భాష & సంస్కృతి → రామాయణం కోణంలో

Ami Ganatra గారు రామాయణం గురించి podcast లలో మాట్లాడుతుంటే వేలకొద్దీ వీక్షణలు కనిపిస్తున్నాయి. గంట- గంటన్నర వీడియో అయినా ఓపికగా చూస్తున్నారు అంటే, ‘అసలు విషయం ఏమిటి’ అని తెలుసుకోవడానికి మనుష్యులు సిద్ధంగా ఉన్నారు అనేది స్పష్టం. మొన్న ఎప్పుడో ‘ఈమాట ‘ కథ చదివాక వ్రాసుకున్న పోస్టు ఇది. ఇప్పుడు పెడుతున్నాను.

ఓ ‘భారతీయ భాష’ అనేది సామాన్యుడికి దూరం కావాలని పత్రికలు కూడా పనిగట్టుకుని ఇటువంటి కథలు ప్రచురిస్తున్నాయా అనిపించింది ఓ కోణంలో నాకు. Revive అవుతూ ఇప్పుడిప్పుడే పునరుద్ధరించుకుంటున్న సంస్కృతిపై చిగళ్ళు కూడా మొలకెత్తనివ్వకుండా చేస్తున్నారా ?

రామాయణం అనేది భారతీయ సంస్కృతి లో ఓ భాగం👇👇👇👇👇

భారత దేశంలో ఏ మూల వెళ్ళినా ఆ ప్రదేశానికి రామాయణంతో లంకె ఉంటుంది. పండితులు లేదా పామరులు అన్న బేధం లేకుండా ప్రతీ వారూ రామునితో తమని తాము identify చేసుకుంటారు. ‘అయ్యో రామ’ అనేది తెలుగు వారి ఊతపదం. సీతారాములవారు లేని తెలుగు వారి పెళ్లిపత్రిక ఉండదు. ఇంట్లో పెద్దవారిని ఏదైనా కలిపించుకుంటే సాధారణంగా అనే మాట ‘ కృష్ణారామా అనుకుంటూ కూర్చోవచ్చు కదా’ . ఇలా ఎన్ని రకాలుగా చెప్పుకున్నా రామాయణం అనేది భారతీయ సంస్కృతి అనేది స్పష్టం.

రాముడే ఎందుకు ?👇👇👇👇👇

భక్తి అంటే భగవంతుడుని ఒక రూపంలో గుండెల్లో దాచుకోవడము. ఓ సాధారణ మానవుడికి ఎన్ని లౌకిక విషయాలలో మునిగి తేలుతూ ఉన్నా , ఒక్కసారి ఆ భక్తి భావం అనేది ఏర్పడ్డాక ఎక్కడ చూసినా ఆ రూపమే కనిపిస్తుంది. రాముడు ఒక మానవుడిగా అవతారం ఎత్తి మనుష్యులతో నివసించాడు కాబట్టి, ఆ రూపం అనేది అందరి మనసులకీ దగ్గరయిన భగవద్ రూపం. అందుకే ఆయన భారతీయ సంస్కృతిలో భాగం అయిపోయాడు.

రామాయణం పై తెలుగు సాహిత్యం 👇👇👇👇

రామాయణం వాల్మీకీ మహర్షి రచించిన ఆది కావ్యం. వాల్మీకి మహర్షి ఆ కావ్యంలో ఓ పాత్ర కూడా. రాముడికి సమకాలీనుడు.

1 తెలుగులో వ్రాసిన ముఖ్యమైన రెండు రామాయణములు → భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం.

2 పోతన ‘పలికించెడి వాడు రామభద్రుడు’ అంటూ భాగవతం అనువాదం మొదలుపెట్టాడు.

3 మొల్ల దాదాపు 800 పద్యాలతో రామాయణం రచించింది.

4 అన్నమయ్య, రామదాసు , త్యాగయ్య మొదలయిన వీరందరూ తమ పదసాహిత్యంతో రాముని కీర్తిస్తూ వాగ్గేయకారులయ్యారు. వారికి రామునిపైన ఎనలేని భక్తి. ఆ భక్తిలో మునిగితేలారు వారు. దెబ్బలకు తట్టుకోలేక నిందాస్తుతి చేసిన కంచెర్ల గోపన్న , వెంటనే ‘ అబ్బా తిట్టితిని’ అని కూడా వాపోయాడు.

5 త్యాగరాజు గారు రోజూ వాల్మీకి రామాయణం పారాయణ చేసేవారుట .

‘ అలకలల్లలాడగ’ అనే ఈ కీర్తనలో విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి ఎలా పొంగిపోయారో చాలా వివరంగా చెబుతారు. వాల్మీకి రామాయణంలో విశ్వామిత్రుల వారు దశరథుడిని వచ్చి, మారీచ సుబాహుల నుండీ తన యాగం రక్షించడానికి ఒక కొడుకుని పంపమని అడుగుతారు. అది కూడా ఏ కొడుకుని పంపాలో చెబుతూ ‘ఆ ముంగురులు మొహాన పడుతుండే ఆ పెద్ద కొడుకునే’ పంపమని అడుగుతారట.

ఆ సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని వ్రాసిన మధ్యమావతి కృతి ఇది. ఇక్కడ అలకలు అంటే ముంగురులు. విశ్వామిత్రుల వారు రాముడ్ని చూసి పొంగిపోయే ఘట్టాలు రెండిటినీ ఈ కృతిలో చూస్తాము 👇👇👇👇👇👇

ప. అలకలల్లలాడగ కనియా

రాణ్మునియెటు పొంగెనో

అ. చెలువు మీరగను

మారీచుని మదమణచే వేళ (అ)

చ. ముని కను సైగ తెలిసి శివ

ధనువును విరిచే సమయ-

మున త్యాగరాజ

వినుతుని మోమున రంజిల్లు (అ)

వాల్మీకి రామాయణం చదవటం ఒక ఎత్తు. ఆ భక్తిని ఒక కృతిలో ఇంత అందంగా అక్షరాలని పేర్చడం ఒక ఎత్తు. చాగంటి వారు, వేటూరి వారు త్యాగరాజుల వారి భక్తి గురించి ఈ కృతినే ప్రస్తావించారు. విశ్వామిత్రుడి గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా త్యాగరాజుల వారు ఆయనే విశ్వామిత్రుల వారిని స్వయంగా చూసినట్లు పాడారు .

ఇలా ఈ విధంగా రామాయణంని అనేకమంది కవులు ఎన్నో రకాలుగా ఎంతో అందంగా వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

సాహిత్యంలో ప్రక్రియలు కవి యొక్క సృజనాత్మకత సూచిస్తాయి. అన్నమయ్య ఒకే విషయం చెప్పినా ఎన్నో రకాలుగా చెబుతాడు. తెలుగులో వ్రాసిన భాస్కర రామాయణం, రంగనాథ రామాయణం రెండిటిలో అవాల్మీకాలు ఉన్నాయి. ఉడుత కథ లాంటివి. ఓ ఉడుత & దాని పైన ఆ చారలు చూడగానే రాముడు గుర్తు రాకపోవడం అంటూ ఉండదు. ఇటువంటి ప్రక్రియలు సంస్కృతిని పెంపొందించేవే కానీ సంస్కృతిని పునాదులు పెకిలించడం అనేది లేదు. ఆనాటి అన్నమయ్య నుంచీ ఈరోజు శ్యామలరావు గారు లాంటి వారి వరకూ సాహిత్యంలో రాముడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు ఆంటే రాముడు ఒక సంస్కృతి అనే మాట చెబుతూనే ఉన్నారు. . సామాన్యుడు రాముడికి దగ్గరయ్యేలా చేస్తూనే ఉన్నారు.

భారతీయ సంస్కృతి పునర్జీవనం (Cultural Revival)👇👇👇👇👇

చిన్నప్పుడు ఎప్పుడో 10వ తరగతి వరకూ తెలుగు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ చదువుల వల్ల తిరిగి చదివే అవకాశం లేక, ఇప్పుడు తిరిగి తెలుగు చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు ‘సంస్కృతభారతి’ లాంటి బళ్ళలో చేరి సంస్కృతం కూడా చదువుకోవడం మొదలు పెట్టారు. కొందరు సంగీతం నేర్చుకుంటున్నారు. ఈమధ్య సోషల్ మీడియా వల్ల కావచ్చు. covid లో lockdownలో దొరికిన సమయం వల్ల కావచ్చు. ఈ ధోరణి బాగా కనిపిస్తోంది. పైగా అంతర్జాలంలో బోలెడు సమాచారం దొరకడం మూలాన, ఎంతో మంది పైన చెప్పిన విధంగా ఎన్నో విషయాలు సునాయాసంగా తెలుసుకుంటున్నారు.

అయోధ్య తీర్పు వెలువడిన వెంటనే కొన్ని కోట్లమంది భారతీయులు ఆనందంతో సోషల్ మీడియాలో profile picture మార్చుకున్నారు. అది ‘ఇంకొకరిపై గెలిచాము’ అన్న ఆనందం కాదు. ‘రాముడికి గుడి కడతారు’ అన్న ఆనందం. అయోధ్యలో అన్ని వేల దీపాలు వెలిగిస్తే, కొన్ని లక్షల మంది సోషల్ మీడియాలో చూసి తరించారు.

మార్పు ఏ విధంగా చోటు చేసుకుంటోంది అనడానికి , ఈ మధ్య ముఖ పుస్తకంలో వల్లీశ్వర్ గుండు గారు వ్రాసిన వ్యాసం ‘రానున్న ఒక పెను మార్పుకి ఇది సంకేతమా ? అన్నది ఒక ఉదాహరణ.

ఇటువంటి ఈ మార్పుకి కారణం భాజపా పాలన కొంత కారణం అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశ్యంలో → Y2K వలన కూడా భారతదేశం నుండీ పాశ్చాత్యదేశాలకి వెళ్తున్న భారీ వలసలతో అనేక కుటుంబాలకి ఆర్థికబలం పెరగడం ఇంకో కారణం. బొజ్జ నిండా పాలు త్రాగాకే చిన్నారులు నవ్వులు చిందిస్తారు కదా మరి !! అందుకే సంస్కృతి గురించి ఆలోచించడం మొదలు పెట్టారు . అదే మార్పుకు కారణం అవుతోంది.

ఆధునిక సాహిత్యపు విషవృక్షాలు 👇👇👇👇👇

‘భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలి, అందునా ముఖ్యంగా సాహిత్యాన్ని కాపాడుకోవాలి’ అన్న ఉద్దేశ్యంతో ఈ విధంగా కొందరు పునరుద్ధరణకై పూనుకుంటున్నా, జరగవలసిన నష్టం భారీగానే జరిగిపోయింది. మేధావీ వర్గం, కలం అనే ఆయుధంవాడుకుంటూ & అవార్డులు అంది పుచ్చుకొంటూ కొన్ని తరాలని భారతీయ సంస్కృతికి, భాషకి దూరం చేసేసారు. ఆ కలమే తిరిగి వారి వారసులకు అందించారు. అందిస్తున్నారు ఇంకా…. నేను కేంద్రీయ సాహిత్య అకాడమీ అవార్డుల గురించి వ్రాసిన వ్యాసం చూడవచ్చు .

ఈ అవార్డుల సాహిత్యం వివిధ దేశ విదేశీ భాషల్లోకి అనువాదం కావించబడి, ఒక documented literature గా మారిపోతోంది. ఇక పాఠ్యాంశాలలోకి కూడా వెళ్తోందేమో తెలీదు మరి. ఈ కలుపు మొక్కలు, విషవృక్షాలై సాహిత్య ప్రపంచమంతా వ్యాప్తి చెందుతున్నాయి.

తెలుగు భాషంటే ఆసక్తి 👇👇👇👇👇

సృజనాత్మకత అన్న పేరుతో వాల్మీకి వ్రాసిన రామాయణానికి విరుద్ధంగా ఉన్న కథలు వ్రాస్తారు మేధావీ వర్గం. ఇప్పుడిప్పుడే భాష నేర్చుకునే వారికి (పైన చెప్పాను ) మ్రింగుడు పడవు. వారికి తెలుగు సాహిత్యం అనేది ఎటువంటి దృష్టి కోణాన్ని చూపుతుంది ? ‘ నను బ్రోవమనీ చెప్పవే సీతమ్మ తల్లీ’ అని భజన చేసేవారు, ‘సీతమ్మ మాయమ్మ ‘ అని త్యాగరాజు గుర్తు చేసుకునే వాళ్ళు ఆ కథలను చదివి ఆమోదించగలరా ?సంస్కృతికి విరుద్ధంగా వ్రాసే కథ ‘తెలుగు భాష ‘ కొత్త తరాలకి నేర్చుకుందాం అనే ఆసక్తి కలిగిస్తుందా లేక ఓ త్యాగరాజు కీర్తన ఆసక్తి పెంచుతుందా ?

ఓ పక్క ఎంతో మంది Cultural Revival కోసం పని చేస్తూ ఉంటే , ఇంకా ఇటువంటి కథలు వ్రాయడంలో ఈ రచయితల ఉద్దేశ్యం ఏమిటి ? మనోభావాలు దెబ్బతినడం పక్కన పెడితే, కథాంశమే ‘ఇటువంటి రాముడిని నేను పూజించానా ?’ అన్న ఆత్మనూన్యతకి గురి చేస్తుంది. తమ సంస్కృతినే సందేహించడం మొదలు పెడ్తాడు పాఠకుడు.

’ ‘అటువంటి రామాయణం చదివితే ఎంత చదవకపోతే ఎంత’ అని భాష చదివి పెంపొందించుకోవాలి అన్న ఆసక్తి కూడా చంపేస్తుందేమో అనిపిస్తుంది కూడా.

సాహిత్యం అంటూ బావుంటే …. 👇👇👇👇👇

ఏదైనా సాహిత్యం లో సృజనాత్మకత అంటూ బావుంటే అది ఏ భాషలో వ్రాసారో అన్నది పాఠకుడికి అనవసరం. దానిని పట్టుకోవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాడు.

‘శంకరాభరణం’ చిత్రం హీరో, డ్యూయెట్ పాటలు లేకుండా తీసిన సినిమా. ఇన్నేళ్ళు అయినా కొన్ని తరాలు మర్చిపోలేదు. ఇంకొక ఉదాహరణ ‘Harry Potter’. అర్ధరాత్రి లేచి కొట్టు దగ్గర పడిగాపులు కాచి , ఆ పుస్తకం కొన్న పిల్లలు ఉన్నారు. OTT లో ‘మలయాళం ‘ సినిమాలు బావున్నాయి అంటూ subtitles పెట్టుకుని చూస్తున్నవారు ఉన్నారు. చైనాలో బాహుబలి సినిమా చూసిన వారు ఉన్నారు. భాషతో సంబంధం లేదు వారికి . ఆ సాహిత్యం లో ఆ సృజనాత్మకత నచ్చింది అంతే !

ముగింపు 👇👇👇👇👇

ఏ భాష సాహిత్యం ఆ భాషకి సంబంధించిన సంస్కృతి గురించి చెప్తుంది. మేధావీ వర్గం కథలు భారతీయ సంస్కృతి పైనే విషం చిమ్ముతూ, తమ పూర్వికుల నమ్మకాలనే పరిహసిస్తుంటే ‘భాష నేర్చుకోవాలి’ అనే అనురక్తి భావితరాలకు ఎందుకు ఉంటుంది ?

సృజనాత్మక సాహిత్యం , ఆ సంస్కృతిని కూడా కలుపుకుంటూ అందులోని విషయాలను గొప్పగా చెబుతూ ఉంటే భాష మీద ఆసక్తి కలిగి ఆ భాష విస్తరిస్తుంది. కాబట్టి, రచయితలు భావితరాలని దృష్టిలో పెట్టుకుని → వారి సృజనాత్మకతకి పదును పెడుతూ → మేధావీ వర్గం చేతిలో కలం ఉన్నది అన్న విషయం సామాన్య పాఠకులు మర్చిపోయేలా చేసేలా → అద్భుతమైన రచనలు చేయాలి.

నేను ఇటీవలి కాలం లో చాలా చక్కటి కథలు చదువుతూ ఉన్నాను. ఆ కథల గురించి ముందు ముందు వచ్చే పోస్టులలో వ్రాస్తాను🙏🙏.

13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రసంగం

(మొదటి సారి కదా కొంచెం గొప్పలు ఎక్కువ చెప్పుకుంటున్నాను )👇👇👇👇👇👇👇👇

సాహిత్యంలో నాకున్న పరిజ్ఞానం, అనుభవము చాలా తక్కువ. నన్ను నేను ఓ సామాన్య పాఠకురాలిగా భావించుకుంటాను. సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం నుండీ MA రెండవ సంవత్సరం చదువుతూ సాహిత్యంలో ఇప్పుడిప్పుడే అ ఆ లు దిద్దుతున్నాను. కాబట్టి నా ప్రసంగంలో తప్పులేవైనా ఉంటే మన్నింప ప్రార్థన.

నా గురించి నేను చెప్పాలి అంటే ఒక విషయం తప్పక చెప్పాలి .
నా యొక్క ఈ అస్థిత్వం అంటే భారతీయ/సనాతన/హిందువు/బ్రాహ్మణ /తెలుగు/ వీటిల్లో ఏ భావంతో నన్ను చూసినా, ఈ అస్తిత్వం ఇలా ఉండటానికి కారణం → ఎన్నో ప్రయాసలకు లోనైనా సరే , దానిని నిలబెట్టుకున్న నా పూర్వీకుల నిర్ణయం వల్లనే అని నూటికి నూరుపాళ్ళు నమ్ముతాను.

ఈనాడు నేను మాట్లాడ బోయే అంశము 👇👇👇👇
సాహిత్యము లో సమకాలీన చరిత్ర, సామాజిక పరిస్థితులు మరియు చరిత్ర యొక్క ఆవశ్యకత

సాహిత్యము అనేది ఒక మనిషి జీవన విధానంలో తెలియకుండానే చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. అవి పురాణేతిహాసాలు కావచ్చు. నాటకాలు కావచ్చు. జానపద సాహిత్యం కావచ్చు.

సాహిత్యము అనేది ఒక కధను నాటకీయంగా చెబుతూనే ఇంకో కోణంలో అప్పటి సమకాలీన చరిత్ర మరియు సామాజిక పరిస్థితులు కూడా చెప్తుంది.

ఒక ఉదాహరణ : 👇👇👇👇

పోతన గారి భాగవతంలో శివుడు హాలాహలం భక్షణం చేసినపుడు పార్వతీ దేవి గురించి ఈ పద్యం చెప్తాడు :
మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!”

అంటే ఇక్కడ ఆనాడు తెలుగు వారి ఆచారాలలో మాంగళ్య ధారణ ఉండేదని, అది చాలా ముఖ్యమైనదనీ స్పష్టమవుతుంది. ఇక పోతన గారి భాగవతంలో శ్రీకృష్ణుడి లీలలు చదువుతుంటే తెలుగువారి జీవన విధానం కళ్ళముందుంటుంది కానీ ఎక్కడో ఉత్తరభారతాన ఉన్న మధురలోని బృందావనం గుర్తు రాదు మనకి. ‘అన్నం తినకపోతే బూచాడు ఎత్తుకుపోతాడు’ అంటే భయపడే తెలుగు శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు.

వీటిని బట్టి ఆనాటి సామజిక పరిస్థితులు కనిపిస్తాయి.
ఈ విధంగా సాహిత్యంలో ఆనాటి పరిస్థితులు గత చరిత్రలో ఒక అస్థిత్వాన్ని మనకి తెలియజేస్తాయి . అంటే ‘ఓహో తెలుగు వారు ఇలా ఉండేవారు కాబోలు ’ అని.

చరిత్ర యొక్క ఆవశ్యకత 👇👇👇👇
అయితే చరిత్ర అనేది ఎందుకు తెలుసుకోవాలి ? గతం గతః అని వదిలివేయచ్చు కదా? అయిపోయిందేదో అయిపొయింది. చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అంటే , ఒక అస్థిత్వాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా జాతి మీద జరిగిన అకృత్యాలు, మారణహోమాలు జరిగి ఉంటే , అటువంటివి పునరావృత్తం కాకుండా ఏమి చర్యలు తీసుకోవాలో, తెలుసుకోవడానికి చరిత్ర తెలుసుకోవాలి.

ఆ అస్థిత్వాన్ని కాపాడుకోవాలి అంటే మొదట ఆ జాతిమీద జరిగిన దారుణాలు గుర్తింపబడాలి. తరువాత కొత్త చట్టాలు రూపొందించడం, ఆ చట్టాలు అమలు పరచడం ద్వారా ఆ అస్థిత్వాన్ని కాపాడ గలుగుతాము. అంతే కాదు తరువాతి తరాలు కలిసిమెలిసి ఉండేలా చేయాలి అంటే ఈ ఇద్దరి జాతుల మధ్య సయోధ్య కుదరాలి. అంటే reconciliation . ఇందులో సాహిత్యం కూడా చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది.

అందుకు ఉదాహరణలు:👇👇👇👇
ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధంలో యూదులపైన జరిగిన మారణహోమం. ఈ అంశం పైన ఎంతో సాహిత్యం వచ్చింది. యూదులపై అటువంటి చరిత్ర పునరావృత్తం కాకుండా ఎన్నో చట్టాలు వచ్చాయి.

ఇంకొకటి ఆఫ్రికా జాతుల వారి మీద జరిగిన అకృత్యాలు. . వారిని బానిసలు గా అమ్మివేయబడటం, వారి పైన మారణకాండ, దాష్టీకాలు ఎన్నో జరిగాయి. . అలాగే వారి అస్తిత్వం కాపాడటం కోసం ఎన్నో చట్టాలు వచ్చాయి. ఈ అకృత్యాల మీద సాహిత్యంలో ఉదాహరణలు Roots నవల, To Kill a Mockingbird నవల.

ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ఈ సాహిత్యం పాఠ్యాంశాలుగా బళ్ళలో పిల్లలకి బోధిస్తున్నారు..అమెరికాలో పిల్లలు 8వ తరగతిలోనే To Kill a Mockingbird పాఠ్యాంశంగా చదివుతారు.

సాహిత్యం ఈ విధంగా ఒక అవగాహన కల్పించి ఈ అకృత్యాలని ప్రపంచం గుర్తించేలా చేస్తుంది . అందుకే ఇందులో సాహిత్యం పోషించే పాత్ర చాలా ఎక్కువ.

భారతభూమిపై జరిగిన అకృత్యాలు 👇👇👇👇
ఇవి దాదాపుగా వరుసగా వెయ్యేళ్ళ పాటు కొనసాగాయి. . మతం పేరుతో ఎన్నో మారణహోమాలు, ఆడవారి పైన మాన భంగాలు, వారిని బానిసలని చేసి అమ్మడం వంటి అకృత్యాలు ఎన్నో జరిగాయి..
భారతీయులు పవిత్రంగా భావించే పుణ్య క్షేత్రాలలోని గుళ్ళ మీద 7 వ శతాబ్దం మొదలు కొని 17 వ శతాబ్దం వరకూ ఎన్నో దాడులు జరిగాయి. ఆనాటి భారతీయులు ప్రాణాలకు తెగించి గుడిని కాపాడుకున్నారు. ఈనాటికి కూడా కొన్ని ప్రాచీన గుళ్ళు చూసినపుడు తలలు తెగి పడిన విగ్రహాలు, సమాధులతో నిర్మాణాలు కనిపిస్తాయి అంటే ఆ దాడులు ఎంత దారుణంగా ఉండేవో ఊహించవచ్చు.
ఈ దేవతా మూర్తులని కాపాడుకునేవాళ్ళు. మళ్ళీ దాడి జరిగేది.
ఒక ఉదాహరణ : దక్షిణ భారతదేశంలో శ్రీరంగం దేవాలయం మీద రెండు సార్లు దాడి జరిగింది. ఒకటి ఖిల్జీ గవర్నర్ అయిన మల్లిక్ కఫుర్ చేసిన దాడి . తరువాత తుగ్లక్ సైన్యం చేసిన దాడి . రెండవ సారి దాడి జరిగినపుడు ఆ ఉత్సవ విగ్రహాన్ని ముందు కేరళ , తరువాత తిరుమల తరలించారు. అదే ఈనాడు మనం తిరుమలలో చూసే రంగమండపం. ఇలాగ భారతదేశం నలుమూలల జరిగిన అకృత్యాల గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు.

ఇవి ‘రాజుల మధ్యలో యుద్ధాలుగా పరిగణించవచ్చు కదా ‘అంటారేమో. కానీ ఇవి ‘మతదురహంకారంతో జరిగిన అకృత్యాలు’ అని పురావస్తు పరిశోధనల వలన, చరిత్రకారుల పరిశోధనల వలన నిర్ధారణ అయ్యింది. మరి ప్రపంచం భారతజాతి మీద జరిగిన అకృత్యాలు గుర్తించిందా ? గుర్తించలేదు. ఆనాడు ఈ రెండు జాతుల మధ్య సయోధ్య లేదు అనటానికి సాక్ష్యం భారతదేశం మూడు భాగాలయ్యింది.

అందుకే ఇటువంటివి పునరావృత్తం కాకుండా ఇటువంటి అకృత్యాలపైన చట్టాలు రావాలి. అంటే, ఈ అకృత్యాలపైనా విరివిగా సాహిత్యం రావాలి . పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధింపబడాలి.

ఈ అంశాలపైన తెలుగు సాహిత్యం 👇👇👇👇👇👇
** 1350-1440 మధ్యలో స్కాందపురాణం నుండీ కాశీ మహత్యాన్ని వివరిస్తూ కవిసార్వభౌముడు శ్రీనాథుడు వ్రాసిన కావ్యం ‘కాశీ ఖండం’. అంతకుముందు 1170లలో శ్రీహర్షుడు సంస్కృతంలో రచించిన ‘నైషధం’ కావ్యంలో దమయంతీ స్వయంవరంలో కాశీపట్టణ వైభవం గురించి వివరిస్తాడు. ఈ సాహిత్యం ప్రాచుర్యంలో ఉన్నది కానీ చరిత్రకారులు చెప్పే, ఢిల్లీ సుల్తానుల ఆదేశం ప్రకారం, 1190 ల నుండీ 1670 దాకా ఎన్నో సార్లు నేలమట్టమైన కాశీ గురించి సాహిత్యంలో ఎక్కడైనా ఉటంకించారా అన్నది ఒక ప్రశ్న.

** దుర్భాక రాజశేఖర కవి 1888 లో రాణా ప్రతాపుని చరిత్రను వస్తువుగా తీసుకుని ‘రాణా ప్రతాప చరిత్ర’ అనే ఐదు ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

** 1897లో గడియారము వేంకట శేష శాస్త్రి శివాజీ చరిత్రను వస్తువుగా తీసుకుని ‘శివభారతము’ అనే ఎనిమిది ఆశ్వాసాల కావ్యం వ్రాసారు.

**రజాకార్ల యొక్క అరాచకాల మీద దాశరధి రంగాచార్య గారు వ్రాసిన ‘మోదుగుపూలు ‘ లాంటి నవల ఉన్నది.

**‘బండెనుక బండికట్టి’ అనే జానపద గేయం ఆనాటి చరిత్రని స్పష్టంగా చెప్తుంది.

**సంచిక పత్రిక లో కస్తూరి మురళీకృష్ణ గారు అనువదిస్తున్న జోనరాజ ద్వితీయ రాజతరంగిణి కాశ్మీరు లో అరాచక చరిత్ర వివరిస్తుంది.

**తెలుగులో ఈ అరాచకాలని గురించి స్పష్టంగా చెబుతూ ఉన్న శతకాలు రెండు ఉన్నాయి. ఆ శతక కర్తలు అరాచక చరిత్రకి ప్రత్యక్ష సాక్ష్యులు.

1 తిరుమల గుడి పైన 1700లో గోల్కొండ నవాబులు చేసిన దాడి గురించి వేంకటాచల విహార శతకకర్త ‘నల్లకాల్వ వరకవి సీతాపతి’ ఆ శతకము లో చాలా విశదంగా వివరించారు. ఒక సీస పద్యం చూద్దాం.(see the picture)

2 ఇదేవిధంగా 1750లో సింహాచలం ఆలయం పైన దాడి జరగబోతోందని గోగులనాటి కూర్మనాథ కవి నిందాస్తుతి రూపంలో సింహాద్రి నారసింహశతకము అని నరసింహుడిని వేడుకుంటూ రచించారు 70 పద్యాల దాకా చెప్పగానే ఒక తుమ్మెదల గుంపు వచ్చినా కొండని ఆక్రమించిందని, ఆ సైన్యాన్ని తరిమికొట్టిందని చరిత్ర.

అందులో ఒకటి


సీ. పాశ్చాత్యుల నమాజుపై బుద్ధిపుట్టెనో
మౌనుల జపముపై మనసు రోసి
యవనుల కందూరియం దిచ్చ చెందెనో
విప్రయజ్ఞములపై విసువు బుట్టి
ఖానజాతి సలాముపై నింపు పుట్టెనో
దేవతాప్రణతిపై భావ మెడలి
తురకల యీదునందు ముదంబు గల్గెనో
భక్తనిత్యోత్సవపరత మాని
గీ. వాండ్రు దుర్మార్గు లయ్యయో వ్రతము చెడ్డ
సుఖము దక్కదు వడి ఢిల్లి చొరఁగఁదోలు
పారసీకాధిపతులఁ బటాపంచలుగను
వైరిహరరంహ! సింహాద్రి నారసింహ!

ఆధునిక తెలుగు సాహిత్యం కోణం 👇👇👇👇👇👇
ఒక వైపు తెలుగు ప్రాచీన సాహిత్యం ధర్మం తప్పకుండా ఎలా నడవాలి అని చెప్తూ , ఈ పుణ్యక్షేత్రాలు & ఆ వైభవాన్ని ఎంతో గొప్పగా చెప్తే, ఇంకొకవైపు ఈ సనాతనధర్మం , గుళ్ళలో మూర్తిపూజ అనేది ఒక మూఢనమ్మకం లాగా చెప్పిన ఆధునిక తెలుగు సాహిత్యం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అనే చెప్పాలి. ఇటువంటి ఈ ఆధునిక సాహిత్యం ఎంత ప్రచారం లో వచ్చింది అంటే ఎక్కడైనా ఎప్పుడైనా రామాయణం, రాముడు గురించి ప్రస్తావన వచ్చినపుడల్లా సామాన్యుల చర్చల్లో కూడా ఉండే విషయాలు
సీత అగ్నిప్రవేశం,
వాలిని చంపడం,
సీతని అడవుల్లో వదిలేయడం.
అంతే కాదు. రావణాసురుడు ద్రావిడ జాతికి చెందినవాడు. రాముడు ఆర్యుడనీ చెప్పే కథలు కూడా ప్రచారంలోకి వచ్చాయి.

అందుకు ఉదాహరణ ఇటీవలి కాలంలో వచ్చిన ‘విముక్త’ కథలు. ఆ కథలు చదివాక ఇది నాకు అనిపించిన భావము. రామాయణంలోని స్త్రీల గురించిన నేపథ్యంలో వచ్చిన కథలు. సీతాదేవి, అహల్య, రేణుకా దేవి, ఊర్మిళ ఇలా అందరిని పీడితుల్లాగా చూపించి పీడకుడు పీడితుడు అనే భావజాలంలోకి తెచ్చే ప్రయత్నం చేసారు రచయిత్రి. అంటే భర్త పీడకుడు. భార్య పీడితురాలు. ఇక్కడ సమస్య పరిష్కారం ఏమిటంటే స్త్రీ కి భర్త నుంచి విముక్తి . అంటే నేను ఇక్కడ బాధలు పడే స్త్రీలని కించపరచడం లేదు. నేను చెప్పేది ఏంటంటే రామాయణం అంటేనే భారతీయులకి ఎంతో స్ఫూర్తి. రామాయణంలో స్త్రీ పాత్రలు ఎంతో స్ఫూర్తి. అటువంటి స్త్రీ పాత్రలను ఇలా భావజాలపు చట్రంలో ఇరికించడమూ, రాముడు ‘ఆర్యుడ’ని అని చెప్పడం అనేది చాలా బాధాకరం.

ఈ విధంగా ప్రాచుర్యంలో వచ్చిన ఆధునిక సాహిత్యం వలన ఏమి జరిగింది మనకి?👇👇👇👇👇👇
భారతజాతిపై జరిగిన అన్యాయాలు & అకృత్యాలు ప్రపంచానికి తెలియనందువలన, ఎంతో మంది ప్రాణాలు వదిలేసిన ఆ జాతికి తీరని అన్యాయం జరిగింది అని చెప్పాలి. అంతే కాదు . భారత సంతతి తమ పూర్వీకులను తామే అసహ్యించుకునేలా చేసింది.

ముగింపు 👇👇👇👇👇👇
ఏ జాతి పైన అకృత్యాలు జరిగాయో , ఎప్పుడైనా సరే ఆ జాతే ఆ అకృత్యాల గురించి ధైర్యంగా మాట్లాడాలి.

భారతీయులుగా భారత సాహిత్యంలో భారత చరిత్ర చెప్పనంత కాలం ప్రపంచానికి 1200 ఏళ్ళపాటు భారత జాతి మీద జరిగిన అకృత్యాలు ఏనాటికి తెలియవు.

**********************************************************
ఈ సదవకాశం నాకిచ్చిన వంగూరి వారికీ & సిలికానాంధ్ర వారికి అనేకానేక ధన్యవాదములు 🙏 🙏 🙏

ఈ ప్రసంగంలో పంచుకున్న అభిప్రాయాలన్నీ నావే అని గమనించవలసిందిగా ప్రార్థన.🙏 🙏 .

References:👇👇👇👇👇👇
వేంకటాచల విహారశతకం – నల్లకాల్వ వరకవి సీతాపతి
సింహాద్రి నారసింహ శతకము-గోగులపాటి కూర్మనాధ కవి
చారిత్రక సామాజిక నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర by డా॥ ముదిగంటి సుజాతా రెడ్డి
Flight of Deities – Dr.Meenakshi Jain
Anveshi-An Explorer’s Journey,

‘విముక్త’ కథలు – ఓల్గా

ఔరంగజీబుని బతికిస్తున్నారు

ఓ పోస్టు వ్రాయడానికి ఆ మధ్య మొఘల్ రాజుల ( కాదూ కాదూ దొంగలు) చరిత్ర చదివాను. అందులో భాగంగా ఓ పాకిస్తాన్ చరిత్రకారుడి మాటలు విన్నాను. ఓ భారతీయ చరిత్రకారుడు మాటలూ విన్నాను. ఒకరు కుడి . ఒకరు ఎడమ. చరిత్ర కదా ఇద్దరూ ఒకటే మాటలు చెప్పారు.

జహంగీర్ (అనార్కలి – సలీం) కొడుకుని గుడ్డి వాడ్ని చేసి చిత్ర హింసలు పెడతాడు.

జహంగీర్ గారి భార్య నూర్జహాను సింహాసనం అధిష్టించేందుకు తన కూతుర్ని సవతి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేస్తుంది.

ఈ గుడ్డి వాడ్ని, ఆ అల్లుడిని చంపుతాడు మన తాజ్ మహల్ నిర్మాణ కర్త.

ఈయనకి నలుగురు కొడుకులు. కుమారుడు ఈయనని ఖైదులో పెట్టిన విషయం అందరికీ తెల్సిందే. ఆ రోజుల్లో టర్కీలకు ఉండే ఓ వింత ఆచారం గురించి చెప్పారు ఇద్దరు చరిత్రకారులు. దేశాన్ని పరిపాలించే రాజుకి, ఒకరి కంటే ఎక్కువ కొడుకులు ఉన్నపుడు , ఆయన తదనంతరం ఎవరైతే సింహాసనం కావాలనుకుంటారో వారు వారి అన్నదమ్ములతో యుద్ధం చేయాలి. Throne or coffin అనే పద్ధతి. గెలిస్తే సింహాసనం లేదా సమాధి అని అర్ధం అట. అందుకే ఔరంగజేబు తన అన్నదమ్ముల్ని చంపాడట. సింహాసనం ఎక్కాడట. గుళ్ళో మూర్తులని ధ్వంసం చేయలేకపోతే గర్భగుళ్ళో మాంసం పడేసి రావడం ఈయన వంశస్థుల ఆచారంట . అందుకు ఈయన గుళ్ళు ధ్వంసం చేయడం ఆయనకో హాబీలా పెట్టుకున్నాడు. .

వావివరుస లేదు. దయాదాక్షిణ్యం లేదు. నా బళ్ళో పాఠ్యపుస్తకాలు ఈ దొంగల్ని ‘చక్రవర్తులు’ అని పరిచయం చేయడం, అది నేను చదవడం, మార్కులు తెచ్చుకోవడం. ఏ జన్మలో పాపం చేసుకున్నామా అనిపించక మానదు.

భారతదేశం అంటే రాముడు జన్మించిన భూమి. కృష్ణుడు గీతని బోధించిన భూమి.

అన్నయ్య ‘నేను తండ్రి మాట నిలబెడతాను. రాజ్యం పరిపాలన చేయను’ అంటే, ‘నీ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుంటా ‘అంటూ అన్నయ్య పాదుకలు తలమీద పెట్టుకుని తపస్సు చేసుకున్నాడు ఆ తమ్ముడు. దుషశిక్షణ అంటూ కన్న తండ్రిని చెరసాలలో బంధించిన రాక్షసుడిని అష్టమ సంతానంగా వచ్చి వధించిన వాడు భగవానుడు. నరకాసురుడిని చంపి 16000 వేల మంది స్త్రీలకి జీవితాన్ని ప్రసాదించాడు మహానుభావుడు.

ఎవరు రాక్షసులు ఎవరు దేవుళ్ళు విడమర్చి చెప్పక్కర్లేదేమో.

‘జై శ్రీరామ్’ అనే భారతీయుడు = ఒక బత్తాయి & భాజపా ని వెనకేసుకొచ్చేవాడు. అంతే అర్ధమయినవాడు మొదట ‘తాను భారతీయుడిని’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాలి.

‘వాడు నా వాడు’ అని చెప్పుకోవడానికి సిగ్గు పడాల్సింది పోయి ఔరంగజేబుని కొంతమంది జేబులో పెట్టుకుని ఆరాధిస్తున్నారట. ప్రపంచంలో ఎక్కడైనా తన వారిని హింసించిన వారిని పూజించే వారు ఉంటారా ? ఇదేనా భారతీయత ? 🤔🤔 ?

భిన్నత్వం లో ఏకత్వం – భారతీయత

వ్యాసంలో ఇంకా స్పృశించ వలసిన అంశాలు చాలా ఉన్నాయి. చుక్కలని కలిపే ప్రయత్నం చేశాను.