బిట్రగుంట వాళ్ళతో తమాషాలా?

‘కృష్ణా ఎక్స్ ప్రెస్  లేటా ఏందీ ఈ రోజు?’  రైలు కూత విని అన్నారెవరో. 

‘అట్నేఉన్నట్టుందే !!’ 

ఆ రైలు దిగి వచ్చినవారెవరో  నిజమే అంటూ ధృవీకరించి చెప్పారు. 

ఇంకేం !! కృష్ణా ఎక్స్ ప్రెస్  లేటయ్యిందన్న వార్త గుప్పుమంది ఊర్లో.  చిన్నా పెద్దా అంతా దాని గురించే మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఎందుకు లేటయింది, ఏ స్టేషన్లో ఆలస్యం, ఏ బండి కోసం దీనిని ఏ ఊర్లో ఔటర్ లో ఆపేసి ఇలా అన్యాయం చేసారు వగైరా. 

‘ఎవరు వస్తున్నారు ఆ రైల్లో? లేటయితే ఏమవుతుంది? ఎందుకింత  చర్చ?’ అన్న ప్రశ్నలు మాములు మానవులకి  రాక మానవు.

ఆ ప్రశ్నలకి సమాధానాలు ‘ఆ రైల్లో ఎవరూ రారు. లేటవుతే కొంపలేం అంటుకోవు. కానీ ఆ ఊర్లో అందరూ దిగులుపడతారు.అదే ఆ ఊరు గొప్పతనం. అదే మా బిట్రగుంట 🙂 🙂 !!’

StationBTTR

*******************************************************

నిన్న మా పెరట్లో పూసిన నాలుగు మల్లెపూలు జడలో పెట్టుకోగానే ఆ వాసన జ్ఞాపకాల వైపు లాక్కెళ్ళింది. పైగా ఈమధ్యే  మా కుటుంబం జూమ్ మీటింగ్ లో చెప్పుకున్న బిట్రగుంట కబుర్లు కూడా తాజాగా గుర్తున్నప్పుడే భండాగారంలో అట్టిపెట్టుకుందామని మొదలుపెట్టాను మళ్ళీ ఈ సోది!! కరోనా, ఎలెక్షన్లు, యుద్ధం ఇలాంటి వార్తలువినీ వినీ విసుగెత్తిపోతోంది కూడాను!!

ఇది వరకే చెప్పా కదా.  చెరగని తరగని జ్ఞాపకాలు లలో !! బిట్రగుంట వాళ్ళు అక్కడ ఆగే అన్ని రైళ్ళని నంబర్లతోటే పిలిచేవారు (ఒక్క కృష్ణా, పినాకిని ఎక్స్ ప్రెస్ లని తప్ప). 

హైదరాబాద్ – మద్రాస్ ఎక్స్ ప్రెస్ ని 53 లేదా 54 అనే వారు. 

కాకినాడ- తిరుపతి తిరుమల ఎక్స్ ప్రెస్ ని 87 లేదా 88. 

బొకారో స్టీల్ సిటీ ఎక్స్ ప్రెస్ 83 లేదా 84.

ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇలా ఏవో కొన్ని మాత్రం బాగా గుర్తుండిపోయాయి. 

 

మా బిట్రగుంట ఆవరణ స్నేహితులు ఉత్తరాలు వ్రాస్తే రైల్వే codes లో ఊర్ల పేర్లు చెప్పేవారు. BTTR – బిట్రగుంట  NLR – నెల్లూరు , BZA విజయవాడ. మా తాతయ్య చాలా సంబరపడేవారు మేము ఇలా ఊరి పేరు  చెప్పి రైల్వే కోడ్  చెప్తే.  అసలు ఆ రైలు భాష అర్ధం కావడానికి కొన్ని రోజులు బిట్రగుంట వాళ్ళతో ఉంటేనే అర్ధమవుతుంది.

 

స్టేషన్ లో రైలు దిగి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లేందుకు కొన్ని రైల్వే క్వార్టర్లు దాటి వెళ్ళాలి. రాత్రుళ్ళు అందరూ బయట నులక మంచాలు వేసుకుని పడుకునే వారు.  ఎప్పుడైనా నెల్లూరులో ఫస్ట్ షో చూసి తిరుమల ఎక్స్ ప్రెస్ ఎక్కి వచ్చేవాళ్ళం. అలా నులక మంచాలలో పడుకున్నవారు, ఎంత మాంఛి నిద్రలో ఉన్నా లేచి ‘ రైట్ టైమేనా బండి?  లేటా?’ అని అడిగి మళ్ళీ పడుకునేవారు. అలా ఒకరు కాదు. కనీసం ఇద్దరైనా అడిగేవారు. నిద్ర కూడా పోకుండా ఇదెక్కడ తాపత్రయం అని నవ్వుకునేవాళ్ళం హైదరాబాద్ నుంచీ సెలవలకి వెళ్ళిన మేము.

 

ఢిల్లీ నుంచీ మద్రాస్ వెళ్ళే తమిళనాడు ఎక్స్ ప్రెస్ ఎంత స్పీడుగా వెళ్తుందో చెప్పేవాళ్ళు మా ఆవరణలో మాతో ఆడుకునే పిల్లలు. ఆ చెప్పేటప్పుడు చూడాలి వాళ్ళ కళ్ళలో వెలుగులు!! ఎంత స్పీడో చూద్దామని దాన్ని చూడటానికి పొద్దున్నేలేచి వెళ్ళేవాళ్ళం. జయంతి జనతా ఎక్స్ ప్రెస్ , హౌరా మెయిల్,  నవజీవన్ ఎక్స్ ప్రెస్ ఇలాంటివెన్నో మా కబుర్లలో వచ్చేవి కూడా.

 

ఇక అన్నిటికంటే స్పెషల్ ట్రైన్. GT Express!! Grand Trunk Express!! అసలు బిట్రగుంట చరిత్ర బ్రిటిష్ వారి వలన ఈ రైలు తోనే మారింది అని కూడా చదివాను ఎక్కడో .  లోకో షెడ్ లో ఒకేసారి 59 ఇంజిన్లు ఉండేట్లు కట్టారుట . ఇంజిన్ మార్చడం కూడా బిట్రగుంటలో చేసేవారు. బొగ్గు ఇంజిన్లు పోయి డీజిల్, ఎలక్ట్రికల్ ఇంజిన్లు వచ్చి, GT Expressకి బిట్రగుంటలో స్టాప్ ఎత్తేసినా కూడా చింత చచ్చినా పులుపు చావనట్లు మా బిట్రగుంట వాసులు అది వాళ్ళ సొత్తన్నట్లే డాబులు పోతూ మాట్లాడేవారు :).

BTTRSHED

ఇలా ఎక్స్ ప్రెస్ ల పేర్లు అన్నీ వింటుంటే మాకు వాటిని ఎక్కాలని మహా కోరికగా ఉండేది. మా నాన్నగారు కూడా LTC వెళ్ళినప్పుడు ఆ రైళ్లు అలాగే బుక్ చేసేవారు.  అలా జ్ఞాపకంగా ఉన్న రైళ్లు  తమిళనాడు ఎక్స్ ప్రెస్. దాంట్లో ఢిల్లీ నుంచీ  వరంగల్ వచ్చి అక్కడ నుండీ హైదరాబాద్  వచ్చాము.  ఇంకోసారి  విజయవాడలో  GT ఎక్కి నెల్లూరు లో దిగి తిరుపతి పాసెంజర్ లో తిరుపతి వెళ్ళాము.  పైగా ఫస్ట్ క్లాస్ లో వెళ్ళాము. బిట్రగుంటకి  వెళ్ళినపుడు గొప్ప చెప్పుకోవద్దూ మరి !! 

 

బిట్రగుంటలో ఇంకొక స్పెషల్ ఏంటంటే డ్రైవర్లు, గార్డులు కూడా మారేవారు. అది ఈ మధ్య దాకా ఉండేది. చాలా మంది డ్రైవర్లు విజయవాడ లో పని చేసినా కుటుంబాలు ఇక్కడే ఉండేవి. బిట్రగుంట వాళ్ళు ఎప్పుడైనా విజయవాడ నుంచీ వస్తూ ఉంటే  డ్రైవర్/గార్డ్ మనవాళ్ళా కాదా అని చూసుకునే వారు. ఏ బిట్రగుంట డ్రైవేరో అయితే ఆపమనేవారు. ఒకసారి మా నాన్నగారు GT ఎక్కబోతూ ‘బిట్రగుంటలో స్లో అవుతుందా’ అని ఇంజిన్ దగ్గరకి వెళ్ళి డ్రైవర్ని అడిగారట. ’స్లో అవుతే బిట్రగుంటలో దిగిపోదాంలే. మళ్ళా నెల్లూరు దాకా వెళ్లి ప్యాసెంజర్ ఎక్కడం దేనికి’ అనుకుంటూ. ‘బిట్రగుంటోళ్ళా మీరు?  స్లో ఎందుకండీ ఆపేస్తాను. నెమ్మదిగా దిగి వెళ్ళండి’ అని చెప్పి ఆపాడట ఆ డ్రైవర్. ఊర్లో ఏడ్రైవర్ ఫాస్ట్ గా వెళ్తాడో, ఏ డ్రైవర్ స్లో గా వెళ్తాడో అవి కూడా కథలు గా చెప్పుకునేవారు.. నెల్లూరు సినిమా వెళ్ళాలి అంటే డ్రైవర్ ని చూసి ‘ ఓయమ్మో!! Mr.x  ఉన్నాడు. ఇహ ఆయన తోలితే సినిమా చూసినట్లే ఈ రోజు’ . ఇలా అనుకునేవారు. గౌస్ అనే డ్రైవర్ కి చాలా మంచి పేరు. సాల్మన్ అనే డ్రైవర్ కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లాంటి సూపర్ ఫాస్ట్ లు నడిపేవాడు. అతనికి కూడా చాలా మంచిపేరు. సూపర్ ఫాస్ట్ అయినా సరే, ఊళ్ళో వాళ్ళు అడగటం ఆలస్యం రైలు ఆపేసేవాడు అనే వారు. పినాకిని ఎక్స్ ప్రెస్  పెట్టిన కొత్తల్లో బిట్రగుంటకి స్టాప్ ఇవ్వలేదు. ఊరుకుంటారా మరి? రోజూ బిట్రగుంట వచ్చేసరికి చైను లాగేవారు. అది ఎవరు లాగారు  అనేది కనిపెట్టడం ఎవ్వరి వల్లా కాని పని. అందుకని ఈ చైను లాగే బాధ నుంచీ తప్పించుకోవడానికి ఏ డ్రైవర్ అయినా సరే ఔటర్లో కాసేపు ఆపేవారు.

 

ఇందులో ఓ చిన్న పిట్ట కథ: 

నేను మొట్టమొదటిసారి అమెరికా వచ్చినపుడు చెన్నైలో విమానం ఎక్కాను. అమెరికాలో ఉండే మాబావగారు నాకు తోడుగా Frankfurt  వరకూ వచ్చి , అక్కడ నేను మారాల్సిన విమానము ఎక్కిస్తాను అని చెప్పడంతో ఆయన తోటే విజయవాడ నుండీ చెన్నై బయలుదేరాం. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కాము. మా బావగార్లు, మావారి కజిన్లు, అమ్మ, నాన్న, తమ్ముడు ఇలా అందరం. మా మావయ్య బిట్రగుంటలోనే పని చేసేవాడు( బుకింగ్ క్లర్క్) . నేనెప్పుడు బయలుదేరుతున్నానో కనుక్కుని తను కూడా చెన్నై వస్తానని చెప్పాడు. మేము ప్రయాణిస్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బిట్రగుంటలో ఆగింది. మావాళ్ళందరూ  ‘ఇక్కడ ఆగదు కదా.ఆగిందేంటి’ అనుకుంటున్నారు. నేను ‘మా మావయ్యఎక్కి ఉంటాడేమో అందుకని ఆగింది’ అన్నా. అమెరికా బావగారు తెల్లబోయి ‘అదేంటి’ అన్నారు. ఇప్పుడు ఆయనకి గుర్తుందో లేదో కానీ ఈ కథంతా చెప్పా. చెన్నైలో దిగగానే మా మావయ్యని చూసి మా బావగారికి మతిపోయింది. 

**************************************************************************

ఎప్పుడో 1880ల్లో  బిట్రగుంటలో  రైల్వే కంటోన్మెంట్  వచ్చింది  అని చెప్తారు. అక్కడ  ఉన్న ఆ భవంతులని  కానీ, లోకోషెడ్ ని కానీ   ఓ చరిత్ర క్రింద చూపించి  ఓ మ్యూజియం లాగా  చేయవలసింది పోయి రైల్వే వారు ఆ లోకోషెడ్ scrap  క్రింద అమ్మేసి  ఆ అవశేషాలు కూడా  లేకుండా చేసారు అని విన్నాను. తెలుగు మీడియం స్కూల్ కి కూడా అదే గతి పట్టించారు అన్నారు మరి. ఆ రైల్వే వైభవం చూసిన మాకు ఇటువంటివి వింటుంటే బాధగా ఉంటుంది.

Photos Source : Google