వేరొకరి సమస్య మనకి కాలక్షేపమా ?

ఆ మధ్య రైతులు ముంబై లో పాదయాత్ర చేసారని, ఎక్కడ పడితే అక్కడ అవే వీడియోలు, ఫోటోలు. వీళ్ళ కాళ్ళు చూడండి మొక్కండి అంటూ .. అవి చూస్తే అయ్యో వీరికి ఎంత జాలో అన్పించక మానదు.
ఓ రెండు వారాల క్రితం ఆ 8 ఏళ్ళ పిల్లగురించి ఇదే తంతు !! ఏవిటో అందరూ మొహాలు నల్లగా మాడ్చారు !! change.org సంతకాలు అన్నారు. మళ్ళీ ఆరోజు రైతుల వ్యవహారమే గుర్తొచ్చింది!!
ఎవరికి వారు, వారి పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు, న్యాయవాదులు, లేదా టీచర్లు అయినా పర్వాలేదు. అమెరికాకి వచ్చేయాలి NRI అయిపోవాలి !! కానీ రైతు అవ్వాలని మాత్రం కోరుకోము కదా !!
ఇండియాలో investment అంటూ అపార్టుమెంట్ కొనని NRI ఉండడు. పొలాల మీద శిస్తు డబ్బులు వస్తే బంగారం కొనుక్కుంటారు. పచ్చని పొలాలు ఇళ్ళు గా మారుతుంటే ఆ ఇళ్ళు కొనుక్కుంటారు!! పొలం కొని ఒక రైతుకి ఉపాధి కలిపించే NRIలుఎంత మంది?
ఒకసారి సునీతా కృష్ణన్ గారు అన్నారు ‘ నన్ను మెచ్చుకోవడం కాదు. నేను rescue చేసిన అమ్మాయిలని మనస్ఫూర్తిగా సమాజంలోకి ఆహ్వానించండి చాలు’ అని. ఆ 8 ఏళ్ళ పిల్ల గురించి మాట్లాడిన వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి !! సునీతా కృష్ణన్ గారి హోంలో వాళ్ళని ఇంట్లో పనిమనిషిగానో /వంటమనిషిగానో రావడానికి ఇష్టపడతారా ??
‘ఏం చేయమంటారు . మాకు దొరికింది సోషల్ మీడియా. కనీసం forward చేద్దామని చేసాం ‘ అంటారు. అది సరైన సమాధానం కాదేమో !! మనదైన రీతిలో మనం ఏమీ చేయలేమా ?
గత రెండేళ్ళల్లో మా చుట్టుపక్కల (మా ఊరి పరిసరప్రాంతాలలో అనచ్చేమో) భారత సంతతికి చెందిన వారిలో 4-5 టీనేజి మరణాలు సంభవించాయి. Indian community అంతా చాలా దిగ్భ్రాంతి చెందారు. వీటిని గురించి సోషల్ మీడియాలో/పార్టీలలో మాట్లాడని వారు లేరు.
గత వారాంతం, మా ఊరిలో కొంత మంది తెలుగు వారు – మానసిక & పిల్లల వైద్య నిపుణులు & ఇంకొందరు నిపుణులతో కూడా కలిసి ఒక కార్యక్రమం నిర్వహించారు. ‘Teen Stress Management & Substance Abuse’ అన్నవి ఆ కార్యక్రమంలో ప్రధాన అంశాలు. కొంత మంది హై స్కూల్ విద్యార్థులు కూడా ఇందులో భాగంగా పాల్గొన్నారు. వచ్చిన నిపుణులలో కొంతమంది వేరే రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. ఈ కార్యక్రమం ఒక హై స్కూల్ ఆడిటోరియం లో దాదాపు ఒక నాలుగు గంటల పాటు జరిగింది. మా లాంటివారికి తెలియని ఎన్నో విషయాలు గురించిన సమాచారం, slides & చిన్న చిన్న presentation ల ద్వారా అందించారు వీరు. ఈ కార్యక్రమానికి ప్రవేశ రుసుము కూడా లేదు. ఇలా ప్రతీ నెలా ఒక సమస్య మీద ఒక కార్యక్రమం పెడతామని చెప్పారు. చక్కని సంకల్పంతో ఇంత చక్కగా స్పందించి వారి అత్యంత విలువైన వారాంత సమయాన్ని ఇలా సమాజం కోసం వెచ్చించిన ఆ వైద్యనిపుణులను కొనియాడాలసిందే అనిపించింది _/\_
ఈ కార్యక్రమం గురించి ఇంతలా చెప్పాను కదా. ఈ సమస్య గురించి సోషల్ మీడియాలో తీవ్రస్పందన వచ్చింది అని కూడా చెప్పాను!! మరి ఎంత మంది జనం వచ్చి ఉంటారు అనుకుంటున్నారు ? వాలంటీర్లు కాకుండా ఆ హైస్కూల్ ఆడిటోరియంలో పట్టుమని 50 మంది కూడా లేరు. ఎంత విచారకరం కదా ? అదే సోషల్ మీడియాలో ఈ కార్యక్రమం గురించి సమాచారాన్ని పంచారు.
మా ఊర్లో భారతదేశం నుండీ వలస వచ్చినవారు వేలల్లో ఉన్నారు. సరే కొందరికి తెలియక పోవచ్చు. కొందరికి ఆ వయసు పిల్లలు ఉండకపోవచ్చు. కానీ టీనేజీపిల్లలున్న తల్లితండ్రులు ముఖ్యంగా FLL , Science Olympiad, Science fair, SAT coaching center లాంటి చోట్ల కనిపించే వారిలో ఓ 10% కూడా లేరు. కనీసం, ఈ మరణాలు సంభవించినపుడు టీవీ9 వారికంటే, అర్నబ్ గోస్వామి కంటే అన్ని రకాల analysis సోషల్ మీడియా లో చేసినవారు/ మాట్లాడినవారు కూడా రాలేదు. అంటే ‘ మా పిల్లలకి ఇలాంటి సమస్యలు రావు’ అన్న ధైర్యం అయిఉండచ్చు. వేరొకరి సమస్య ‘మనకి కాలక్షేపం’ అనటానికి నిరూపించటానికి ఇంతకంటే ఉదాహరణ ఏం కావాలి ?
ఒక కొత్త బాలీవుడ్/టాలీవుడ్ సినిమా రిలీజ్ అయితే ఎన్ని theaterలలో వచ్చినా టిక్కెట్లు దొరకవు (అమెరికాలో మా ఊర్లో ). దీపావళి మేళాలు, సంక్రాంతి సంబరాలు, ఉగాది వేడుకలు, హోళీ పండుగలు, women’s day ల లాంటివి లెక్కే లేదు. వాటికి ప్రవేశరుసుము ఎంత ఉన్నా ఆ బాలీవుడ్ డాన్సులు చూడటానికి వెళ్ళిపోతుంటారు ఈ వెఱ్ఱి జనం !! సమాజం కోసం నిపుణులు & వాలంటీర్లు వారికున్న పనులు వదిలేసి వారి విలువైన సమయాన్ని ఇలా కేటాయిస్తుంటే, సమాజం స్పందిచకపోవడం అన్నది ఎంత సిగ్గుచేటయిన అంశం ??
నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను కాబట్టి, నేను మాట్లాడుతున్నాను అనడం లేదు. ఒకరు leader గా బాధ్యత తీసుకుని lead చేస్తున్నపుడు కనీసం మనదైన రీతిలో స్పందించి వారిని follow అవ్వాలి కదా అంటాను నేను.
రైతు మీద జాలి పడనక్కరలేదు.వారి మీద కవితలు వ్రాయనక్కరలేదు. కూరల కోసం ఏ రిలయన్స్/ స్పెన్సర్ supermarket లకి వెళ్ళకండి. కూరల మార్కెట్ కో, రైతు బజారు కో వెళ్లి బేరమాడకుండా కూరలు కొంటే చాలు. పచ్చటి పొలాలు ప్లాట్లు గా మారుస్తుంటే ఆస్థి పెంచుకోవడం కోసం వాటిని కొనక్కర్లేదు. ఎక్కడో జరిగిన రేప్ గురించి మాట్లాడక్కర్లేదు. ఇంట్లో ఉన్న మగవారు, బయట తీగ మీద వేసిన బట్టలు తీసి మడత పెట్టడం, తిన్న ఎంగిలి కంచం తీస్తే చాలు. పోనీ!! ఆ పనులు చేయపోయినా పరవాలేదు. ఆ పనులు చేస్తున్న మగవాడికి ‘ఆడంగి’ అని పేరు పెట్టకపోతే చాలు, దేశంలో సగం ఆడవారిని ఉద్ధరించినట్లే!!
మనకి వీలైన రీతిలో, ఉన్న సమయంలో మనం సమాజం కోసం మంచి పనులు చేయవచ్చు. చేయాలా వద్దా అనేది వాటికి మనము ఇచ్చే ప్రాధాన్యత (priority)బట్టి ఆధారపడి ఉంటుంది. అంతే !!

సూర్యభగవానుడు

బోల్డన్ని కబుర్లు  లలిత గారు వ్రాసిన  కృష్ణ-పక్షమైన రజని టపా చదివాక నేను అన్నీ భంగిమలలో తీసిన సూర్యభగవానుడు గుర్తొచ్చి ఈ టపా 🙂

బాలాంత్రపు రజనీకాంత రావు గారి సూర్యస్తుతి వింటూ  ఈ ఫోటోలు చూస్తుంటే , అసలు అంత అందంగా ఆ పోలిక చేసి ఎలా వ్రాసారా అనిపిస్తోంది _/\_

సూర్యస్థుతి :

శ్రీ  సూర్యనారాయణా … మేలుకో … హరి సూర్యనారాయణా

పొడుస్తూ భానుడు పొన్నపూవూ ఛాయ పొన్నపూవూ మీద బొగడ పూవూ ఛాయ

ఉదయిస్తు భానుడు ఉల్లిపూవూ ఛాయ ఉల్లిపూవూ మీద ఉగ్రంపు పొడి ఛాయ

గడియెక్కి భానుడు కంబపూవూ ఛాయ కంబపూవూ మీద కాకారి పూ ఛాయ

జామెక్కి భానుడు జాజిపూవూ ఛాయ జాజిపూవూ మీద సంపెంగి పూ ఛాయ

మధ్యాహ్న భానుడు మల్లెపూవూ ఛాయ  మల్లెపూవూ మీద మంకెన్న పొడి ఛాయ

మూడుజాముల భానుడు మూలగపూవూ ఛాయ మూలగపూవూ మీద  ముత్యంపు పొడి ఛాయ

అస్తమాన భానుడు ఆవపూవూ ఛాయ ఆవపూవూ మీద అద్దంపు పొడి ఛాయ

వాలుతూ భానుడు వంగపండూ ఛాయ వంగపండూ మీద వజ్రంపు పొడి ఛాయ

గ్రుంకుతూ భానుడు గుమ్మడీ పూ ఛాయ గుమ్మడీ పూ మీద కుంకంపు పొడి ఛాయ