పురాణాలూ – వక్ర భాష్యాలు

ఈ టపా పురాణాల్ని గురించి  వక్రం గా మాట్లాడేవారికి మాత్రమే 🙂

ఈ రోజు ముఖపుస్తకం లో ఒక పోస్టు నా ఖర్మ కాలి  నా కళ్ళబడ్డది ‘రాముడికి మగపిల్లలు, కృష్ణుడికి మగపిల్లలు  శివుడికి మగపిల్లలే ఉన్నారు. అంతా పితృస్వామ్యం , పురుషాధిక్యత’. మొన్న ఎక్కడో ఇంకోటి ‘కృష్ణుడు దేవుడు కాబట్టి తప్పు చేసినా ఒప్పే అని చూపించేస్తారు భారతం లో ’ .  నా ఖర్మో ఏంటో మరి నాకే కన్పిస్తాయో తలా తోకా లేని పోస్టులు. శ్రీరామ నవమి రోజు కన్పించిన పోస్టులు ఇదిగో ఇలాంటివి    – ‘రాముడు బక్కగా ఉండేవాడు, ఇప్పుడు క్రూరం గా ఉన్నాడు’ .’శూర్పణఖ ముక్కు కోసారు’ . ‘భార్యని అడవుల పాలు చేసాడు’ ‘అగ్ని లో దూకమన్నాడు ‘. ‘బ్రాహ్మణుడి కోసం శంభూకుడి ని చంపాడు’ .ఈ రోజుల్లో ఎంత మందికి సంస్కృతం అర్ధం చేసుకోవడం వచ్చు? పోనీ కనీసం ఓ తెలుగు పద్యం చదవగానే తడుముకోకుండా  అర్ధం చెప్పగలరా? అంతెందుకు ఒక త్యాగరాజ కీర్తన అర్ధం చేసుకోలేరు కొంతమంది. అసలు, అత్యంత  సులువుగా ఉండే తెలుగు కథలనే చదవటం ఆపేస్తున్నరోజులు మొదలయ్యాయి. అటువంటిది ఏం తెలుసు అని  ఒక గ్రంధం గురించి మాట్లాడుతారు?  ఏం  తెలుసు అని ఒక సంస్కృతిని దుమ్మెత్తి పోస్తారు?

ఊర్మిళ నిద్ర వృత్తాంతం, రాముడు సీతని అడవులలో వదిలిపెట్టడం  అసలు వాల్మీకి రామాయణం లో  లేనే లేవని ఎంతమందికి తెలుసు? సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండ లో  ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు.  చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను. 

తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసిన ఆంధ్రమహాభారతం లో ఒక్క ద్రోణపర్వం మాత్రమే 840 పేజీలు ఉంది.(ఈ ద్రోణపర్వం లో ఎన్ని పేజీలు చదవటం  సులభమో  తెలీదు కానీ ద్రోణుడిని విమర్శించడం చాలా తేలిక కొంత మందికి.) ఇక ఈ లెక్కన మొత్తం భారతం ఎన్ని పేజీలుంటుందో ఆలోచించండి. ఆఫీసులో పని చేసి, ఇంట్లో పనులని , పిల్లల బాధ్యతలు  చూసుకుంటూ  ఉండే నావంటి ఒక సగటు వ్యక్తి ద్రోణపర్వం వంటి పుస్తకాలు  ఎన్ని చదవగలడు/దు ? రామాయణం, మహాభారతం , భాగవతం క్షుణ్ణంగా చదవటానికి  ఒక జీవితకాలం సరిపోదు.  అవునా ?  మరి దేనిని ఆధారంగా చేసుకుని మాట్లాడతారు ? ఓ మూడు గంటల సినిమా చూసి, ఓ లెఫ్టిస్ట్  వ్రాసిన పుస్తకం చదివో  అర్ధం పర్ధం లేని థియరీలు అల్లేయటం మర్యాదస్తులకి మంచిపద్ధతేనా !!  తందానా అంటూ వీరికి వేలిముద్రలు, వ్యాఖ్యలు చేసేవారుంటారు. ఇంకో ‘very sophisticated’ పిచ్చి జాడ్యం ఏంటంటే పురాణాలూ ఇంగ్లీష్ లో చదివి పిచ్చి ప్రేలాపనలు చేయడం!!. వీరితో అత్యంతప్రమాదం అసలు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ  నిజాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు అవతలవారు  కూడా.

పురాణాలన్నా, ప్రవచనాలన్నా  చదివి/విని తీరాలి & తప్పదు  అన్న నియమం ఏది లేదు. (డెమోక్రసీ అన్న పదం వేరే మతాల్లో ఉందో  లేదో నాకు  తెలీదు కానీ ఆ రోజుల్లో సనాతన ధర్మానికి మాత్రం ఉండేది అని ఖచ్చితంగా చెప్పచ్చు). చదవక/వినక పోయినావలన నష్టం ఎవరికీ లేదు. కానీ –  ఒక సంస్కృతి గురించి  ఒక  పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేటపుడు  original చదివి విమర్శించండి. పూర్తిగా తెలియని వాటి గురించి  మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదు. వ్యాసుల వారు, వాల్మీకి  వారు వారి పుస్తకాల మీద కాపీ రైట్స్ అందరికి ఇచ్చి వెళ్ళింది వాటిల్లో మంచిని చూడమని . అంతే కానీ వక్రభాష్యం చెప్పమని మాత్రం  కాదండీ !!

 

 

తోబుట్టువులు

కౌముది పత్రిక  లో  జూన్ కథా కౌముది లో వచ్చిన  పొత్తూరి విజయలక్ష్మి గారి కథ  ‘ భాస్కర్ కి ఒక ఉత్తరం’ చదివాను.

అటువంటి కథలు చదివినపుడు కథ నచ్చింది, అందులో ఏదైనా సందేశం ఉంది అనుకుంటే మావాళ్ళని అందర్నీ కూర్చోబెట్టి ‘Story time’ అని చెప్పి చదివేస్తాను. ఈ కథ కూడా ఇలాగే   చదివాకా, బ్లాగులో దీని గురించి చెప్పచ్చు కదా అన్న మావారు  ఇచ్చిన ఆలోచన తో వచ్చినదే ఈ టపా.

కథ మనసుకి ఎంతగా హత్తుకుందీ  అంటే, చివరి భాగం చదువుతుంటే తెలియకుండా కన్నుల్లో నీరు వచ్చేసింది. కథా వస్తువు అందరి ఇళ్ళల్లో  జరిగే మాములు విషయాలే. ఆ ‘మాములు’ విషయాన్నే అంత  బాగా అక్షరరూపంలో పెట్టడం అటువంటి చేయి తిరిగిన రచయిత్రులకే సాధ్యం!!  కథ చదవటం మొదలు పెట్టగానే, ఎవరో ప్రేమికురాలు వ్రాసిన ఉత్తరమేమో  అనుకుంటాము.  ఒక అక్క తమ్ముడికి వ్రాసిన ఉత్తరం. ఈ రోజుల్లో తోడబుట్టిన వారితో, చిన్న చిన్న విషయాలకు  అహంకారంతో బంధాలు ఎలా పాడుచేసుకుంటున్నామో కళ్ళకి కట్టినట్లు చెప్పారు రచయిత్రి.  చదవగానే నాకు తెలిసిన కొన్నిజీవితాలు గుర్తు వచ్చి text  to life  కి అన్వయించుకున్నాను. 

story1

story2

రచయిత్రి చెప్పిన ఒక మాట బాగా నచ్చింది  ‘ దుర్యోధనుడు శకుని చెప్పుడు మాటలు విన్నాడు కానీ భరతుడు కైక మాట వినలేదు గా ‘ అని. రామాయణం, భారతం లేకుండా ఏ నీతి కూడా చెప్పలేమేమో అన్పించింది ఈ వాక్యం చదివాకా.  అన్నదమ్ముల విషయంలో రామలక్ష్మణుల్లా ఉండమని దీవిస్తారు. కానీ  ఆలోచిస్తే రాముడు, లక్ష్మణుడు ఇద్దరూ  ఒక్క తల్లి బిడ్డలు కాదు. రాముడు ఎప్పుడూ  ధర్మం వీడలేదు.  అదే వాలిసుగ్రీవులయితే  కవలపిల్లలు. కానీ  ధర్మం మర్చిపోయిన వాడు వాలి. అన్న అంటే భయపడి పారిపోయి దాక్కున్న వాడు సుగ్రీవుడు. ఇంకో ఉదాహరణ రావణాసురుడు, విభీషణుడు.  ఇన్ని  ఉదాహరణలు చూపించి  అన్నదమ్ముల అనుబంధం ఎలా ఉండాలో చెప్తుంది రామాయణం. తోబుట్టువుల ఐకమత్యానికి ఇంకో ఉదాహరణ పాండవులు. పెద్దవాడు ధర్మస్వరూపుడు కావాలి, ధర్మస్వరూపుడు అయితే మిగిలిన వారిని ధర్మం తో నడిపిస్తాడు అనుకున్నాడు పాండురాజు. అందుకే ముందు ధర్మరాజు పుట్టాడు.  భారతంలో కొన్ని ఘట్టాలలో యుధిష్ఠరుడి ధర్మం తమ్ములందరినీ కాపాడింది. భీముడికి ఎంత బలం ఉన్నా అన్నయ్య మాట విని చాలా సార్లు కోపాన్ని నిగ్రహించుకున్నాడు. 

చాగంటి గారు కూడా  ఈవీడియో లో అన్నదమ్ములఅనుబంధం గురించి  ఎంత బాగా చెప్పారో చూడండి :

https://www.youtube.com/watch?v=Xv2HAXBQyUo

ఒక్క తల్లికి పుట్టిన పిల్లలు  చిన్నప్పటినుంచీ ఒకే చోట తింటూ తిరుగుతూ పెరిగినవారు బద్ధశత్రువులు గా మారిపోతున్నారు. అందరూ  అని చెప్పను. కొందరు అని చెప్పచ్చు. అసూయాహంకారాలు ఒక ముఖ్య కారణాలు అనిపిస్తుంది నాకైతే. తోడపుట్టిన వారితోటే  వైరం పెట్టుకున్నవారు, ఇక ఎవరితో కలసిమెలసి ఉండగలరు?  తోబుట్టువులతో బద్ధవైరం పెంచుకున్న వారు , ఎన్ని విషతుల్యమైన విషయాలని  బోధిస్తున్నారో ఆలోచించండి. మేనత్త, మేనమామ, బాబాయి, పిన్ని ఇటువంటి బంధుత్వాల మధ్య పెరిగితే ఆ పిల్లలు అదే తీపితనాన్ని ఇంకో తరానికి అందించగలరు. తోబుట్టువులతో కలిసి ఉంటేనే కదా అవసాన దశలో ఉన్న తల్లితండ్రుల్ని సుఖపెట్టగలరు. ఎంత సంపాదిస్తే మాత్రం ఏమి సాధించినట్లు ? వయసుతో  పెరుగుతున్నకొద్దీ  రాగద్వేషాలు తగ్గాలి కదా. వయసుతో పాటు అవీ పెరిగితే ఇక మనిషికి జంతువుకి తేడా ఏంటి?

అన్నయ్య చీర పెట్టకపోతే కోపం తెచ్చుకోనక్కరలేదు. చెల్లికి చీర పెట్టడం వీలు అవ్వకపోతే వీలు కాలేదని ఆ చెల్లికే చెప్పచ్చు. చిన్న చిన్న విషయాలే చిలికి గాలి వానలు చేసుకుంటారు.  ఇక ఆస్తుల కోసం  జరిగే cold war ల సంగతులు చెప్పనే అక్కరలేదు. ఎంత నీచానికి దిగజారిపోతారో చెప్పనక్కరలేదు!!

‘కలిసిమెలిసి ఉండటం చెప్పినంత సులువు కాదు, జీవిత భాగస్వామి మీద కూడా ఆధారపడి ఉంటుంది’ అని అనచ్చు. వచ్చిన జీవిత భాగస్వామి మరీ ఇక psycho personality అయితే చెప్పలేం కానీ, మన బంగారం మంచిదయితే  ఆ స్వభావంతో వేరే వారిని మార్చటం పెద్ద కష్టతరమేమీ కాదు.  జీవితంలో రెండు పెళ్లిళ్లు చేసుకున్న వారుంటారు కానీ ఒకే తోబుట్టువుని రెండుసార్లు పొందిన వాళ్లుండరు  కదా. ఈ జన్మకి వాళ్లే  తోబుట్టువులు!!

ఈ కథ ప్రతి ఒక్కరూ  చదివి తీరవలసిన కథ.  ఈ  వీడియో కూడా తప్పకుండా చూడవలసిన వీడియో!!

తోబుట్టువులనే కాదు కానీ, ఎవరి విషయం లో అయినా సరే, కోపాన్ని కసిగా మార్చుకోకూడదు.  జీవితం లో ఎప్పుడూ చిన్న చిన్న తీపి గుర్తులే మనల్ని ముందుకి నడిపించాలి కానీ చేదు జ్ఞాపకాలు కాదు.

 

 

నా EAMCET కథ

నాకు ఒకే లక్ష్యం ఉండేది చిన్నప్పుడు. బీకామ్ చదవటం, బ్యాంకు లో క్లర్క్ పోస్టు తెచ్చుకోవడం. పదవ తరగతి ఉత్తీర్ణం కాగానే ఇంటర్మీడియట్ కి దరఖాస్తులు పెట్టుకోవడం మొదలు పెట్టాను. సెయింట్ ఆన్స్ లోనో, సెయింట్ ఫ్రాన్సిస్ లోనో CEC గ్రూప్ లో చేరిపోదాం అని నిర్ణయించేసుకున్నాను. అదే విషయం  మా నాన్నతో చెప్పాను. సరే అనేసారు. ‘ఓ పని చేయి ఎందుకైనా మంచిది. ఇంటి దగ్గరే కదా, రెడ్డి కాలేజీ లో కూడా ఓ దరఖాస్తు పడేయి’ అన్నారు. ‘CECతో పాటు MPC కూడా పెట్టు’ అన్నారు.  సరే ఎక్కడా రాకపోతే రెడ్డి కాలేజీ ఉంటుంది అనుకుని పెట్టేసాను. తీరా సెయింట్ ఫ్రాన్సిస్ లో రాలేదు. జీవితం లో చాలా కోల్పోయినట్లు వెక్కి వెక్కి ఏడ్చాను.  సెయింట్ ఆన్స్ లో అనుకున్నట్లే సీటు వచ్చేసింది. చేరిపోవడం తరువాయి అనుకుంటున్న సమయం లో రెడ్డి కాలేజీ లిస్ట్ చూసి రమ్మన్నారు. MPC లో పేరు లేదు. హమ్మయ్య అని అనుకుంటుంటే,  మా నాన్న అమ్మని పిలిచి రెడ్డి కాలేజీ లో ఒక లెక్చరర్ పేరు చెప్పి, ‘ఆవిడకి  దీని సైన్స్, లెక్కల లో మార్కులు చెప్పి MPC లో సీటు  ఇస్తారేమో కనుక్కో’  అనేసారు. పరిస్థితి తారుమారు అయిపోతుంటే భయం వేసింది. అయినా కొంచం ధైర్యం గానే ‘MPC లో చేరను’ అని తేల్చి చెప్పేసాను. మా అక్క క్లాసుల మీద క్లాసులు పీకేసింది.  మా నాన్న మాటే వినదల్చుకోలేదు ఇదెంతలే  అనుకున్నా!! మా ఇంటి క్రింద ఉండే లెక్చరర్ ఒకావిడ బయటకి వెళ్తుంటే కనిపించి  ఏ గ్రూప్ అని అడిగి చెప్పగానే, నాకు క్లాసు  పీకింది ‘ ఈ రోజుల్లో CEC ఏంటమ్మా, MPC తీసుకుని ఇంజనీర్ అవ్వు ‘ అని.  చెప్పింది లెక్చరర్ కదా. కొంచం ఆలోచన మొదలయింది.  నాన్న నెమ్మదిగా ఒక్కటే చెప్పారు ‘MPC తీసుకో. రెండేళ్ళు  చదువు. నచ్చకపోతే డిగ్రీ లో బీకామ్ చేరు’ అని. ఇదేదో బానే  ఉంది అన్పించింది.  అమ్మ వెళ్ళటం ఆ లెక్చరర్ తో మాట్లాడటం, రెడ్డి కాలేజీ లో చేర్పించడం జరిగిపోయింది.

Agrwal classes నుంచి IIT  material  తెప్పించుకోమన్నారు. ‘ఉట్టికెక్కలేనమ్మ’ అన్న సామెత గుర్తొచ్చింది. వాళ్ళు పదవ తరగతి మార్కుల బట్టి material  పంపుతారు. నాకు ఎప్పుడు పంపాలీ అనుకున్నా. నా సైన్స్, లెక్కల మార్కులు నచ్చాయి కాబట్టి  పంపేస్తున్నాం అంటూ ఉత్తరం పంపారు వాళ్ళు. మొదటి సంవత్సరం ఇప్పటి పిల్లల్లా 900 తెచ్చుకోలేదు కానీ ఒక మాదిరి గా  బానే వచ్చాయి. ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం.  విద్యానగర్ లో TRT quarters లో ఉండే  IIT  రామయ్య గారింటికి తీసుకెళ్లారు. ఆయన రెండవ సంవత్సరం లో తీసుకోవడం అసలు కుదరదు అని ఖచ్చితంగా చెప్పారు. అది తల్చుకుంటే అనిపిస్తుంటుంది, మా నాన్నగారు నా మీద మరీ ఆశలు  పెట్టుకున్నారేమో అని 🙂  ‘ఒకసారి EAMCET కోచింగ్ కి వెళ్ళిరా, వస్తే వస్తుంది లేకపోతే లేదు’ అంటూ శెట్టి ట్యూషన్ లో చేర్పించేసారు.  తెలీకుండా ఆ ఏడాది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాను.

అప్పట్లో  EAMCET ఒక్కొక్క యూనివర్సిటీ వారు నిర్వహించేవారు. ఆ ఏడాది REC వరంగల్ వారు నిర్వహించారు. దరఖాస్తు పెట్టాక acknowledgement కార్డు రాలేదు. మళ్ళీ ఏడుపు మొదలు !! మా తమ్ముడిని, నన్ను పిలిచి వరంగల్ REC కి ఎలా వెళ్లాలో ఒక map వేసి చూపించి, ఎవరిని కలవాలో చెప్పారు. ఒక రోజు పొద్దున్నే కృష్ణా ఎక్సప్రెస్ లో కాజీపేట లో దిగి ఆటోలో REC  క్యాంపస్ కి వెళ్ళాము.  ఆయన  పేరు గుర్తు లేదు కానీ, ఆయన  నాన్న పేరు  చెప్పగానే మమ్మల్ని కూర్చోబెట్టి, అన్ని వేల దరఖాస్తులలో ఎలా వెతికించారో తెలీదు కానీ  acknowledgement కార్డు ఇచ్చారు. వాళ్లింట్లోనే భోజనం కూడా పెట్టారు పాపం !! మళ్ళీఅదే రోజు సాయంకాలానికి  ఈస్ట్ కోస్ట్ లో సికింద్రాబాద్ వచ్చేసాం.  ఆ ప్రయాణం తలుచుకుంటే నాకు, మా తమ్ముడికి  – ఒక్కరమే ట్రైన్లో తెలీని ఊరు వెళ్లడం కనుక్కోడం – ఒక adventure గా అన్పిస్తుంది. ఆ రోజే మా తమ్ముడు ఎలాగైనా REC  లో చదవాలి అని నిశ్చయించేసుకున్నాడు కూడా !! నేను సాధించలేదు కానీ, వాడు సాధించేసాడు!! కాకపోతే వరంగల్ కాదు !! ఇక అది వేరే విషయం.

ఇక అసలు ఘట్టం !! EAMCET రోజు రానే వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ సెంటర్ !! మా నాన్నే స్వయంగా తీసుకెళ్లి  దిగబెట్టారు.  కొన్ని రోజులకి  ఫలితాలు రానే వచ్చాయి!! నా నెంబర్ పక్కన నా ర్యాంకు. అది చూసి ఇంట్లో అందరూ ఎగిరిగెంతులే !! ఏదో  స్టేట్ ఫస్ట్ వచ్చాననుకుంటున్నారేమో !! కాదండీ !! నా ర్యాంకు 2680!! దానికే అంత సంబరం అంటారా 🙂 CEC తీసుకుందామనుకున్న నాకు ఇలాంటి ర్యాంకు రావడం వింతల్లో వింతే కదా !! మొత్తానికి అలా ఇంజనీర్ని అయ్యానండీ.

నాకొచ్చిన ర్యాంకు కి REC ఏం  వస్తుందిలే అన్ని నేను అసలు అప్లై చేయలేదు. ‘ఒక్కోసారి ఉన్నటుండి గవర్నమెంట్ వాళ్ళు  ladies quota అని చెప్తే ఏం చేస్తావు. ఓ అప్లికేషన్ పడేయటంలో తప్పులేదు కదా ‘ అని తనే స్వయంగా వరంగల్ కి వెళ్లి మరీ ఇచ్చి వచ్చారు. నిజంగానే ఆయన  చెప్పినట్లు, నా ఇంజనీరింగ్ అయిపోగానే , ladies quota పెట్టారు 🙂

ఈ కథంతా ఎందుకు చెప్తున్నాను అంటే, మా నాన్న నా పదవతరగతి మార్కులని బట్టి నేను ఏం  చదవగలనో తనే  నిర్ణయించేసుకుని  మనసులో సంకల్పం చేసేసుకున్నారు ‘ ఈ పిల్లని ఇంజనీరింగ్ చదివించేయాలని’ . బలవంతంగా రుద్దకుండా, ఎక్కడా కోపతాపాలకు తావి లేకుండా తాను చేయాల్సిందంతా సైలెంట్ గా చేసేసారు. మా పిల్లలతో కూడా ఇదే పద్ధతి పాటిద్దామనే ఎంతో ప్రయత్నిస్తుంటాను నేను.

ఇలా ప్రతి విషయంలో తెలీకుండా మాకు ఎన్నో పాఠాలు నేర్పేసారు మా నాన్న గారు. ఇప్పుడు మా పిల్లలకి నేర్పిస్తున్నారు 🙂 !!

వేసవి సెలవలు -1 పూలజడ

వేసవి సెలవలు రాగానే  అమ్మమ్మగారింటికి వెళ్ళిపోయి బడి తెరిచే ఒక  వారం రోజుల ముందు వచ్చేవాళ్ళం. మా అమ్మ ఎక్కువ వచ్చేది కాదు. వచ్చినా ఒక రెండు రోజులు ఉండి  వెళ్లిపోయేవాళ్లు అమ్మా, నాన్న. ఇక మా ఇష్టమే ఇష్టం!! పిన్నులు, వాళ్ళ పిల్లలు, మావయ్య, ఆవరణ లో పిల్లలు. రోజులో  24 గంటలు సరిపోయేది కాదేమో మా ఆటలకి.  మా అమ్మమ్మ గారి ఊరు గురించి నా మొట్టమొదటి టపా చెరగని తరగని జ్ఞాపకాలు లో చెప్పాను .

రోజంతా ఆటలు. మధ్యాహ్నం తాటి ముంజలు తినడం.  సాయంత్రం పెరట్లో తులసి చెట్టు దగ్గర కందిపచ్చడి, కొత్త ఆవకాయ, మామిడి పండు తో భోజనాలు.  ఆరుబయట వేపచెట్టు కింద మంచాలు, పక్కలు వేసుకుని కబుర్లు.  మధ్యలో కరెంటు పోవడం. వెంటనే  లాంతరు (సాయంత్రం అవ్వగానే ఎప్పుడూ వెలిగే ఉండేది)  ఒత్తి పెద్దగా చేయడం.  ఈ రోజుల్లో ఏ క్యాంపింగ్ ట్రిప్ పనికొస్తుంది ఇటువంటి అనుభవాలతో !!

అలా  ఉండేరోజుల్లో, ఒక రోజు నాకు, మా అక్క కి  పూలజడలు వేయించాలని సంకల్పం చేసేది అమ్మమ్మ. రోజూ నాలుగవ్వగానే మల్లెపూల అబ్బాయి వచ్చి మల్లెమాలలు ఇచ్చి వెళ్ళేవాడు.  పూలజడల కోసం ఆరోజుకి మొగ్గలు  తెమ్మని అతనికే చెప్పేది అమ్మమ్మ. లేదా, లచ్చారెడ్డి తోట అని ఇంటి దగ్గరే ఒక మల్లెపూల తోట ఉండేది. అక్కడికి వెళ్లి మల్లెమొగ్గలు తెచ్చుకునేవాళ్ళం.

పూలు ఉండగానే సరికాదు కదా. జడ వేసేవారు కావద్దూ!!  వీధి చివర ఉండే కమలమ్మగారు కానీ,  పక్క వీధీ  ఉండే గోపాలయ్య గారి భార్య శాంతమ్మగారు కానీ వేసేవాళ్ళు. వాళ్ళకి  కుదురుతుందో లేదో ముందే అడిగి కనుక్కునేది అమ్మమ్మ. కమలమ్మ గారు జడ వేసినప్పుడు ఆ విశేషాలు గుర్తు లేవు కానీ శాంతమ్మగారు బాగా గుర్తు.   భోజనాలు అవగానే మొగ్గలని నీళ్ళల్లో వేసుకుని గిన్నెలతో , జడ కుప్పెలు, సవరాలు , వేరే అలంకరణ సామగ్రితో వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. గోపాలయ్య గారింట్లో అయితే అందరికీ  కాలక్షేపమే.  వారిది కిరాణా కొట్టు.  వచ్చేపోయే వారు ఎక్కువ. పూలజడల కార్యక్రమం వరండాలో పెట్టేవారు. అందరు ఎవరికీ తోచిన సలహా వారు ఇస్తూ, కబుర్లు చెప్తూ ఇలా సాగేది ఆ కార్యక్రమం.  వారికీ నలుగురు అమ్మాయిలు. చివరి అమ్మాయి మాతోటిది. మధ్యలో అప్పటికప్పుడు వెళ్లి అలంకరణ కోసం మా ఆవరణకి వెళ్లి అనార్కలి, మరువం, కనకాంబరాలు కోసుకొచ్చిపెట్టేది మాకు. వాళ్ళందరూ కొబ్బరిపుల్లలకి  మొగ్గలు గుచ్చి సహాయం చేసేవాళ్ళు.

సన్నగా ఉండే నా జడని సవరాలు పెట్టి పొడుగ్గా చాలా అందం గా వేసేవారు ఆవిడ.  అలా మల్లెలు, మరువం, కనకాంబరాలతో ఆవిడ వేసే జడ ఏ బ్యూటీ పార్లర్ వాళ్ళు వేయలేరు అని ఖచ్చితంగా చెప్తాను.  అయితే జడ కుప్పెల దగ్గర చిన్న రాజకీయం చేసేవారు  మా అమ్మమ్మ, ఆవిడా ఇద్దరునూ !! అప్పట్లో బంగారు నాగరం, బంగారు కుప్పెలు ఉండేవి.  అమ్మమ్మ, వాటిని పెద్ద మనవరాలని మా అక్కకి పెట్టమని రహస్యంగా  శాంతమ్మ గారికి చెప్పేది. పూసలు, తళుకులు, చమ్కీలు ఉండే కుప్పెలు, అనార్కలి పూవు( నాగరంలా)  నాకు పెట్టమని చెప్పేది. ఒకసారి ఆ రాజకీయం అర్ధమయ్యి నేను ఏడిస్తే, తళుకులు చూపించి ‘ప్రపంచం లో ఇంతకంటే అరుదైన కుప్పెలు లేవు’ అన్నట్లు చెప్పి  శాంతమ్మగారు నన్ను మైమరిపించారు.

ఇక్కడ గోపాలయ్య గారి కుటుంబంతో ఉన్న అనుబంధం కూడా  చెప్పాలి.  మా అమ్మనాన్న పెళ్ళికి వాళ్ళిల్లు విడిది. వాళ్ళ పెద్దమ్మాయి పెళ్ళికి మా అమ్మమ్మగారిల్లు విడిది. వాళ్ళ ఇల్లు కూడలి పక్కనే ఉండటంతో మేము రైలు దిగి వస్తుంటే వాళ్ళే వీధి లోకి వచ్చి   ‘ఏ బండికొచ్చారు ?లేటా ‘ అని అడుగుతూ మాకు ముందు స్వాగతం చెప్పేవారు.

IMG_0196
ఫోటోలో మామిడి చెట్టున్న ఇల్లే గోపాలయ్య గారిది

 

పూలజడ వేసాక  పరికిణీలు  వేసుకుని తయారయ్యేవాళ్ళం. పూలజడల కోసం మేము క్రొత్త పరికిణీలు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి. మాచింగ్ గాజులు, లోలాకులు, పాపిటబిళ్ళ  అన్నీ  ఫాన్సీ స్టోర్ లో ముందే కొని పెట్టుకునే వాళ్ళం. ఆ విధంగా తయారయ్యి అందరి ఇళ్ళకి వెళ్లి పూలజడ చూపించి వచ్చేవాళ్ళం. ముందు శాంతమ్మ గారింటికి. తర్వాతే ఎవరింటికైనా.  ప్రతి ఇంటికి వెళ్ళగానే ‘ ఏంటమ్మా’ అనే వారు. అంటే ఎందుకొచ్చారన్నట్లు. దానికి మా సమాధానం ‘ పూలజడ చూపించడానికి వచ్చామండీ’ అని 🙂 ‘ఎవరు వేసారూ’ అంటూ  వెనక్కి తిరగమనేవారు. అలా అందరి ఇళ్ళు వెళ్లి వచ్చాక, మావయ్య ఫోటో స్టూడియో తీసుకెళ్లి ఫోటో తీయించేవాడు. అదేంటో కానీ ఒక్క ఫోటో కూడా లేదు.

IMG_0197
వారి ఇల్లు ఉన్న వీధి

ఒక్కోసారి ఆవరణలో మా స్నేహితురాలు  వరలక్ష్మి కూడా మాతోపాటు పూలజడ వేసుకునేది.  అంత మందికి ఎలా వేసేదా  ఆవిడా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది. మా మావయ్య ఎవరి జడలు నలగకుండా ఉంటాయో చూద్దాం అనే పోటీ పెట్టేవాడు. ఇక రాత్రంతా పడుకోకుండా దానిని కాపాడటం సరిపోయేది.

అదండీ  నా పూలజడ కథ. అమాయకంగా ఉండే ఆ రోజులే వేరు. ఒక్కోసారి ఆలోచిస్తుంటే Electronic gadgets వలన సగము ఇటువంటి చిన్ని చిన్ని సరదాలకు , ఆనందాలకు మనం ఎంత దూరం అయిపోతున్నామా  అనిపిస్తుంది.