हे अपना दिल तो आवरा

ఈ పాట విన్నప్పుడల్లా కాలేజీ రోజులు గుర్తొచ్చేస్తాయి. పైగా ఈ పాట కూడా నా FB స్నేహితులు ఒకరు పాడుతూ అల్లరి చేసేస్తూ వీడియో ఒకటి పెట్టారు. అదీగాక మాలికలో బ్లాగుల నిండా కాలేజీ కబుర్లే చెబుతున్నారు.
మా కాలేజీకి వెళ్ళాలంటే ఓ రెండు గంటల ప్రయాణం ఉండేది. మెహదీపట్నం నుంచీ గండిపేట్ వెళ్ళే ఏదో ఒక బస్సు పట్టుకుని వెళ్ళాలి. RTC వారివే కాలేజీ బస్సులు రెండు ఉండేవి. Girls special & Boys special (ఆ రోజుల్లోనే మా కాలేజీ వారు ఆ విధంగా సమానత్వం అన్నారు 🙂 )
ఆ ప్రయాణ కష్టాన్ని మర్చిపోవడానికి కొంతమంది అమ్మాయిలు పాటలు/ అంత్యాక్షరి పాడేవారు. చివరగా ఈ పాట అందుకుని ముగించేవారు. బస్సంతా అమ్మాయిలకే కాబట్టి కొంతమంది వెనకాల foot-board మీద కూర్చునేవారు. అమ్మాయిల బస్ ముందు బయలు దేరేది. overtake గట్రా అయినప్పుడు కేకలు గోలలు!! పరీక్షలు లేని సమయంలో రోజూ picnic అన్నమాటే. నేను పాడేదాన్ని కాదుగాని, అంత్యాక్షరికి సహాయం చేస్తుండేదాన్ని. మేం ఐదుగురం ఉండేవాళ్ళం. మాకు మా కబుర్లు చెప్పుకోవడం సరిపోయేది. మధ్యలో మా లీడర్ సుధీర్ Boys special లో కనిపించాడా లేదా చూసుకుని, కనిపిస్తే మురిసిపోయేవాళ్ళం. ఎందుకు మురిసిపోవడం అంటే సమాధానం ఏం లేదు. అదో తుత్తి మాకు.
ఇప్పుడు కాలేజీ సంగతి కాసేపు పక్కనబెట్టి ఇంట్లో వాళ్ళ గురించి చెప్తాను.
మా అక్క కూడా నా కాలేజీలో నాతో బాటే చదివింది. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చేది అది. ఒకటే బడి. ఒకటే కాలేజీ. నాకంటూ ఒక identity లేకుండా చేసింది!! ఇంక MBA కూడా ‘నువ్వెక్కడికి వెళ్తే అక్కడ వస్తాను’ అంది. దీని సంసారం అంతా వేసుకుని నా వెనకాలే ఎక్కడ వచ్చేస్తుందో అని భయపడి అప్పుడు మాత్రం నేనే దాన్నొదిలి ఉస్మానియా నుంచీ కాకతీయకి పరిగెత్తి పారిపోయా !! సంసారం ఏంటి అంటారా? ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం అయిపోగానే దానికి పెళ్లయిపోయింది. అంటే అప్పటినుండీ అది free bird!! అమ్మ, నాన్న మాట వినక్కర్లేలేదన్న మాట!!
మా తమ్ముడు, అక్క చాలా కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకరిని మించిన వారు ఒకరు !! మా తమ్ముడు నాలుగో తరగతిలో ఉండగా లంచ్ బాక్స్ ఇచ్చి బడికి వెళ్ళమని చెప్తే, క్రికెట్ మ్యాచ్ ఉన్నప్పుడల్లా మాసబ్ ట్యాంక్ లో ఉన్న బడికి వెళ్లకుండా లక్డికాపుల్ టీవీ షోరూం దగ్గర బస్ దిగేసి మ్యాచ్ మొత్తం చూసి, ‘బడికి వెళ్ళాను. కానీ హోంవర్క్ ఇవ్వలేదు’ అని మా అమ్మ దగ్గర గారం చేసేవాడు. మా అక్క పాలిటెక్నిక్ లో బోలెడుక్లాసులు ఉంటే ఆ stress తట్టుకోలేక స్నేహితులతో కలిసి కొత్తగా వచ్చిన సినిమాలు చూస్తూ కాలం గడుపుతూ ఉండేది.
ఇక మళ్ళీ కాలేజీలోకి వచ్చేయండి.
ఒక రోజు ఇలాగే పాటలు పాడుతూ అందరూ కాలం గడుపుతూ ఉండగా, నాకు ఒంట్లో బాగోలేక కాలేజికి వెళ్ళలేదు. ఆ రోజు కండక్టర్ కి వీళ్ళని చూసి చూసి ఒళ్ళు మండిపోయి పాటలు ఆపమన్నాడు. వీళ్ళు పాడటం ఆపలేదు. పైగా పోట్లాడారు. స్త్రీల హక్కులకి భంగం వాటిల్లింది కదా!! ఇక మా అక్క వీరవనిత కూడా విజృభించి ఆ కండక్టర్ తో బాగా పోట్లాడింది. ఆ కండక్టర్ కాలేజీకి వెళ్లి ఏకంగా ప్రిన్సిపాల్ గారితో ‘అమ్మాయిలు రోజూ అబ్బాయిలని చూసి పాటలు పాడుతున్నారు. వద్దంటే పోట్లాడారు’ అంటూ అమ్మాయిల లిస్ట్ చదివి, మా అక్కని కూడా అందులోకి చేర్చేసాడు. ప్రిన్సిపాల్ గారు ‘పాపం ఆ కండక్టర్ మీ అందర్నీ సురక్షితంగా తీసుకెళ్తుంటే, మీరు ఇలా పోట్లాడతారా? మీ అందరి అమ్మానాన్నలని పిలిపించి మాట్లాడతాను’ అన్నారు. అందులో ఫోన్లు ఉన్నవారికి ముందు ఫోన్ చేస్తామని చెప్పారు.
ఆ రోజు ఇంటికి రాగానే మా అక్క నాతో కాకుండా, తన కష్టసుఖాన్ని మా తమ్ముడితో పంచుకుంది. తరువాత ప్రిన్సిపాల్ గారు ఫోన్ చేసారు. మా నాన్న గారు ఫోన్ ఎత్తి ‘ ఈ ఒక్కసారికి అమ్మాయిని క్షమించేయమని’ అడిగారు.
ఈ విధంగా మా నాన్నగారికి ఆ సంఘటన గుర్తు  భలే ఆనందంగా ఉంది
ఫోను ఎవరు ఎత్తి ఉంటారో అర్ధమయ్యిందనుకుంటాను!!

ఎప్పుడూ అమ్మనే మెచ్చుకుంటే ఎలా?

 

‘ఎనిమిదయినా ఆ నిద్దర్లేంటి లేవడమ్మా ‘

‘వీకెండ్ కదా పడుకుంటారు. మరీ చాదస్తం ఎందుకు’

‘లేటుగా లేస్తే brain పని చేయదట. తమరు కూడా లేవచ్చు. లేవండమ్మా!!’

****

‘ Did you wash my PE clothes?’

‘మడత పెట్టి నీ backpack దగ్గరే పెట్టానే  సరిగ్గా చూసుకో’

****

‘ఈ రోజు పిల్లల lunch  కి PBJ sandwich పెట్టేయమంటావా ? లేదా దోసెలు  వేయాలా ?’

****

‘రేపు SOL  exam ఉంది కదా. తొందరగా పడుకోండమ్మా .  పదండి ఇద్దర్ని హనుమాన్ చాలీసా పాడుతూ పడుకోబెడతాను’.

****

‘బస్సు వచ్చేస్తుంది. తొందరగా రామ్మా . జడ వేసేస్తాను.’

****

‘దాన్ని క్లాసులో దింపి Costco  కి వచ్చా. ఏమయినా కావాలా ?’

‘Walmart  కి వెళ్తున్నా. ఇంతేనా లిస్టు?’

****

‘పిల్లలకి  ఆకలి వేసేస్తుందేమో.   అన్నం, పప్పు వండేయనా ?’

***

‘రేపు teachers working  day బడి లేదు కదా. ఇంటినుంచే  పని చేస్తాలే’

***

పోన్లే పాపం సరదాగా మాల్ కి తీసుకెళ్తా. ఐస్క్రీమ్ తింటారు.  ఎప్పుడూ చదువు అంటే వాళ్ళకీ బోర్ కదా.”

***

 

ఇవన్నీ నేను చేస్తున్నా అనుకుంటున్నారా ? కాదు గాక కాదు. Mother’s  Day అయితే ఆ పనులు చేసింది నేనే అని వ్రాసుకునేదాన్నేమో. ఎవరైనా కవులు పైన వ్రాసింది చదివితే అమ్మ గురించి ఎన్నో పనులు చేస్తుంది అంటూ కవిత్వం వ్రాసేస్తారు.  కానీ ఇవన్నీ ఒక Father చేస్తారు. అంటే ఎవరో ఈ పాటికి అర్ధమయ్యి ఉండాలి!!

మా పెద్దమ్మాయి పుట్టిన మూడోరోజుకి jaundice  వచ్చి hospital లో మూడు రోజులు ఉంది. నన్ను డిశ్చార్జ్ చేసేసారు(అదొక Insurance  తలనొప్పి)నేను ఇంటికి వచ్చేసాను. మా వారే ఆ మూడు రోజులు నిద్రాహారాలు మాని చూసుకున్నారు. ఈరోజు కి కూడా పిల్లలకి ఒంట్లో బాలేదు అంటే ఇంటివైద్యం అంతా తానే  చేస్తారు. తల్లి నేనా ఈయనా అన్న సందేహం వస్తుంటుంది నాకు.

అమ్మలే పిల్లల్ని చూసుకుంటారు అన్నట్లు మాట్లాడుతాము.  ఎంతో మంది నాన్నలు కూడా అమ్మతో సమానంగానే పిల్లల్ని చూసుకుంటున్నారు. అదనపు బాధ్యతలు ఆనందంగానే స్వీకరిస్తున్నారు.   

 

నాన్నలందరికీ  Happy Father’s day!!

కొసమెరుపు: ఈ రోజు పొద్దున్న కూడా మేలుకొలుపు ఇంకా జరుగుతోంది.

 

  అన్నీ పనులు చేసే  నాన్న లకి సరదగా 🙂 ( Whatsapp  నుంచి )

 

5dcaf36e-8590-4ed8-bd1d-4c9c8963e9ed

నవావధానం

“2000 తరువాత వచ్చిన చాలా మందికి తెలుగు చదవడం రాయడం వచ్చినా, తెలుగు భాషతోనూ, ముఖ్యంగా సాహిత్యంతో సంబధం తెగిపోయింది. అందరివీ ఇంగ్లీషు మీడియం చదువులే! ఒకళ్ళొ ఇద్దరికో తెలుగు రాయడం, చదవడం వచ్చు. అందులో వెతికితే కొంతమంది రాయడం పైన ఆసక్తి ఉండచ్చు. అందువల్ల ఇక్కడికొచ్చిన యంగ్ తెలుగు జెనరేషన్ కథకులు తయారయ్యే అవకాశాలు చాలా తక్కువ”

“అమెరికాలో  చాలా మంది పిల్లలు తెలుగు నేర్చుకుంటున్నారు. అందరూ  డయాస్పోరా కథలు రాయలేకపోవచ్చు. కానీ చిగురంత ఆశ కన్పిస్తోంది.పిల్లలతో  తల్లితండ్రులు బలవంతం గా కొంత మటుకే చేయించగలరు అన్నీ కాదు కదా!!”

ఇది నాకు, సారంగలో ఒక రచయిత (పేరు గుర్తు లేదు) ఒక రెండేళ్ళ క్రిందట జరిగిన వాదన. వారేమో అంత స్పష్టంగా ముందు ముందు తరాలు కథలు వ్రాయలేరు అని చెప్తుంటే నేను అస్సలు అంగీకరించలేదు.

ఇది పక్కనబెడితే ,  2013 లో సిలికానాంధ్ర వారు కాలిఫోర్నియా లో నిర్వహించిన మాట్లాట పోటీలలో పదరంగంలో  మా అమ్మాయి మొదటి విజేతగా నిలిచింది. ఆ సందర్భంలో జరిగిన ఒక రేడియో షో లో భాస్కర్ రాయవరం గారు ఒక మాట అన్నారు  ‘ఈ పిల్లలందరికీ తెలుగు నేర్పించడం అంటే ఒక భాండాగారానికి తాళాలు ఎలా తీయటమో చెప్పడమే. ఆ భాండాగారంలో ఎన్నో నిధులు ఉన్నాయి. ఎవరు తాళం తీస్తే వారికే దక్కుతాయి’ . ఆ మాట ఎప్పటికీ  మరువలేను.

నిన్న వంగూరి చిట్టెన్ రాజుగారు  వారి ముఖపుస్తకం లో వారం వారం విశేషం లో హ్యూస్టన్ లో  జరిగిన నవావధానం గురించి వ్రాసారు. అది చదివాకా నా నోట మాట రాలేదు.

అవధానం చేసినది ఎవరూ అంటే  అమెరికాలో పుట్టి పెరిగిన 17 ఏళ్ళ పిల్లవాడు.

ఆ అవధానం గురించి తెలుసుకోవాలంటే  వంగూరి గారి టపా చూడవచ్చు. వారి టపా  చదివి అవధానం చూస్తే ఆ రుచి వేరు 🙂

ఈ అబ్బాయిని చూసాక ఎంత సంతోషం వేసిందో.  ఒకటి ఏంటంటే, నా వాదన తప్పు కాదు అని నిరూపణ.  అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలు తెలుగులో కథలు వ్రాయగలరు అని నేను చిగురంత ఆశ  పెట్టుకుంటే, ఆ ఆశకి కొండంత బలం ఇస్తూ , కథలు కాదు ఏకంగా అవధానమే చేసేసాడు!! ఇంకొకటి , భాస్కర్ రాయవరం గారు చెప్పింది అక్షరాలా నిజం. తాళాలు  తీసాడు. నిధులని ఏరుకుంటున్నాడు.

ఓ రెండు గంటలు మీవి కాదు అనుకుని ఈ వీడియో చూడండి  !!

వీడియోకి లంకె

https://youtu.be/rTheegf1SBM