత్న’. ఇంకొకటి ‘సాజిద్’.  ‘పంచ రత్న’ ఇంటికి దగ్గరలో విశ్వనాథ రావు పేటలో ఉండేది. అప్పట్లో కొత్తగా ఊర్లో కొంచం అధునాతనంగా వచ్చింది. ‘సాజిద్’ పాత  థియేటర్ . రైల్వే బ్రిడ్జికి అవతల పక్క ఉండేది. అందుకని అక్కడ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘సాజిద్’ లో చూసిన  ఒకే ఒక్క సినిమా ‘జీవనపోరాటం’ . కొత్త సినిమా లో అలా వెంటనే ‘సాజిద్’ లో రావటం అదే మొదటిసారి. 

అలా ఎక్కువగా ‘పంచ రత్న’ కే  వెళ్ళేవాళ్ళం. ‘పంచ రత్న’ లో   25 పైసలు, 75 పైసలు, 1.50 టికెట్లు ఉన్నట్లు గుర్తు.  నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి ఇద్దరం డబ్బులు ఏదో ఆదా  చేద్దామని, 75 పైసలు కొనుక్కుని , ఇంటెర్వల్ లో 1.50 కి వచ్చి కూర్చునేవాళ్ళం. అలాంటి  కక్కుర్తి పనులు చేసినందుకు మా పిన్ని బాగా తిట్టేది. మా పిన్నికి నాకు క్షణం పడేది కాదు. ‘పెద్ద గయ్యాళిరా బాబు’  అనుకునేదాన్ని. ఇక్కడ మా పిన్ని గురించి ఒకటి చెప్పాలి. తను నాకు తలకి నూనె రాసి జడ ఎంత గట్టిగా వేసేదంటే, నా తల automaticగా ముందుకి వచ్చేది. అలా తల ముందుకి పెడితే  ‘ఎందుకలా చూస్తావే కొంగా’ అని తిట్టేది. మా గోల భరించలేక అమ్మమ్మే జడ వేసేసేది నాకు. నిస్వార్థమైన ప్రేమ అమ్మానాన్నలకు మాత్రమే ఉంటుంది అంటారు. ఈ రోజుకి కూడా అంతే ప్రేమ చూపిస్తుంది మా పిన్ని.  ఫోన్ చేస్తాను అని చెప్తే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తా !!

బిట్రగుంటలో సినిమా అంటే, సినిమా బండి వచ్చేది. ‘ నేడే చూడండి, నేడే చూడండి’ అంటూ. ఆవరణలో పిల్లలందరం పరిగెత్తుకెళ్ళి బండి దగ్గరికి వెళ్లి  ఏ సినిమానో, ఎన్ని రోజులో తెలుసుకుని వచ్చేవాళ్ళం. వెళ్లాలో వద్దో మా పిన్ని నిర్ణయించేసేది. ఫస్ట్ షో 7:00 కి ఉండేది. సినిమా చూసి వచ్చాక ఇంటికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళం. మేము వచ్చేసరికి అందరూ  పక్కలు వేసుకుని నిద్రకి ఉపక్రమిస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మమ్మ సినిమాకి వెళ్ళివచ్చినవారందరికీ స్టీల్ బేసిన్లో ముద్దలు కలిపి పెట్టేది. ఒక్కోసారి పూరీలాంటి టిఫిన్ లు చేసి ఉంచేది. అమ్మమ్మ, తాతయ్య మాతో ఎప్పుడూ  సినిమాకి రాలేదు.

మా పిల్లల ఎండాకాలం సెలవలు చూస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి. అమెరికాలో ( మా ఊర్లో అయితే ) సెలవలు ఉన్న పది వారాలు, వారానికి రెండు సినిమాల చొప్పున free  movies, వారాంతం అదనంగా outdoor movies ఉంటాయి. వీళ్ళ చిన్నపుడు ఆ free movie కోసం పొద్దున్నే లేచి, breakfast తిని పరిగెత్తడం కూడా అప్పుడే ఒక జ్ఞాపకం గా అయిపోయింది.  ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మారిపోతుంటే, కాలం ఎంత తొందరగా పరుగెత్తుతోందా అనిపిస్తోంది!!

 

‘సీత శీలాన్ని అనుమానించడం, నిండు గర్భిణిని అడవులకు తోలడం …ఇవి మన పిల్లలకు నేర్పిద్దామా? ‘

ఈ మధ్య వచ్చిన  ‘కాలా’ చలనచిత్రం గురించిన ఒక వాదనలో,  రావణుడుని సమర్థిస్తూ ‘రావణుడు తప్పు చేసాడు. అయినా పీడిత జనుల కోసం పోట్లాడాడు’ అన్నారు ఒకరు.  ‘అయితే రావణాసురుడి గురించి పిల్లలకి నేర్పుదామా ‘ అన్న నా ప్రశ్న కి సమాధానంగా ఇంకో ప్రశ్న వేశారు. ఇది వారికే కాదు. సామాన్య మానవులకి కూడా వచ్చే సందేహం.

ఈ పోస్ట్ రామాయణం మీద వితండవాదన చేసేవారికి మాత్రం కాదు. రామాయణం ఎంత సహృదయం తో  విన్నా, వితండవాదన చేసేవారి వాదనలు విని సామాన్యులకి సందేహాలు వస్తూనే ఉంటాయి. ఆ సామాన్యుల కోసమే ఈ టపా. ఎవర్నీ  నమ్మించాలన్న ఆతృత నాకేమాత్రం లేదు. నమ్మితే నమ్మచ్చు లేకపోతే లేదు. వితండవాదన కోసం వ్యాఖ్యలు చేస్తే అవి ప్రచురించను. రాముడి మీద వాదోపవాదాలు చేయడానికి ఎంతటి వారం మనం ?

ఇవన్నీ నా ఆలోచనలు మాత్రమే. రామాయణంని నేను సరిగ్గా అర్ధం చేసుకోలేదు అనుకుంటే నన్ను క్షమించండి _/\_

దశరథుడు రాముడిని పిలిచి ‘పొద్దుటే నీ పట్టాభిషేకం’ అన్నాడు. అలా చెప్పిన  కాసేపటికే ‘మీ నాన్నగారు నాకు మాటిచ్చారు నువ్వు అడవులకి వెళ్ళాలి ’ అని కైకేయి చెప్పింది.  రాముడు తనకి పట్టాభిషేకం చేస్తానన్నపుడు ఒకేలా ఉన్నాడు. రాజ్యం నీకు కాదు అన్నపుడు ఒకేలా ఉన్నాడు. కేవలం కొన్ని గంటల వ్యవధిలో జరిగిన విషయం. రామాయణం ఏదో  కథగా వింటూ రాముడు దేవుడు అనుకుంటే పెద్ద ప్రభావం ఉండదు మనకి. మన నిజజీవితంలో ఆ విధంగా ఉండటం అంత సులభమేం కాదు. ఈ చిన్న ఉదాహరణ ఆయనకి రాజ్యకాంక్ష లేదు అని చెప్తోంది. అంత రాజ్యకాంక్ష ఉన్నవాడైతే ఆ రోజే తండ్రిగారి మీద తిరగబడి లాక్కునే వాడే కదా ?

మరి వనవాసం నుంచీ వచ్చాక పట్టాభిషేకం చేసుకున్నాడు!! ఎందుకు ?

రాముడు వనవాసంలో ఉండగా   భరతుడు వచ్చాడు. రాముడి పాదుకలు పట్టుకెళ్ళి , తాను నందిగ్రామంలో ఉన్నాడు. తనకి రాజ్యం వద్దు గాక వద్దు అన్నాడు.

యుద్ధం ముగిసాక , సీతాదేవిని అందరి ముందర పిలిచి చెప్పాడు.అప్పుడే సీతాదేవి ఎన్ని అడగాలో అన్నీ అడిగిందట ఆయనని.  అగ్నిప్రవేశం చేయమని రాముడు అడగలేదు. కానీ ఆవిడ అగ్నిప్రవేశం చేస్తుంటే అడ్డుకొనలేదు కూడా. ఎందుకలా ??

భరతుడు రాజ్యం తీసుకోడు. ప్రజలందరూ రాముడికే  ఓటు వేశారు. కాబట్టి ఆయనే రాజు అవుతాడు. రాముడు అయోధ్య చేరిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుంది. ఆయన  ఏకపత్నీ వ్రతుడు. కాబట్టి సీతాదేవి పక్కన ఉండాలి. కాబోయే పట్టపురాణిని ఒక్కరు కూడా పల్లెత్తు మాట అనకూడదు అనేది ఆయన  ఉద్దేశ్యం. అది avoid చేయడానికి లంకలోనే ఈ తంతు జరిగింది.

ఇంత చేసాడు కదా మరి ఎందుకు పరిత్యజించాడు ? ఒక్కరెవరో అన్నమాటకే  అలా వదిలిపెట్టేయాలా ? (అసలు ఈ ఘట్టం వాల్మీకి రామాయణంలోని లేదు. ‘లవకుశ’ సినిమా చూసి అందరం మాట్లాడేవారమే !!)

ఈ రోజుల్లో మంత్రులకి గెలవాలి, ఆకుర్చీలో కూర్చోవాలి అన్న తపనే కానీ, 100 మందిలో 90 మంది ఓటు  వేస్తే 10 మందికి ఓటు ఎందుకు వేయలేదు అన్న సంగతి ఆలోచించరు . ఆ పది మంది గురించి ఆలోచించేవాడే రాముడు. 100% perfect  గా ఉండాలి ఆయనకి. అందుకే అది రామరాజ్యం అయింది.

విముక్త కథలలో అనుకుంటాను. రచయిత్రి ‘రాముడు ఆర్యుడు . రాజ్యదాహం అందుకే’ అని వ్రాసారు. ఒక ఆర్మీ ఆఫీసర్, fire  fighter , పోలీస్ ఆఫీసర్ మా కుటుంబాలే మాకు ముఖ్యం అనుకుంటే ఆ ఉద్యోగాలు ఎవరు చేస్తారు? అలాగే ఒక రాజుకి భార్య ముఖ్యమా? రాజ్యం  ముఖ్యమా ? భార్య కోసం రాజ్యం వదులుకుంటే ఆ రాజుని ఈ రోజుకి కూడా ఎందుకు గుర్తుంచుకుంటాము?

రాజు కదా ఆ విధంగా సీతని అన్నవాడిని  శిక్షించచ్చు . Sadhguru గారు ఈ మధ్య కవిత గారి ఇంటర్వ్యూ లో ఒక మాట చెప్పారు. ప్రతి నేరానికి శిక్షలు, చట్టాలు అంటూ పోతే అవేమి ఆడదానికి సహాయం చేయవు. మనుష్యులలో  ‘Sensitivity’ ని develop చేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది అని. రాముడు ఇక్కడ చేసింది అదే!!

రాముడు సీత అనుమానించడం, అవమానించడం ఏమీ  చేయలేదు. రంధ్రాన్వేషణ చేసేది మనము. ‘మోడీ భార్య ఏం  చేస్తోంది ? ట్రంప్ గారికి ఎంత మంది భార్యలు? ఒబామా గారి భార్య వేసుకున్న బట్టలేంటి ? లేడీ డయానా గారు భర్తని వదిలేసి ఎవరితో కారులో వెళుతున్నారు ?వెంటబడి పీక్కుతిందామా ? చిరంజీవి కూతురు రెండో పెళ్లి బాగా జరిగిందా ?రేణు దేశాయ్ గారు ఎవర్ని పెళ్లి చేసుకుంటున్నారు? ’  ఇలాంటివి మనకి కావాలి. ఆ లేకితనాన్ని ఖండించలేక, చేతగాక రాముడిని నిందిస్తున్నాము.

అసలు ఇవన్నీ కాదు. రాముడు విప్లవాత్మకంగా ఆలోచించి అవన్నీ  పట్టించుకోకూడదు అంటారా ? రాముడు మామూలు మానవుడిగా బ్రతికుదామని అనుకున్నాడు. అది గుర్తుంచుకోవాలి.  ‘అవతల వాళ్ళు ఏమి అన్నా పట్టించుకోకూడదు’ అనుకుంటాము. అది అంత సులభమా ? మనం పట్టించుకోకపోయినా పట్టించుకునేలా చేస్తుంది సమాజం. రాముడు ఏవి పట్టించుకోకుండా ఉండలేడు. ఎందుకంటే సీతాదేవి మీద ఉన్న అనురాగం అటువంటిది.

రాముడికి వచ్చింది పెద్ద ధర్మ సంకటం. ఆరోజుకి  ఏది ధర్మమో అదే చేసాడు ఆయన . రాముడు ధర్మం తప్పితే ఆయన  గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

కాబట్టి రాముడిని తప్పు పట్టడం మానేసి సీతని నింద  చేసిన వాడి గురించి పిల్లలకి నేర్పించి ఆలోచింపజేయండి. వాడికీ  మనకీ తేడా ఉండాలి కదా ??