అమ్మపెట్టదు..అడుక్కోనివ్వదు..

మొన్న నాకు FB లో ఓ పోస్టు కనిపించింది. ఇస్కాన్ వారి ‘అక్షయ పాత్ర’ సంస్థ మీద.

భారతదేశం లో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అక్షయ పాత్ర కి కాంట్రాక్టు ఇచ్చారు. అక్షయ పాత్ర సంస్థ వారు పొద్దున్నే వేడి వేడి గా వారి అత్యాధునికమైన వారి వంటశాలలలో శుభ్రంగా వండి సమయానికి పిల్లలకి పెడతాము అని చెప్తారు. కావాల్సిన పోషకాలు, రుచి వాటికీ ప్రమాణాలు ఉన్నాయి అని చెప్తారు. ఆయా వీడియోలు కూడా వారి వెబ్సైటు లో ఉంటాయి. చూడచ్చు ఎవరైనా. ఎన్నో కార్పొరేట్ సంస్థలు ముఖ్యంగా ఇన్ఫోసిస్ వీళ్ళకి విరాళం ఇస్తుంటుంది. ప్రభుత్వం ఇచ్చే నిధులకి అదనంగా వారి వంటశాలలకి, రవాణాకు ఖర్చు ఉంటుంది కాబట్టి ఈ విరాళాలు ఆ అదనపు ఖర్చుకు వాడతాము అని చెప్తారు వారు. నేను విరాళం ఇద్దామని ఫోన్ చేస్తే ‘ ముందు వచ్చి మేము చేసే పని చూడండి. పొద్దున్నే రండి’ అని చెప్పారు. అంటే వారు చేసే పనిమీద వారికి నమ్మకం ఉన్నట్లే కదా!! నేను ఇస్కాన్ భక్తురాలిని కాదు. అన్నదానం చేస్తే మంచిది అన్న సదుద్దేశ్యమే. అన్నీ సంస్థల్లాగే అందులో కూడా లోపాలు ఉండవచ్చు.కాదని చెప్పను. వాదించను.

ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం పెట్టేసాం అంటే చాలదు కదా!! ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఎవరు వండుతారు, ఎలా వండుతారు, నాణ్యత ..ఇలా చాలా చూడాలి. నాకు తెలిసి బళ్ళలో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టినపుడు, అది టీచర్లకి పెద్ద ప్రహసనం. దాని మీద కూడా చాలా కార్టూన్లు కూడా వచ్చేవి టీచర్లు వండుతున్నట్లు, లెక్కలు చూసుకుంటున్నట్లు. ఇదంతా తలనొప్పి అని కొన్నిసార్లు టీచర్లు మాకు మధ్యాహ్న భోజన పథకం వద్దు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా వద్దు అంటే ఎలా? కొంత మంది పిల్లలు కేవలం ఆ తిండి కోసమే బడికి వస్తారు. మాకు తెలిసిన ఆవిడ గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా ఉండేవారు హైద్రాబాద్ లో. ఆవిడ చెప్పేవారు, కొన్ని సార్లు పిల్లలు, ముఖ్యం గా 10 వ తరగతి పరీక్షలు వ్రాస్తున్నప్పుడు ఆకలికి తట్టుకోలేక పోయేవారని. వాళ్ళ బాధ చూడలేకపోతున్నాం అంటూ బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చేవారు. ఇలాంటి పిల్లలకోసం ప్రభుత్వం funds ఇస్తుంటే, ఆ డబ్బు నొక్కేయడం కోసం కాచుకుని కూర్చుని ఉంటారు కొందరు. కొన్ని సార్లు పదార్థాలు సరిగ్గా వండక , food poisoning తో పిల్లలు చనిపోయిన వార్తలు కూడా చూసాము. మరి ఈ అడ్డంకులన్నీ దాటుకుంటూ శుభ్రంగా, వేడి వేడిగా, పోషకాలతో తిండి అందిస్తాం అంటూ ఈ సంస్థ ముందుకి వచ్చింది. నాకు తప్పేమీ కనిపించలేదు అందులో!!

ఈ సంస్థ గురించి FB లో ఆ పోస్టు వ్రాసినావిడ బాధ ఏంటో కొన్ని ముక్కల్లో చెప్తాను. ఎవరో ఏంటో చెప్పను. ఆవిడకి అంత కీర్తి రావడం కూడా నాకు ఇష్టం లేదు. పోస్టులో పిల్లలకి భోజనాన్ని సరి అయిన సమయానికి వేడి వేడిగా అందిస్తున్నారా లేదా, నిధులు దుర్వినియోగం చేస్తున్నారా , పాచిపోయినవి పెడుతున్నారా వంటి విషయాలు ఏమీ లేవు. గుడ్డు అనేది మెనూ లోపెట్టకుండా, ఉల్లివెల్లుల్లి లేకుండా చప్పటి శాఖాహారం మాత్రమే పెడుతున్నారూ .నచ్చక పిల్లలు పడేస్తున్నారు.బ్రాహ్మణ భోజనం పెట్టడం అవసరమా ? వచ్చేపిల్లలు కూలీల పిల్లలు. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉల్లి, వెల్లుల్లి వేసుకుని తింటారు. అటువంటప్పుడు ఇలా చప్పటి తిండి ఎలా తింటారు? అన్నం తినేటపుడు ‘హరే కృష్ణ ‘ మంత్రం పిల్లలతో తప్పనిసరిగా చెప్పిస్తున్నారు. వేరే మతాల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటోంది. దళితులు వండుతుంటే పిల్లలు తినట్లేదని ప్రభుత్వాలు ‘అక్షయపాత్ర’ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారట.

ఆవిడ మాట్లాడిన మాటల్లో రెండే విషయాలు చెప్తాను..‘గుడ్డు’ ని మెనూలో పెట్టకపోవడం. ఇతర మతాల పిల్లలు కృష్ణ మంత్రం జపించడం. మాంసాహారం తినేవాడికోసం గుడ్డు పెడితే శాఖాహారం తినేవాడు ఆ రోజు ఏమి చేస్తాడు? ఇతర మతాల వాళ్ళు ఒకరో ఇద్దరో కృష్ణ మంత్రం జపిస్తే వచ్చేసిన బాధ, శాఖాహారం తినేవాడు మాంసాహారం తినలేకపోతే రాదేం? అవసరం ఉన్నచోట మైనారిటీ, అనవసరమైతే మెజారిటీనా?

రుచి నచ్చక పిల్లలు పడేస్తుంటే ఇంతపెద్ద పోస్టు వ్రాసే బదులు ‘అక్షయపాత్ర’ వారికే చెప్పచ్చు కదా?

ఈ పోస్టు చూడగానే అర్ధమయ్యింది ఏంటంటే ఈవిడది ఏదో ‘వాదం’ లేదా ‘ఇజం’ . ఏదైనా వాదించుకోవచ్చు ఏదైనా మాట్లాడచ్చు.తప్పులేదు. కానీ ఒకరు నిర్వహిస్తున్నబాధ్యతని వేలు ఎత్తి చూపించి మాట్లాడటం ఎప్పుడు చేయవచ్చు? వాడికి అప్పగించిన బాధ్యత వాడు అస్సలు సరిగ్గా చేయకపోయినా, వాడి కంటే మనం బాగా చేయగలిగినా తప్పకుండా మాట్లాడవచ్చు. ఎక్కడ హిందూ మతం అని ఉంటే అక్కడ ఈ ‘ఇజం’ మాట్లాడేవాళ్ళకి అన్నీబాధ లొచ్చేస్తాయి. అది కూడా హిందువులకే!! వీళ్ళ బాధ ఏంటో ఎన్నటికీ అర్ధం కాదు నాకు!! ఇండియా లాంటి దేశాలు ఎప్పటికీ ‘Developing’’ దేశం గా ఉండిపోవడానికి కారణం చిన్నచిన్న విషయాలు కూడా అధిగమించకపోవడమే !! నాకు తెలిసి ఇండియా ‘Malnutrition in Children’ దేశాలలో పై స్థానాలలో ఉంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు తలవంచుకోవలసిన విషయం కదూ!!

నాకు ఈమధ్య సమయం చిక్కక పోస్టులు కూడా పెట్టడం లేదు. అటువంటిది ఇటువంటి వాటిని చదివి నాకెందుకులే అని ఊరుకోలేకపోయాను. వీళ్ళు ఎంత సంఘ సేవ చేస్తారో కానీ, చిన్నపిల్లలకి కాస్తో కూస్తో మంచి భోజనం అందజేస్తున్నారు అనుకోకుండా ఏమంత్రం చదివారు అంటూ మాట్లాడుతుంటే ఇంతకంటే మనుష్యులు ఎదగలేరా అని రోత పుడుతోంది.