13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు – నా ప్రయాణం కబుర్లు

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం & వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి సంయుక్త ఆధ్వర్యంలో 13 వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు కాలిఫోర్నియాలో మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారి డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారి భవనంలో గత వారాంతం అక్టోబర్ 21-22 2023 న జరిగింది.

వక్తలని ఆహ్వానిస్తూ వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి విద్యుల్లేఖ రాగానే నా ప్రసంగం కూడా పంపించాను. చాలా రోజులు జవాబు రాకపోయేసరికి ‘నాబోటి దాని మాటలు ఎలా ఎంపిక చేస్తార్లే మరీ అత్యాశ’ అనుకుని మర్చిపోయాను. ఉన్నట్టుండి రాజు గారు నుంచీ వక్తలని ఉద్యేశిస్తూ మళ్ళీ లేఖ . ‘నా ప్రసంగం ఎంపిక అయ్యిందా ‘ అని అడిగాను వారిని. ‘అందుకేగా పంపాము ‘ అని జవాబు వ్రాసారు ఆయన . మొత్తం ప్రసంగం తిరిగి వ్రాసి పంపాను. కానీ ఈ గందరగోళంలో నేను పంపిన draft copy ప్రచురణ అయ్యింది అని, ‘సభా విశేష సంచిక’ చూసాక అర్ధమయ్యింది.

చిట్టెంరాజు గారు, నేను ‘పదసాహిత్యం ‘ తరగతిలో సహాధ్యాయులం. తరగతికి రాగానే అయన అందర్నీ పేరుపేరునా భలే చక్కగా పలకరిస్తారు. ఇక నన్ను చూసినప్పుడల్లా ‘టికెట్ బుక్ చేసావా’ అంటూ పలకరించడం మొదలు పెట్టారు. అలా టికెట్ కొనుక్కుని ప్రయాణానికి సిద్ధమయ్యాను.

2017లో వంగూరి వారి తెలుగు సదస్సు మా ఊర్లోనే జరిగింది. ఎంతో మంది రచయితలు వచ్చారు. ఈమాట లో, కౌముదిలో రచనలు చేసే రచయితలే నాకు పెద్ద సెలెబ్రిటీలు. వారు వ్రాసిన కథలు గురించి వారితో పంచుకునే అవకాశం వచ్చింది. అలా ఆనాడు ఎందరో సాహితీ ప్రముఖులని కలిసాను . మొట్టమొదటి సారి like minded group తో కలిస్తే ఆ వచ్చే ఆనందం ఏంటో అర్ధమయ్యింది. అందుకే ఆ ఆనందం ఏ మాత్రం వదులుకోకూడదు అని నిర్ణయించేసుకున్నాను.

మరి ఈసారి 2023లో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం అంటే నేను చదివే విశ్వవిద్యాలయం, మా ఆచార్యుల వారు మృణాళిని గారిని & ఇతర సహాధ్యాయులని కూడా కలవడం అవుతుందని చాలా ఆనందం వేసింది. అనుకున్నట్లే మా సీనియర్లు అయిన కిరణ్ సింహాద్రి, భాస్కర్, వేణుగోపాల్ గార్లను, నాతో పాటూ చదువుతున్న గిరిధర్ గారిని కలిసాను. ఇక చిట్టెంరాజు గారి సంగతి వేరే చెప్పలేదనుకుంటాను.

20 తేదీ మధ్యాహ్నం కల్లా అక్కడికి వెళ్ళాను. Airport నుండీ BART అనే మెట్రో రైలు ప్రయాణం చేద్దాం అని ముందరరోజు నిర్ణయించేసుకున్నాను. అమెరికాలో ఎప్పుడూ కారులో ప్రయాణిస్తాం. అవకాశం ఉన్నపుడు ఎలా ఉంటుందో చూడచ్చు కదా అనిపించింది. పగటిపూట కూడా అయ్యింది. భయం ఏమి ఉండదు అని స్నేహితురాలు కూడా భరోసా ఇచ్చేసింది. DC మెట్రో తో పోలిస్తే నాకు పెద్దగా నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే మన భాగ్యనగరం & ఢిల్లీ మెట్రో నే బావుందేమో అనిపించింది కూడా.

పనిలో పని దానధర్మ సంస్థ వెంకట్ ఊటుకూరి గారిని కలవాలి అనుకున్నాను. వెళ్ళిన రోజు సాయంత్రమే కలిసాను. వారు ఓ గంటన్నర ప్రయాణం చేసి వచ్చారు. వారిని కలవడం చాలా సంతోషం అనిపించింది.

ఇక సిలికానాంధ్ర కుటుంబం చేసిన మర్యాదలు అంతా ఇంతా కాదు. సభా ప్రాంగణం అంతా తెలుగు మయం. చిత్రాలు చూసి ఉంటే అర్ధమవుతుంది. వచ్చిన వారు 10 lbs బరువు పెరిగేలా చేసి పంపడమే వారి ధ్యేయం అన్నట్టు చెప్పారు రాజు చమర్తి గారు. ఉన్న రెండు రోజులు ‘కాఫీలు తాగారా .టిఫినీ తిన్నారా’ అని అడుగుతున్నట్లే అనిపించింది. వీరందరినీ మేము ‘మనబడి’ సదస్సుల్లో కలుస్తూనే ఉంటాము. వారి నిజస్వరూపం ఈ రెండురోజుల్లో తెల్సింది 😂(సరదాగా) . ‘మనబడి’ లాంటి పెద్ద సంస్థ నడపడానికి వెనుక ఎంత మంది కృషి ఉంటుంది అనేది స్పష్టంగా అర్ధమయ్యింది. ‘కాన్ఫరెన్స్’ అని అనిపించేలా బల్లలు, పెన్నులు , notepad లు పెట్టారు. పూలగుత్తుల అలంకరణ చిత్రాలలో చూసారుగా. మధ్యలో నోట్లోకి అలా ఏదో చప్పరించేలా జీడిపప్పులు, M & M లు ఉంచారు. మధ్యాహ్నం భోజనాలు అయిన కాసేపటికి కొబ్బరి నీళ్ళు ఇచ్చారు. ‘ మీరంతా సరస్వతీ స్వరూపులు’ అంటూ ఆనంద్ గారు అన్నీ చేతికి తెచ్చివ్వటం ఆశ్చర్యం వేసింది. కాసేపటికి వేడి వేడి మిరపకాయ బజ్జీలు, పునుగులు పెట్టారు. సాయంత్రం అరిటాకులు వేసి వడ్డనలు. అప్పుడు నేను ‘సదస్సు కి వచ్చిన అతిథి’ అనే వేషం పక్కన పెట్టి, ‘సిలికానాంధ్ర వాలంటీర్ , విద్యార్థిగా వేషం’ వేసి , హడావిడిగా వడ్డన చేస్తూ పని చేసినట్లు నటించాను. ఫొటోల్లో కూడా పడేటట్లు చూసుకున్నాను. భోజనాల తరువాత వల్లీ గారి కవితా కిళ్లీ ఇచ్చారు. ఆ కిళ్ళీ తింటే అలా ఆశువుగా కవిత్వం చెప్పేస్తారట 😂 వల్లీ గారే చెప్పారు.

వక్తల ప్రసంగాలు చాలా మటుకు బావున్నాయి అక్కడక్కడా తప్ప. భాస్కర్ రాయవరం లాంటి వారి ప్రసంగాలు నాలాంటి విద్యార్థులకి ఉపయోగపడేలా ఉన్నాయి. వారూ నా సహాధ్యాయి. సాహిత్య అనుభవం కలిగినవారు కూడా కావడంతో ఆ ప్రసంగం చాలా బావుంది. వారు వారి ఛానల్ లో కథాకేళి అనే కార్యక్రమం నిర్వహిస్తారు . దాన్ని ఆధారంగా చేసుకుని వివిధ దేశాల్లో ఆ కథ చెప్పే క్రమం ఎలా ఉంటుంది అని చెప్పారు.

ఇక కొందరు వక్తలవి పేర్లు చెప్పలేను కానీ నాకు నచ్చలేదు. నాలాంటి విద్యార్థులు ఆ ప్రసంగం నుంచీ నేర్చుకోవాలి అంటే పొందికగా articulate చేసి మాట్లాడాలి . అలా కాకుండా సమయ పాలన లేకుండా out of the topic ప్రసంగిస్తే నాలాంటి దానికి ఉన్న ఆసక్తి కూడా పోతుంది. శ్యామల దశిక గారి కథా విశ్లేషణ, ఉమాభారతి గారి డయాస్పోరా కథలు లాంటి ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఫణి డొక్కా గారి కథా పఠనం నవ్వించి నవ్వించి పొట్ట నొప్పి పుట్టేలా చేసింది. మధ్యలో మూడు ముఖ్య ప్రసంగాలు మిస్ అయ్యాను (బోల్డన్ని కబుర్లు లలిత ప్రసంగం అందులో ఒకటి).ఎందుకో కూడా చెప్తాను.

శారద పూర్ణా శొంఠి గారు లాంటి వారిని కలవడం ఈ జన్మలో చేసుకున్న అదృష్టంలో ఒకటి. ఆ ఉన్న రెండు రోజులు పొద్దున్నే వారి పాదాలకు నమస్కారం చేసుకోవడం నవరాత్రులలో అమ్మ అనుగ్రహం.

నా ప్రసంగం శనివారం సాయంత్రం ఉండాలి. కానీ సమయం సరిపోనందువల్ల ఆదివారం పొద్దుటికి postpone అయ్యింది. ప్రసంగాలు మిస్ అయ్యాను అన్నాను కదా. చెప్తా ఆ సంగతి. నా గోల! నా చీరల పిచ్చి తెల్సిందే కదా. సాయంత్రం కదా నా ప్రసంగం . చీర మార్చుకోవడం నెమ్మదిగా చేయచ్చుగా. తొందర !! మధ్యలో పరిగెత్తుకుంటూ బసకు వెళ్ళి వచ్చేసరికి ఈ ప్రసంగాలు కాస్తా అయ్యిపోయాయి. ఈ లోపల నా ప్రసంగం నిర్వాహకురాలు గారు గీత గారు వచ్చి ‘మనది postpone అయ్యింది తెలుసా ‘ అన్నారు . ‘ అయ్యో చీర ‘ అంటే ‘నేనిస్తాను పర్వాలేదు ‘ అని ఆవిడ 😀.
‘నా బాధ అది కాదండీ . రేపటికి తెచ్చుకున్న చీర ఇదివరకు మనబడిలో speech అప్పుడు కట్టేసుకున్నాను. నా ఛానల్ చూసిన వాళ్ళు స్పీచ్ అంటే ఈవిడ ఎప్పుడూ అదే చీర కట్టుకుంటుంది అనుకుంటారు ‘ అని చెప్తుంటే, అటుగా వెళ్తున్న చిట్టెంరాజు గారు ‘ఏవిటీ ఆ పిల్ల మీద ధుమధుమలాడుతున్నావ్ ‘ అన్నారు. ఈలోగా మా ఆచార్యుల వారు కనపడి ‘postpone అయ్యింది మీ group . అయ్యో పాపం చీర కూడా మార్చుకొచ్చినట్లున్నావ్’ అన్నారు. ‘గురువు గారు . మీకే నా బాధ అర్ధమయ్యిందండీ’ అనేశాను 😂.

శనివారం రాత్రి కిరణ్ ప్రభ గారికీ , కాంతి కిరణ్ గారికి జీవన సాఫల్యం పురస్కారం ఇచ్చారు . కన్నుల పండుగలా ఉండింది. . సన్మానం తరువాత వారిరువురి ప్రసంగాలు క్లుప్తంగా, అద్భుతంగా ఉన్నాయి. యూట్యూబ్ లో వారి ఛానల్ లో చూడవచ్చు. తరువాత వంగూరి చిట్టెంరాజు గారికి సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం వారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం యొక్క ‘Mascot’ అయిన మహా అనే ఏనుగు పేరుతో ‘మహా’ అనే పురస్కారం ఇచ్చి, పూల వానలు కురిపించి సత్కరించారు. అంటే రాజు’ గారు ‘మహా’ రాజు గారు అన్నమాట. వారు సరదాగా ‘ఇక పైన ఏనుగు చాకిరీ చేయాలా’ అన్నారు. . ఎటువంటి ఫలాపేక్ష లేకుండా సాహిత్య సేవ చేస్తున్న కిరణ్ ప్రభ దంపతులని , వంగూరి చిట్టెంరాజు గారిని ఈవిధంగా సత్కరించడం నాలాంటి వారికి చాలా ఆనందదాయకంగా అనిపించింది. ఈ సారి సదస్సు తరువాత ‘కిరణ్ ప్రభ గారికి, కాంతి కిరణ్ గారికి నేను తెలుసు’ అని చెప్పుకోగలను.

ఇక్కడ వంగూరి వారి గురించి నాకు అర్ధమయ్యింది కొంత చెప్పాలి. 2017లో మా ఊర్లో సాహితీ సదస్సు పెట్టినపుడు , నన్ను ‘ఏదో ఒకటి మాట్లాడు’ అన్నారు. ‘నాకేం రాదండీ’ అంటే , ‘ నీ బ్లాగులో రైలాటే చదువు. బావుంది కదా ‘ అన్నారు. అంటే దీన్ని బట్టి కొత్త రచయితలని ఎలా ప్రోత్సహిస్తారో అనేది స్పష్టమవుతుంది. వచ్చేస్తుంటే ‘అంతా సవ్యంగా అనిపించిందా నీకు ‘ అని తండ్రి గారు అడిగినట్లు ప్రశ్న. పరాయి దేశంలో ఎవరడుగుతారు ఇంత ఆప్యాయంగా ? అందుకే అంటాను. నేర్చుకోవాలే కానీ అమెరికాలో ఇటువంటి వారు మా తరం వారికీ ఓ గురువుల్లా ఒక direction చూపిస్తూ ఉంటారు. వీళ్ళని ఏదో పనీపాటూ లేని వారీగా జమ కడుతూ ‘నాకే అన్నీ తెలుసు’ అనుకుంటే ఇటువంటి వారు సాంగత్యం దొరకదు.

మళ్ళీ నా గోల కి వచ్చేద్దాం ! ఆ తర్వాత ఆదివారం పొద్దున మొట్టమొదటి ప్రసంగం నాదే. ఆ విధంగా postpone అవ్వటం నాకు మంచికే. సభలో ఉన్నవాళ్లు ప్రసంగం ఎలా ఉన్నా చచ్చినట్టు వినాల్సిందేగా ! ‘break’ అని చెప్పడానికి కూడా వీల్లేదు మరి . ఎందుకంటే అప్పుడే breakfast అయ్యింది గా ! నా ప్రసంగం వీడియో చూసినవారికి అర్ధమయ్యే ఉంటుంది. నేను ముఖ పుస్తకంలో వ్రాసుకునే ఆలోచనలన్నీ గబగబా పాఠం అప్పజెప్పినట్లు చెప్పేసాను. రెండు నిముషాలు మించిపోయింది. గీత గారు ఏమీ అనలేదు పాపం.

చాలా సన్నిహితమైన నా స్నేహితురాలు కూడా అక్కడే ఆ ఊర్లో ఉంటుంది. వెళ్ళినపుడు తనని కూడా కలవచ్చు అనుకున్నాను కూడా. ఎప్పుడు వెళ్ళినా వాళ్లింట్లోనే ఉంటాము. అస్సలు రాలేదని , కలిసి ఏళ్ళు గడిపోయాయని తను అంటుంటే 2:30 కల్లా సభనుంచి సెలవు తీసుకున్నాను రాత్రికే తిరుగు ప్రయాణం. అందుకే ఆదివారం కూడా కొన్ని ప్రసంగాలు miss చేసుకున్నాను. తిరిగి వచ్చేస్తుంటే ఏదో ఆత్మీయులని వదిలి వచ్చిన ఫీలింగ్.

స్నేహితురాలు వాళ్ళింటికి వెళ్ళగానే వారి పక్క ఇంట్లో తమిళులు బొమ్మలకొలువు పేరంటం పిలిచారు. వెళ్లి అమ్మవారిని చూసుకుని, భోజనం చేసి , మా స్నేహితురాలింట్లో persimmon పళ్ళు కోసుకుని , తిని , pack చేసుకున్నాను. వెంటనే తిరుగు ప్రయాణం.

సోమవారం పొద్దున్నే ఇంట్లో విజయ దశమి వేడుకలు చేసుకున్నాను.

వ్యాఖ్యానించండి