అమెరికాలో అరటికాయ పొడి

అరటికాయ చూడగానే ‘అత్తగారి కథలు’ గుర్తుకు వచ్చి అరటికాయ పొడి చేశాను చాలా ఏళ్ల  తరువాత.  భానుమతి అత్తగారంత  నైపుణ్యం లేదనుకోండి 🙂

ముఖ పుస్తకం లో అరటికాయ పొడి చిత్రం పెట్టగానే అందరూ  తాయారు చేసిన విధానం చెప్పమని అడిగారు.  అందుకే  ఇలా ఓ టపా కట్టేసాను.

image1
కావాల్సిన పదార్థాలు  :

రెండు అరటి కాయలు (plantains కాకుండా  green bananas అని వేరుగా ఉంటాయి. అవే  బావుంటాయి)

తగినంత ఉప్పు  

నూనె – 2-3 చెంచాలు

పోపు కి కావాల్సినవి :

నాలుగు ఎండు మిర్చి (తినగలిగేంత కారం)

మినపప్పు

శనగపప్పు

ఆవాలు

జీలకర్ర

మెంతులు

ఇంగువ

అరటి కాయలు కడిగి  తొక్క తీసి ముక్కలు కోసుకోవాలి

కాయలకి తడి లేకుండా పేపర్ టవల్ తో అద్దివేయాలి.  ముక్కలని  ఒక గిన్నెలో  నూనె వేసి కలపాలి  (tossing).  తడి ఉంటే ముక్కలు మెత్తగా అయిపోయి పొడి బాగా రాదు.  ఒక పళ్లెం లేక cookie sheet తీసుకుని  aluminimum/parchment sheet వేసి ముక్కలని సమానం గా పరచాలి.

12509176_1020397954719601_8427482910230701765_n
ఈ విధం గా అన్న మాట

 

400F  ఉష్ణోగ్రత తో 22-25 నిమిషాల పాటు ముక్కలు ఓవెన్ లో ఉంచాలి.   

పోపు తాయారు చేసుకుని , పోపు  & అరటి కాయ ముక్కలు చల్లారాక   – పోపు, bake చేసిన అరటి ముక్కలు అన్నీ  కలిపి  Grinder/food processor/mini chopper  లో వేసి పొడి చేయటమే.

అన్నం లో నెయ్యి వేసి కలుపుకుని తినటమే 🙂

 

గమనిక :

మాములుగా అయితే అరటి కాయలని నిప్పుల మీద కానీ గ్యాస్ మంట మీద  కాల్చి, తొక్క తీసి పొడి చేస్తారు. అమెరికా అరటి కాయలు అలా కాలతాయో లేదో తెలీదు అని oven లో  bake చేశాను.

పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు

నా బ్లాగు లో చాగంటి వారి ప్రవచనాల మీద చాలా సార్లు ప్రస్తావించాను. నేను వ్రాసింది చదివి కొంత మంది తప్పకుండా ఆయన  ప్రవచనం వింటాము అని కూడా వ్యాఖ్యలలో చెప్పారు. చాలా సంతోషం గా  అన్పించింది ఒక చిన్న మంచి పని చేశాను కదా అని. ఆయన  ప్రవచనం గురించే చెబుతూ చాగంటి వారు మరియు వారి ప్రవచనములు’  అన్న టపా లో ఒకసారి ఒక విషయం చాలా స్పష్టం గా   వ్రాసాను – “ఈ సోషల్ మీడియా లో కొందరు వీడియో లు తమకి  కావలసినంత మేరకి  కత్తిరించి పంచుతున్నారు. ఈ రెండు నిమిషాల వీడియో లు చూసి ఆయన ఎందుకు చెప్తున్నారో దేనికి చెప్తున్నారో అర్ధం కాదు మొట్ట మొదట చూసిన వారికి. చాగంటి వారి 2 నిమిషాల వీడియో లు చూడకండి “  అని.

నేను చాగంటి వారి ప్రవచనాలలో   శ్రీసంపూర్ణ రామాయణం  (42 భాగాలూ, ప్రతి భాగం దాదాపు 2. 5 గంటలు),   స్థలపురాణం కాశీ రామేశ్వరం (1. 5 గంటలు కావచ్చు), మహా భారతం( ఎంత సమయమో  ఎప్పుడూ  చూడలేదు ) ఆది పర్వము, సభా పర్వము , విరాట పర్వం  విన్నాను.   వారి ప్రవచనము దాదాపు ఒక సంవత్సరం నుండి ప్రతి రోజు వింటున్నాను.  ఏ  ప్రవచనం లో కూడా ఒకరిని దూషించడం, అసభ్యకరం గా మాట్లాడటం వినలేదు.  పైపెచ్చు ఏదైనా అన్నానేమో అనుకుని ఆయన  ‘నేను క్షమించబడెదను కాక’, ‘ నేను మన్నింపబడెదను కాక’  అని అనటం మాత్రం చాలా సార్లు విన్నాను.  ఎన్ని సార్లు విన్నానో లెక్కించలేదు. కాలేజి పిల్లల్ని ఉద్ద్యేశించి ప్రసంగించేటపుడు ‘నన్ను మీ మేనమామ గా అనుకోండి’ అంటూ మాట్లాడారు. ఎవరు అంత ప్రేమ గా చెప్తారు ? ఆయన  చెప్పే విధానం వింటే  వేరొకరిని పొరపాటున కూడా  దూషించాలని ఎవరికీ అనిపించదు. అది కూడా ఒక కులం, మతం పేరుతో దూషించాలని అసలు అనిపించదు.    Brain ని ఒక  thought process లోకి పట్టుకెళ్ళుతుంది ఆయన  ప్రవచనం. అటువంటి ప్రవచనాలు చెప్పే వారి  మీద ఈ దూషణ ఏంటి?   వారు చెప్పిన  మంచి మాటలు ఎంతమంది ఎంత  విన్నారో తెలీదు   కానీ  ఒక్క మాట పొరపాటు వస్తే ఇంత రాద్ధాంతమా ? చెప్పాలంటే  ఆయన  చెప్పే భారతం విన్నాకా నాకు శ్రీకృష్ణుడి మీద భక్తి పెరిగింది మాత్రం నిజం.  అలాగే రామాయణం విన్నాకా  రాముడి మీద కూడానూ.  

మనం ఆఫీస్ ల లో ఒక రెండు నిమిషాల presentation ఇవ్వాలంటేనే  వందసార్లు practice చేసుకుంటామే  అన్ని గంటలు అనర్గళం గా మాట్లాడినప్పుడు ఒక్కసారి తప్పు దొర్లటం సహజం కాదా? ఉద్దేశ్యపూర్వకం గా మాట్లాడిన మాట కాదు. ఉద్దేశ్యపూర్వకం కాకపోయినా ఇంకొకరి  మనోభావాలు దెబ్బతిన్నాయి  కాబట్టి  వారు క్షమాపణలు కూడా చెప్పారు కదా ? మరి ఆయన ప్రవచనం ని  ఖండించి మాట్లాడే వారు, రోడ్డు మీద చేసిన వికృత చర్యల మాటేంటి ? ఇంత వికృత చర్యలు చేస్తే కానీ ఆవేశం చల్లారదా ? ఒక మనిషి అనుకోకుండా తప్పు చేస్తే అంత క్షమించలేని పరిస్థితి లో ఉన్నామా?

మనోభావాలు దెబ్బతిన్నాయి.  అందుకే కోపాలు వస్తాయి.  అది సహజమే కదా అనుకుంటే, ఒక టీవీ ఛానల్ వారు ఈ వికృత  చర్యలు చేస్తున్న వీడియో చూపిస్తూ, ఆ విలేఖరి  అవతల వారిని రెచ్చగొట్టే విధం గా మాట్లాడిస్తున్నారు. టీవీ ఛానల్ కి  రేటింగ్ పెరగటానికి సమాజం లో సమైక్యత పోయేటట్లు చేస్తే సరిపోతుందా ? ఎందుకింత దిగజారుడు ?  నైతిక విలువలు ఎక్కడ పోతున్నాయి సమాజం లో? ఆఖరికి,నయా పైసా పుచ్చుకోకుండా సమాజం బావుండాలని నిస్వార్ధం తో  ప్రవచనాలు చెప్పేవారి  మీదే కేసులు పెడితే  ఇంక ధర్మం అన్న మాట కి విలువ ఏంటి ? అర్ధం ఏంటి ?

నేను ఎవరినో  బాధపెట్టడానికి ఈ టపా వ్రాయలేదు  అని విన్నవించుకుంటున్నాను. ఇటువంటి మహాపురుషులు మన తెలుగు వారవ్వటం, ఆయన నోటి వెంట వచ్చిన ప్రవచనం వినటం  నిజంగా మనం చేసుకున్న అదృష్టం.  అది ప్రతి ఒక్కరు గ్రహించుకోగలిగితే చాలు.

వివేకానందుడు చెప్పిన బాట లో… (పునఃప్రచురణ)

‘Is that ‘Chaganti?’

‘No. You know him. Come and see!!’

‘Oh….  !! Dr.Balooo!!’  

ఈ చివరి మాట వింటే ఆయన ఎవరికో దగ్గరి చుట్టమో లేక స్నేహితుడో అనుకుంటారు.  ఇది నేను ఒక వీడియో చూస్తున్నపుడు నాకు మా పదేళ్ళమ్మాయికి జరిగిన సంభాషణ.

మనం అందరం, స్వామి వివేకానంద గురించి మాట్లాడతాము, ఆయన సూక్తులని (quotes) ముఖ పుస్తకం లో, whatsapp లో  స్నేహితులతో పంచుకుంటాము. మహా అయితే ఆయన  వ్రాసిన పుస్తకం చదువుతాం.  మనలో ఎంత మంది ఆయన  చెప్పినది పాటించడానికి ప్రయత్నిస్తున్నాము? అటువంటి వారు ఎక్కడుంటారు లేరు అంటారేమో !!  స్వామి వివేకానంద చెప్పింది అక్షరాలా పాటించి దేశానికి  సేవలందిస్తున్న వారు  ఉన్నారు.  అటువంటి వారిని చూసి మాట్లాడే భాగ్యం కూడా మా బాలవికాస్ బడి ద్వారా నా లాంటి సామాన్యులకి లభించింది.

ఈనాడు ఆదివారం పత్రిక లో సచిత్ర కథనాలు భాగం లో ప్రతి వారం ఒక లాభాపేక్ష లేని సంస్థ  గురించి వ్రాస్తుంటారు. ఆ విధం గా బహుశా 2005/2006 మధ్యన , ఈనాడు ఆదివారం  Online పత్రిక తిరగవేస్తుంటే ఒక సంస్థ  గురించిన వ్యాసం కనపడింది. ఆ వ్యాసం సారంశం ఏంటంటే  స్వామి వివేకానంద  చెప్పినది అక్షరాలా  పాటించడానికి  కొంత మంది డాక్టర్లు కర్ణాటక లో మారుమూల గ్రామాలలో ఒక సేవా  కార్యక్రమం ప్రారంభించారు అని.  సాధారణంగా గవర్నమెంట్ కాలేజీలలో మెడిసిన్ చదువుకున్న డాక్టర్లు అంటే అమెరికా కో  వెళ్లి  స్థిరపడతారు. లేదా  ఏదైనా మంచిప్రైవేటు ఆసుపత్రులలో పని చేస్తారు. మంచి మెరిట్ తో చదువుకున్నవారు అయి ఉంటారు కాబట్టి డబ్బు గడించడం పెద్ద సమస్య కాదు వారికి.  ఏదో సినిమాలలో పల్లెల్లో వైద్యం చేసే హీరోలని చూస్తాము.  కానీ నిజజీవితం లో జీవితాన్ని ఈ విధం గా దేశసేవ కి  అంకితం చేయడం మనం సాధారణం గా  చూడము కదా !! అందుకని ఆ సంస్థ బాగా గుర్తుండిపోయింది. ఒక రోజు వారంతం లో పిల్లల ‘activities’ భాగం లో మా వారు మా అమ్మాయిని  బాలవికాస్ బడికి  కి తీసుకెళ్ళారు. ఇద్దరూ ఇంటికి రాగానే కర్ణాటక నుండి ఒక డాక్టర్ గారు  వచ్చారని,  గిరిజనులకి సేవ చేస్తున్నారని చెప్పారు.  నాకు వెంటనే ఈ వ్యాసం స్ఫురించింది.  నా అంచనా నిజమైంది !! ఈనాడు లో చదివిన సంస్థ  ఆ వచ్చిన వారిది  ఒకటే సంస్థ !! అదే  Swami Vivekananda Youth Movement – SVYM!! ఈ సంస్థను స్థాపించినవారు డాక్టర్ బాల సుబ్రహ్మణ్యం.  ఈ సంస్థ వివరాలు, వారు చేసే సేవలు  http://www.svym.org/  లో చూడవచ్చు. 2015 సంవత్సరం లో Best NGO in India Award కి ఎంపిక అయింది.

ఈ సంస్థ ఎలా ఆవిర్భవించిందో మా బాలవికాస్ బడికి విచ్చేసిన  డాక్టర్ బాలు ఈ విధం గా  మా పిల్లల కి చెప్పారు:

అందరి లాగే ఒక మాములు మధ్య తరగతి కుటుంబం పుట్టిన ఆయన  మంచి మార్కులతో PUC పాస్ అయి ఇంజనీరింగు కాలేజిలో  చేరారు.  చేరిన మొదటి రోజే  సీనియర్సు చేసిన రాగింగు తట్టుకోలేక పోయారుట. మరుదినం ఇంట్లో కూర్చోలేని స్థితి.  ఏం  చేయాలో తోచలేదు ఆయనకి.  కాలేజి వెళదామని బయలుదేరారు. కానీ కాలేజి దగ్గరవుతున్నకొద్దీ భయం!! కాలేజికి వెళ్ళకుండా, డబ్బు ఖర్చు పెట్టకుండా కాలక్షేపం చేయాలి. ఎదురుగుండా రామకృష్ణ ఆశ్రమం కన్పించింది.  ఇంక రోజు అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారుట.  అక్కడ  ఆశ్రమ సన్యాసి ఒకరు  ఈయనని గమనించసాగారు. ఆ సన్యాసి ముందు  కాస్త బుద్దిమంతుడిలా కన్పించడానికి  అక్కడి గ్రంధాలయం లో స్వామి వివేకానంద వ్రాసిన పుస్తకాలూ చదవటం మొదలు పెట్టారు. అదే తన జీవితాన్ని మార్చేసింది అంటారు డాక్టర్ బాలు.  ముఖ్యం గా ‘His call to the Nation’ ,  మరియు ‘To the Youth of India’.  మెడిసిన్ లో సీట్ వస్తే తప్పకుండా  స్వామి వివేకానంద ఇచ్చిన పిలుపు మేరకు గ్రామీణసేవ కే  తన జీవితం అంకితం చేస్తాను అని మనసు లో సంకల్పించుకున్నారు.  ఆశ్చర్యకరం గా ఆ రోజు ఇంటికి వెళ్ళేసరికి  మెడిసిన్ లో సీటు వచ్చినట్లు ఒక టెలిగ్రామ్ వచ్చిందట.  ఆ విధం గా మెడిసిన్ చదవటం, SVYM  ఆవిర్భవించబడటం  జరిగింది.  “Such is the power of Swamiji’s works, that no person who reads and comprehends his nationalistic message can sit quiet without responding”  అని చెప్తారు డాక్టర్ బాలు.

IIT , VIT, Cornell వంటి విశ్వవిద్యాలయాలలో ప్రసంగాలు ఇచ్చే ఆయన  మా పిల్లలు కోసం, వచ్చిన ప్రతిసారి దాదాపు రెండు గంటలు సమయాన్ని కేటాయించి పిల్లలు  వేసే ప్రశ్నలన్నీ చాలా  ఓర్పు గా సమాధానాలు చెప్తారు.  ఇప్పుడు అర్ధం అయిఉంటుంది  మా అమ్మాయి ‘ఈయన నాకెందుకు తెలీదు’ అన్నట్లు మాట్లాడిందో.  వారు మా పిల్లలకి కథల రూపం లో చెప్పిన గాధలు మనసుని కదలించి వేసాయి. ఎంతో మంది జీవితాలలో వెలుగు నింపుతున్న డాక్టర్ బాలు గారి లో  అటువంటి ధృడసంకల్పాన్ని కలిగించిన స్వామి వివేకానంద నిజం గా ఒక అవతార పురుషుడే కదా అన్పిస్తుంటుంది!!

డాక్టర్ బాలు గారి ప్రసంగం ఒకటి ఈ వీడియో లో చూడండి. ఈ పదిహేను నిమిషాల వీడియో లో ఈనాటి యువత  చేయాలో గుర్తు చేసారు. వీడియో లో డా. బాలు ఒక విషయం లో స్వామి వివేకానంద చెప్పినది తప్పని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. స్వామి వివేకానంద చెప్పినది తప్పు ఎలా అవుతుంది?ఈ వీడియో చూస్తే మీకే అర్ధం అవుతుంది !!

https://www.youtube.com/watch?v=KzJs0Kgrp8A

ఈ ఒక్క  వీడియో షేర్ చేస్తే సరిపోతుంది గా ఇంత టపా,  ఇంత ఉపోద్ఘాతం అవసరమా అని అన్పించవచ్చు. డాక్టర్ బాలు లాంటి వ్యక్తుల గురించి చదివి – ఈ దేశం నాకు ఏమిచ్చింది, ప్రభుత్వం ఏమిచ్చింది అని అనుకోకుండా నేను ఈ దేశానికీ, ఈ సమాజానికి ఏమిస్తున్నాను అన్న ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుంటారన్న ఆశ తో మీ ముందుకి ఈ టపా !!

ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు

‘ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు?’

‘ మా బాలవికాస్ లోనే. పిల్లలు 11 గంటలకి  భజనలు  మొదలు పెడ్తారు.  సరిగ్గా పన్నెండు గంటలకి ధ్యానం  చేస్తాము. తరువాత గణపతి భజన తో భజనలు మళ్ళీ  మొదలుపెట్టి  ఒక అరగంట చేస్తారు. పిల్లలే పాడాలి. పెద్ద వాళ్ళు అనుసరించాలి .  ఈ సారి  మా ఇంట్లోనే  చేస్తున్నాము. వస్తారా? ‘

‘భజనలా ??? చూస్తాం లెండి’ – అవతల వెక్కిరింత కూడిన ఓ నవ్వు!!

కష్ఠాలు వచ్చినపుడో , అవతల వారు ప్రాణాంతకం లో ఉన్నపుడు ‘Our prayers are with you’ ‘ Amen’ అనో  దేవుడిని గుర్తు చేసుకోవాలి కానీ, మా లాగా ఎప్పుడు పడితే అప్పుడు అందునా నూతన సంవత్సరం వేడుకప్పుడు  గుర్తు చేసుకోవడం  ఒక వింతే  కదా 🙂

అమెరికా లో అయినా భారత దేశం లో అయినా ఏ పండగ ఎలా చేసుకున్నా పర్వాలేదు . భజనలు చేస్తే పుణ్యం వస్తుందని కాదు. వైన్ తాగితే పాపం వస్తుందనీ  లేదు. ఎవరి ఇష్టం  వారిది. కానీ ఎంత మటుకు ? సమాజానికి ఎక్కడా ఏ హానీ  జరగనంత మటుకు!!

దీపావళికి ముందర  బ్లాగుల్లో, వాట్సాప్ లో , ముఖ పుస్తకం లో  ‘పర్యావరణానికి హానీ  కలిగించే పనులు చేయకండి. బాణాసంచా కాల్చద్దు’ అంటూ  సందేశాలు. ఒక వీడియో కూడా చూసాను. అందులో ఒకతను  కరెన్సీ నోట్లు(డబ్బులు)   కాల్చేస్తుంటాడు. అదేమిటి అంటే బాణాసంచా కొని ఇదేపని  చేస్తున్నాం కదా, దాని బదులు పేదవారికి ఇవ్వచ్చు కదా అంటాడు.  ఈ  ఆలోచనా ధోరణి మంచిదే. బాలకార్మికులని ఉపయోగించి తాయారు చేసే బాణాసంచా కాల్చనక్కర్లేదు. మట్టి దీపాలు కొని చేతి వృత్తుల వారిని ప్రోత్సహించవచ్చు.  

మరి ఇదే ధోరణి లో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకి మద్యం  తాగద్దు, ఎగిరి గెంతులు వేయద్దు అని ఎన్ని సందేశాలు వచ్చాయి అందరికీ ? గత ఏడాదే  హైదరాబాద్ లో పంజాగుట్ట లో పట్టపగలే తాగిన  మైకం లో కారు నడిపిన వారి వలన   ఒక కుటుంబం ( రమ్య)  చిన్నాభిన్నమయిన సంఘటన కూడా సందేశాలు పంపేవారికి గుర్తురాకపోవడం శోచనీయం.   నాకు మటుకు బాణాసంచా పేలుస్తూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తున్న సందేశాలు వచ్చాయి.  

ఈ మధ్యవార్తల్లో, మీడియాలో అన్ని చోట్లా  ఈ నోట్ల మార్పిడి గురించే. ATM  లైన్ లో నిలబడి చనిపోయారు  అంటూ రోజుకో టపా లు. పేదవారికి ఎంత కష్టం అంటూ మాటలు.

బెంగళూరు లో జరిగిన విషయం చదివాకా  నాకు అన్పించింది – భారత దేశం లో  ఇన్ని వేల మంది  యువత ఒక్క చోట ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు చేసుకోవడానికి డబ్బు (నగదు)  ఎక్కడ నుంచి వచ్చింది ? ఒక పల్లెటూరికి వెళ్లి  ఒక నిర్యక్ష్యరాస్యుడితో ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ తెరిపించలేని ఈ యువత కి అర్ధరాత్రి ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలకి సమయం, ఓపిక, ఉత్సాహం  ఎక్కడనుంచి వచ్చేసాయి ? ఇంత మంది కోసం  అంటే పోలీస్ బలగాల రక్షణ కూడానా ?  ప్రభుత్వ నిధులని ఎంత వృధా చేస్తున్నారు  ? రోజుకో పేద రైతు చనిపోయే  భారత దేశం లో  కావాల్సింది ఇటువంటి వేడుకలా ?  చదువుకున్న యువత చేయవలసిన పనులేనా ఇవి ? ఎందుకు సంస్కారం లేని ఆ  చదువు? ఉన్న మానవవనరులు ఈ విధం గా నిరుపయోగం లేకుండా అయిపోవడం ఎంత శోచనీయం ?

సీత దేవి అగ్ని ప్రవేశం చేసింది. రాముడు భార్య ని విడిచిపెట్టాడు……  ధర్మరాజు భార్య ని జూదం లో పెట్టాడు… . ఆడవారిని అవమానించాయి పురాణాలూ…. .   జీయర్ స్వామి నామాలు వేయించుకోమంటాడు..  చాగంటి గారు ఆడవాళ్ళని బట్టలుతకమన్నారు…. . జగ్గీ వాసుదేవ్ ఇంగ్లీష్ లో సోది చెప్తాడు కానీ చేసేవన్నీ మంచి పనులు కావు….  Art of living రవి శంకర్  కార్యక్రమం పర్యావరణాన్ని నాశనం చేసింది…  రాందేవ్ బాబా పతంజలి ఉత్పత్తులని చెప్పి బోలెడు డబ్బు గడిస్తున్నాడు…తినడానికి తిండి లేకపోతే అబ్దుల్ కలాం కలలు కనమంటాడు ….    యోగా అంటూ విన్యాసాలు చేస్తున్నాడు తుగ్లక్ ప్రధాన మంత్రి…   మంచి మాట మాట్లాడే  ప్రతి ఒక్కరిని ఏదో ఒక దూషణ, విమర్శ.  ఆఖరికి  కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతులు, నడిచే దైవం అయిన జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని కూడా విమర్శించే వారు తయారైన సమాజం మనది. ఎక్కడా మంచి అనే దాన్ని చూడలేకపోతే Spirituality అనేది ఎక్కడ నుంచి వస్తుంది ?  Spirituality లేనిదే మనిషిలో ethical thinking, morality ఎక్కడ నుంచి వస్తుంది ?సమాజం లో morality  లోపిస్తుంటే  ఎవరు మార్గదర్శకత్వం చూపిస్తారు  యువతకి ?