ద్రోణాచార్యులవారు

చిన్నప్పుడు ఏకలవ్యుడి కథ చదువుకున్నపుడు ద్రోణాచార్యులవారు చాలా అన్యాయం చేసినట్లు అనిపిస్తుంది. ఒక అవగాహన అంటూ వచ్చాక ఎందుకలా చేసారు అని కుతూహలంతో కూడిన ప్రశ్న ఒకటి వస్తుంది.

మొదట వచ్చే ప్రశ్న : ద్రోణుడు ఏకలవ్యుడిని శిష్యుడిగా ఎందుకు ఆమోదించలేదు ? ద్రోణుడు ఏకలవ్యుడిని క్షత్రియుడు కానందున శిష్యుడుగా ఆమోదించలేదు. అది ఆ రోజున ఆయన  పాటించవలసిన ధర్మం. ఆ రోజు ఆమోదించబడ్డ ధర్మాన్ని, ఎవరైనా ఈ రోజున పాటిస్తే అది illegal అవుతుంది & అధర్మం క్రిందకి వస్తుంది. అది అన్యాయం కదా నేను ఆ రోజులలో జీవించి ఉండలేదు. కాబట్టి నాకు సమాధానం తెలియదు అనే చెప్తాను. ఈ రోజున దానిని అన్యాయం అని తీసుకున్నారు కాబట్టే ధర్మాలు మారాయి. దానికి అనుగుణంగా చట్టాలు వచ్చాయి.  ఆనాడు నేరంగా పరిగణించబడినది ఈనాడు  నేరం కాదు & vice-versa.   అమెరికాలో ఆడవారికి ఓటు హక్కు 1920 వచ్చింది. మరి 1920 ముందు, నాలాంటి వారు హక్కు లేకుండా ఓటు వేయటం నేరమేగా ?  కాబట్టి ద్రోణాచార్యుల వారు చేసింది నేరం/ అధర్మం కాదు.

ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడుని శిష్యుడిగా ఆమోదించకపోయినా, ఏకలవ్యుడు ఆయన విగ్రహం పెట్టి విద్య నేర్చుకున్నాడు. చాలా గొప్పగా చెప్పవలసిన విషయమే.

దీని తరువాత వచ్చే ప్రశ్న :   ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే  పక్షపాతం. కాబట్టి ద్రోణుడు అర్జునుడి కోసం బొటన వేలు గురుదక్షిణగా ఇవ్వమన్నాడు..

ద్రోణుడు కేవలం అర్జునుడి కోసం బొటన వేలు ఇవ్వమని అడగలేదు. అందులో చాలా ధర్మం దాగి ఉంది. చాగంటి గారు ఆయన  ప్రవచనంలో దానిని విశదీకరించిన  విధానం నాకు బాగా నచ్చింది. తనని చంపుతాడు అని తెలిసిన ద్రుష్టద్యుమ్నుడికే విద్య నేర్పగా లేనిది, ఏకలవ్యుడి విషయం లో ఎలా ధర్మం తప్పుతాడు? అస్త్రాలు, శస్త్రాలు తెలియాలంటే  కావల్సినది విద్యా నైపుణ్యం ఒకటే కాదు, వాటిని ఉపయోగించేటపుడు పాటించవలసిన విచక్షణ & ధర్మం.  శిష్యుడు ఎవరిమీద పడితే వారి మీద ప్రయోగించడు , కేవలం ధర్మానికే  ప్రయోగిస్తాడు అన్న నమ్మకం కలిగినప్పుడే  అవి గురువు శిష్యుడికి ధార పోస్తాడు. ఒక కుక్క మొరిగిందని, తనకి ఏకాగ్రత చెదిరిందని  కుక్క పై  ఏడు  బాణాలతో బాణప్రయోగం చేసేవాడు, మునుముందు ఏదైనా చేయవచ్చు. ఆయన  ధర్మం తప్పే వాడే అయితే , ఆ అస్త్రాలు తనని అవమానించిన ద్రుపదుడి  మీదనే ప్రయోగించవచ్చు కదా.  పోనీ కొడుకైన అశ్వద్ధామ కి నేర్పవచ్చును కదా. ఆర్మీ లో, నేవీ లో పని చేసేవారు ఎంతో క్రమశిక్షణ తో ఉంటారు.  ఏ  మాత్రం అదుపు తప్పినా శిక్షలు ఉండవా? ప్రమోషన్ నుంచి డిమోషన్  కి తెస్తారు. పైగా అటువంటి సంస్థలలో పెద్ద పదవులలో ఉండేవారిపై నిఘా ఉంటుందని కూడా అంటుంటారు.  సరిగ్గా ఆలోచిస్తే ద్రోణాచార్యులవారు ఏకలవ్యుడిని గురుదక్షిణ ఇవ్వటం కూడా  అంతే.

చాగంటి వారు చెప్పినదే  కాక, నాకు ఇంకో అంశం కూడా కనిపించింది ఇక్కడ. ఏకలవ్యుడు గురువు ఆమోదం లేకుండా అన్నీ విద్యలు  నేర్చుకున్నాడు. మరి ఆ గురువు ఆమోదం లేకుండానే  వాటిని ప్రయోగించడన్న నమ్మకం ఏంటి?  బహుశా ద్రోణాచార్యులవారికీ  ఇక్కడ అతడిపై నమ్మకం పోయిందేమో!! అమెరికాలో కాలేజిలకి దరఖాస్తు పెట్టుకోవాలంటే, టీచర్ recommendation ఇవ్వాలి. ఆ విద్యార్థి వినయవిధేయతలతో & క్రమశిక్షణతో  ఉంటేనే టీచర్ recommend  చేస్తారు. ఏ మాత్రం క్రమశిక్షణ లేకపోయినా ఇవ్వరు.

ద్రోణాచార్యుల వారికి అర్జునుడంటే  పక్షపాతం అంటారు. ఒక గురువు స్థానంలో నిలబడి ఆలోచిస్తే అర్ధం అవుతుంది ఆ పక్షపాతం ఏంటో.

  • అందుకు ముఖ్యంగా  చెప్పుకోవాల్సిన ఉదాహరణ – పారుపల్లి రామకృష్ణయ్య పంతులు  గారు మరియు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. పారుపల్లి వారికి  ఎంతో మంది శిష్యులు ఉన్నారు మరి మనకి బాగా తెలిసన వారు మంగళంపల్లి వారే !! ఎందుకు ? పారుపల్లి వారు బాలమురళి గారికి ఒక్కరికే సంగీతం నేర్పించారా ? లేదే !! అందరికీ  ఒకే పాఠం చెప్పుంటారు గా !!
  • ఇంకొక ఉదాహరణ. అమెరికాలో బడులలో ‘No child left behind’ అన్న చట్టం ఉంది.  అందరికి సమానమైన విద్య అని వారి ఉద్దేశ్యం. మన భారతదేశ సంతతి పిల్లల గురించి అతిశయోక్తి గా చెప్పడం అని కాదు కానీ, ఏకసంతాగ్రాహులు అనవచ్చు.   చాలా మటుకు ఈ ‘No child left behind’ కోవలోకి రారు.  దానితో తరగతిలో టీచర్ కొంచం advanced గానే చెప్పాల్సి వస్తుంది. వీరికి ఛాలెంజ్ ఇవ్వకపోతే,  అల్లరి చేసి టీచర్ని విసిగిస్తారు.

అర్జునుడికి విద్య ఉన్న శ్రద్ధకి, అందులోను అతడికి ఉన్న వినయవిధేయతలకి మరి ద్రోణాచార్యులవారు ప్రియశిష్యుడు అవ్వటం లో సందేహం లేదుగా  మరి ?

మిధునం’ కథ లోని అప్పదాసు గారు మా ఇంట్లో

నేను అమెరికా వచ్చిన కొత్త. అప్పటికి ఇంకా భారతదేశం లో కొన్ని ప్రదేశాలకి ఉత్తరాలు వ్రాసుకునే రోజులే !! ఏ వస్తువు చూసినా ఏ కొట్టుకి వెళ్లినా వింతగా ఏదైనా కనిపిస్తే నాకు వెంటనే దూరంలో ఉన్న నా కుటుంబంతో పంచుకోవాలని అనిపించే రోజులు. ఒకసారి వాకింగ్ కి వెళ్తుంటే, ఒక అమెరికన్ చిన్న లాగు(shorts), చేతులు లేని(sleeveless) చొక్కా వేసుకుని walkman headphones, నల్లకళ్ళ జోడు పెట్టుకుని జాగింగ్ చేస్తున్నాడు. మాములుగా అయితే వింతేమి కాదు. కానీ అతని వేషధారణ, ఆ మిట్టమధ్యాహ్నం పరుగెత్తడం నా కుటుంబంతో పంచుకుంటే అన్పించింది. అందులో ముఖ్యంగా మా తాతయ్యకి చెబితే ఏమంటారో అని ఒక్కసారి తలుచుకున్నాను. ఆయన చూసిఉంటే ‘ వీడెవడమ్మా !! మిట్టమధ్యాహ్నం ఇట్టా పరిగెడుతున్నాడు ? మన బిట్రగుంటలో అయితే కుక్కలు తరమవూ ?’ అనేవారేమో అన్పించింది. ఇక అంతే!! నవ్వు ఆపుకోలేక అతను చూస్తే బాగోదని తిరిగి ఇంటికి వచ్చేసాను.

నెల్లూరు యాసలో, మొహంలో ఏ మాత్రం నవ్వులేకుండా చాలా సీరియస్ గా మా తాతయ్య సరదాగా చెప్పే మాటలు తలచుకుని తలచుకుని నవ్వుకుంటాము మేమందరమూ !! ముఖ్యంగా ‘మిథునం ‘ సినిమాలో అప్పదాసులా రుచులకి రకరకాల పేర్లు పెట్టేవారు. మా చుట్టలావిడ ఒకసారి బీట్ రూట్ హల్వా చేసింది. ‘ ఈ నల్ల లేహ్యం ఏందమ్మా ‘ అన్నారు. వెంటనే ఆవిడ మొహం పాలిపోయింది. మహారాష్ట్ర వారు శ్రీఖండ్ అనే స్వీట్ చేస్తారు. దాని పేరు ‘ శ్రీకంఠంట తల్లీ. పెరుగులో చక్కర వేసి గిలకొట్టారు వాళ్ళు ‘ అనేవారు. ఒకసారి ఉత్తరదేశ యాత్రలకి వెళ్లి ‘రాజ్ మా ‘తిన్నారు. ‘ అబ్బో రాజమ్మ కూర అట. తినలేకపోయాము తల్లీ’ అన్నారు. మా తమ్ముడు ఒకసారి ఇడ్లీలు చేస్తే ‘మల్లెపూవులా మెత్తంగున్నాయిరా ‘ అన్నారు. ఏదైనా పదార్థం తిని బావుంటే, వెంటనే మా అమ్మమ్మతో ‘ ఏమే ఇట్టా అమృతం లా ఎప్పుడైనా చేశా ? అడిగి నేర్చుకో ‘ అనేవారు. ఆవిడా అలాగే ‘ ఆ !! నేర్చుకుంటా!! నాకేమన్నా వస్తేగా ‘ అనేది. పండగరోజుల్లో ఎక్కువగా తిన్నానేమో అనుకుని అమ్మమ్మని జీలకర్ర కాషాయం ఇచ్చేదాకా సతాయించేవారు.

ఇంట్లో పెద్ద ఇనపెట్టె ఉండేది. నెల్లూరు జిల్లాలో పాత ఇనుప వస్తువులకి ఉల్లిపాయలు ఇచ్చేవారు. ఆ ఇనపెట్టె ఖాళీగా ఉండి పెద్దస్థలం కేటాయించాల్సివస్తోందని, ‘ఈ ఇనుపెట్టె అమ్మితే సరి. జీవితానికి సరిపడా ఎర్రగడ్డలిచ్చిపోతారు’ అనేవారు!!

ఆయనెప్పుడూ రైళ్లు, టిక్కెట్ల గురించే మాట్లాడుతారు అని, కొంత మంది పిల్లలు ఆయనని ‘రైలు తాత’ అని పిలిచేవారు.

‘ఈనాడు’ పేపర్ ఆ చివరనుంచి ఈ చివరివరకు చదివి ఎప్పటికప్పుడు ప్రతి కరెంటు పొలిటికల్ టాపిక్ మాట్లాడేస్తుంటారు. కొన్ని ఉదాహరణలు :
‘ ఉత్త పెడద్రపోడుట కదమ్మా కొత్త అధ్యక్షుడు. అందర్నీ వెళ్ళమంటున్నాడట. నిజమేనా ?’
‘ ఈ ముక్కోడు ఏందమ్మా తెలంగాణా తెలంగాణా అని ఒకటే గోల గా ఉందే ?’
‘పిల్ల అంత దూరం నుంచి ఫోన్ చేస్తే దాని క్షేమ సమాచారం అడగకుండా ఎవరి గురించో ఎందుకు మాట్లాడుతారు ‘ ఫోన్ లో మనవరాలి మాట కోసం తపించే అమ్మమ్మ అరిచినా వినేవారు కాదు.
పైగా ‘ మీ అమ్మమ్మకి కుళ్ళమ్మా నేను మాట్లాడితే’ అనేవారు. ఆయన మాటలు ఎంత ఇష్టం అంటే 55cents /minute ఉన్న రోజుల్లో అమ్మవాళ్లతో మాట్లాడినా మాట్లాడకపోయినా ఆయనకి మాత్రం ఫోన్ చేసి మాట్లాడేవారం మేము.

ఆయనకి అమెరికాలో ఇల్లు కొనుక్కున్నాం అని చెప్పి ఎన్ని గదులో , ఎన్ని బాత్రూములో చెప్పాను.
నాలుగు బాత్రూములు అని చెప్పగానే ‘చాలా తల్లీ’ అన్నారు. దాని మీద కూడా రకరకాల జోకులు వేశారు.

తాతయ్య కొన్ని విషయాలు ఖచ్చితంగా పాటించే విధానం చూస్తే భలే ఆశ్చర్యం వేసేది. సాయంత్రం పూట ఉప్పుని ‘లవణం’ అనేవారు. పొరపాటున కూడా ఉప్పు అనేవారు కాదు. అమ్మమ్మని తప్ప ఎవ్వర్నీ ‘ఏమే ‘ అని సంబోధించేవారు వారు కాదు. అమ్మమ్మని పేరు పెట్టి పిలిచేవారు కాదు. ప్రతి విషయం అమ్మమ్మకి చెప్పాల్సిందే. తప్పు కానీ ఒప్పు కానీ!! రైల్వే పాస్ ఉంది అన్న వంక పెట్టి అన్ని తీర్థయాత్రలు చేసారు. ప్రతి చోటా పితృదేవతలకు తర్పణాలు వదిలారు. ప్రతి మాటకి ముందు ‘భగవంతుడి దయ వల్లన’ అనేవారు.

చిన్న కొసమెరుపు ఏంటంటే పొద్దున్న ఏమి తిన్నానో సాయంత్రం కల్లా మర్చిపోయే ఆయన, క్రితం ఆగష్టులో ఇండియా వెళ్ళినపుడు:
‘గాంధీ ని చూసారా తాతయ్య ఎప్పుడైనా?’
‘ ఆ !!చూచాగా . కానీ రెండు సార్లు సోమవారం అయింది’
‘సోమవారం అయితే ఏంటి ?’
‘ మౌన వ్రతంగా ఆయన !! మాట్లాడడు!!’
90 ఏళ్ళ, మా తాతయ్య చెప్పింది విని ఆయన జ్ఞాపశక్తికి ఖంగుతిన్న నేను, మా అక్క కొడుకు సెల్ లో గూగులమ్మ ని అడిగాం ‘సోమవారం గాంధీ గారు మౌన వ్రతమా ‘ అని. ‘నిజమే’ అని చెప్పింది ఆవిడ!!

జీవితం అంటే డబ్బు. డబ్బు అంటే జీవితం అనుకోవడం చాలా సామాన్యం. చాలా సహజం. డబ్బు ముఖ్యమే కానీ ఆ డబ్బుతో ఉన్నంతలో సంతృప్తిగా ఎలా జీవించాలో మాకు చెప్పకనే చెప్పిన ఉన్నతమైన వ్యక్తి మా తాతయ్య. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి విషయంలో ఆయననే తలచుకునేలా ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో తీపి అనుభూతులు …

ఒక్కరోజు ఆసుపత్రిలో చేరడం అనేది తెలియదు. మిథునం లో చెప్పినట్లు శంఖుచక్రాల్లాంటి షుగరు, బీపీ అన్న మాట కూడా ఎరుగరు ఆయన. 91 ఏళ్ళు దర్జాగా మహరాజులా తనకి కావాల్సినవి చేయించుకుంటూ, నిన్న తొలి ఏకాదశి నాడు చేతి గడియారంలో సమయం చూసుకుంటూ భార్య, కూతుర్లు, కొడుకు, కోడలు అందరు పక్కనే ఉండగా విష్ణు సాన్నిధ్యాన్ని చేరుకున్నారు.

ఆయనకి మోక్షం ప్రసాదించాలని ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ….ఈ చిన్నిటపా ఆయన కోసం _/\_