కథలు చదవాలా ? భాగం -2

మొదటి భాగం  ఇక్కడ

ఈ కథలు, పుస్తకపఠనం  నేపథ్యంలో  ముచ్చటగా మూడు  విషయాలు చెబుతాను:

ఒకటి :

మా అమ్మాయిలు ఎలిమెంటరీ బడిలో ఉన్నపుడు, వారానికి మూడు రోజులు/రోజుకో రెండు గంటల దాకా వాళ్ళ బడి గ్రంథాలయం లో వాలంటీర్ గా చేసేదాన్ని. నా పని ఏంటంటే పిల్లలు వెనక్కి తిరిగి ఇచ్చేసిన పుస్తకాలూ, ఆయా వర్గాల పుస్తకాలలో సర్ది పెట్టడం. ఇది వరకు నా టపా లోనే చెప్పాకదా అమెరికాలో పుస్తకాల గురించి 🙂 . అలా  సర్దే సమయంలో పిల్లలు లైబ్రరీ తరగతికి వచ్చేవారు.  అప్పుడు ఆ లైబ్రేరియన్, పిల్లల్ని కూర్చోబెట్టి ఓ పుస్తకం చదివేవారు . తర్వాత పిల్లలు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలూ తీసుకుని వెళ్లేవారు.  ఆ లైబ్రేరియన్ చదివే విధానం చూస్తే నాకే చిన్నపిల్లనై అక్కడ కూర్చోవాలని అనిపించేది. ఇంకా ఆవిడ ప్రత్యేకత ఏంటంటే కథ చదివాకా గిటార్ వాయిస్తూ పాట కూడా పాడేది. పిల్లలు పుస్తకాలు  ఏం  తీసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నపుడు, వాళ్ళు  ఏవో ఒక పుస్తకాలూ తీసుకెళ్లకుండా, ‘ఇది కావాలా ? ఈ కథ  ఇలా భలేగా  ఉంటుంది చూడు’ అంటూ రకరకాల పుస్తకాలూ తీసి చూపించేవారు. ఆవిడ  చెప్పే విధానం చూసి వాళ్ళు వెంటనే తీసేసుకునే వారు. ఆవిడ ఉద్యోగం ఏదో  భుక్తికోసం అన్నట్లు కాక, పిల్లలతో కలిసిపోయి చేయడం చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపించేది.   

రెండు:

మంచి పుస్తకం :

అమెరికాలో పిల్లలకోసం(ముఖ్యం గా 3-5 ఏళ్ళ వయసులో వారికి) అందంగా , ఆకర్షణీయంగా ఉండే పుస్తకాలూ ఉన్నట్లు,  తెలుగులో కూడా ఉంటే ఎంత బావుంటుందో అనుకునేదాన్ని. 2005లో అనుకుంటాను. హైదరాబాద్  లో , విజయవాడ లో  పుస్తకాల కొట్లు వెతికినా అటువంటి పుస్తకాలు దొరకలేదు.  దొరికిన వాటినే  మా అమ్మాయిలు చదివేవారు . తరువాత 2008లో హైదరాబాద్  దోమలగూడా  రామకృష్ణమఠం లో TTD  వారిచే ఆంగ్లం లో ప్రచురించబడ్డ  పిల్లల పుస్తకాలూ కనిపించాయి. అన్నీ కొనేసాను. మా పెద్దమ్మాయికి పురాణాలూ, వివేకానందుడు , రామకృష్ణ పరమహంస కథలు లాంటివి అన్నీ  తెలిసాయి అంటే రామకృష్ణమఠం, TTD వారి ధర్మమే అని చెప్పచ్చు.  

ఈ మధ్య నవంబరులో భారతదేశం వెళ్లేముందు మా మనబడి కేంద్రం నిర్వాహకులు ఫోన్ చేసి,  ‘ మీరు హైదరాబాద్ వెళతారు కదా. మన మనబడి గ్రంథాలయానికి పుస్తకాలూ కొన్ని చెప్తాను. పట్టుకురాగలరా ?’ అని అడిగారు. అటువంటి పనులు అంటే మహాఇష్టం కాబట్టి  వెంటనే ఒప్పేసుకున్నాను. వారు ఆ ప్రచురణకర్తల చిరునామా ఇచ్చారు. ఆ చిరునామా చూస్తే మా అమ్మ గారింటికి నడచి వెళ్లగలిగే దూరంలో ఉంది.

భారతదేశం వెళ్ళాక, ఓ రోజు పొద్దున్నే వారి దగ్గరికి వెళ్ళాను. వారి టీం సభ్యుల పేర్లు సురేష్ గారు & భాగ్యలక్ష్మి గారు. నాకు వారి గురించి ఏమీ తెలీదు. ఒక ఇంట్లో వారు ఈ పుస్తకాలని విక్రయిస్తారు. చిన్న చిన్న పుస్తకాలూ &  వాటిల్లో  అందమైన రంగు రంగుల బొమ్మలతో కథలు  ఎంత ఆకర్షణీయంగా & చక్కగా ఉన్నాయో చెప్పలేను. కొన్ని Bilingual పుస్తకాలూ ఉన్నాయి. అవి విదేశాలలో తెలుగు నేర్చుకోవాలనే పిల్లలకి బాగా ఉపయోగ పడతాయి.

 తీసుకెళ్ళే లగేజీ సరిపోతుందో లేదో అని సందేహించాను, కానీ ఉన్న పుస్తకాలన్నీ కొనేయాలి అన్నంత బావున్నాయి!! ఆ పుస్తకం పేపర్ నాణ్యత, ధర చూస్తే వెంటనే అర్థమయిపోతుంది వారు ఈ పని ఏదో  లాభాపేక్ష కోసం చేయటం లేదు అని.  ఆత్రంగా చాలా మటుకు కొనేసాను. ఇంటికి వెళ్ళాక తక్కువగా ఉన్నాయేమో అనిపించింది. మళ్ళీ  వెళ్ళి  ఇంకొన్ని కొన్నాను.  కానీ పెట్టెల బరువు ఎక్కువయ్యి వదిలి వేసి రావాల్సి వచ్చింది.  ఇక అమెరికాకి  రాగానే,  మొదటి త్రైమాసికం పరీక్ష పెట్టాను. పరీక్ష అయిపోయి పేపరు ఇచ్చేసిన పిల్లలు అల్లరి చేయడం మొదలు పెట్టారు. నెమ్మదిగా ఈ పుస్తకాలూ ఓ రెండు తీసి బయట పెట్టాను.  అందులో ఒకటి ‘కోటయ్య కట్టిన ఇల్లు’ . అంతే ఒక్కొక్కరూ దాని చుట్టూ జేరి చదవటం మొదలు పెట్టారు.  అంటే అర్ధమయ్యింది కదా వారి పుస్తకాలూ ఎంత బావున్నాయో !!

వారి వెబ్సైటు ఇదిగో :

http://manchipustakam.in/

పుస్తకాలూ కూడా చాలా తక్కువ ధరలోనే ఉన్నాయి. కొన్ని పుస్తకాలైతే  ఒక్కొక్కటీ   20/- రూపాయలు మాత్రమే. పిల్లల పుట్టినరోజులకి return గిఫ్ట్ గా కూడా ఇవ్వవచ్చు.  వీరు set గా కూడా అమ్ముతున్నారు. వాటిని ఎవరికైనా బహుమతులు గా కూడా ఇవ్వవచ్చు. మా తరగతిలో దాదాపు 15 మంది పిల్లలకి ఒక్కొక్కరికీ  రెండు పుస్తకాలూ, మా గ్రంథాలయానికి ఓ పాతిక పుస్తకాలూ , ఇంకా ఆత్రం కొద్దీ కొని వదిలేసిన పుస్తకాలూ అన్నీ  కలిపితే ఓ చీర ఖరీదు కూడా కాలేదు.  

తెలుగు భాషని  భావి తరాలకి అందించడానికి ఇటువంటి వారు చేసే కృషిని  ప్రోత్సాహించండి.

మూడు :

చల్లా  ఉమా గాయత్రి గారు:

ఈవిడ కూడా పిల్లల కోసం చాలా ఆకర్షణీయం గా పుస్తకాలూ వ్రాసారు. ఎంత బావున్నాయో  ఈ లంకెలో కనిపిస్తాయి చూడండి.  

https://naatelugupustakaalu.wordpress.com/

వీరి పుస్తకాలూ కూడా తెచ్చుకుందాం అనుకున్నాను. కానీ చెప్పాను  కదా. ఆ పెట్టెల్లో ఏం  పెట్టానో తెలీదు కానీ బరువెక్కిపోయాయి. ఇక్కడకి రాగానే, మా మనబడి గ్రంధాలయంలోనే  దర్శనమిచ్చాయి.  నేను చూస్తుంటే ‘అవి కూడా ఈ మధ్యనే వచ్చాయండీ. బావున్నాయి కదా? ’ అన్నారు మా గ్రంధాలయ నిర్వాహకురాలు.
‘కథలు చదవాలా’ అన్న ప్రశ్న నన్ను ఎందుకు ఇంత ఆలోచింప చేసిందో,  పైన చెప్పిన మూడు విషయాలలో వారిని గురించి చెప్పాక అందరికీ  అర్ధమయ్యిందనే అనుకుంటాను.

కథలు చదవాలా ? భాగం -1

మన బడి మొదటి త్రైమాసికం పరీక్ష  రెండు రోజులుండగా….  ఫోన్లో సమావేశం.. పరీక్ష  గురించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం. అప్పుడే భారతదేశం నుండీ విమానం దిగానేమో!! ఏ పని చేయబుద్ధి కాక, తెచ్చిన పెట్టెలలో వస్తువులు చూస్తూ, చూపిస్తూ, మధ్య మధ్యలో సర్దుతూ,  తల్లితండ్రులు వేస్తున్న ప్రశ్నలు వింటున్నాను.  ‘పరీక్షలో, మొదటి త్రైమాసికం పాఠ్యపుస్తకం లోని కథలలో నుంచి  ప్రశ్నలు అడుగుతారు  అని చెబుతున్నారు. అన్ని కథలు గుర్తుంచుకోవడం అంటే కష్టం కదండీ. ఇప్పుడు ఆ కథలన్నీ చదవాలా ?’ అన్న ఒక  ప్రశ్న బాగా గుర్తుండిపోయింది. సమాధానం ఏంటో వినలేదు నేను. ముందస్తుగా,  ఆ ప్రశ్న నేను చెప్పే తరగతి తల్లితండ్రులు నుంచీ కాకపోవడంతో కాస్త సంబరపడ్డాను.

వేసిన ప్రశ్న తప్పు అనట్లేదు. తల్లితండ్రులు తెలుగు తరగతికోసం వారానికి మూడు గంటల సమయాన్ని కేటాయించడమే ఎక్కువ.  పిల్లలతో పరీక్షల కోసం చదివించడం  &  వ్రాయించడం  అనేది ఇంకా ఎక్కువ. అలాంటప్పుడు కథలు చదివించడం అనేది చాలా ఎక్కువ కాబట్టి అటువంటివి ఆశించకూడదు. కానీ ఆ ఒక్క ప్రశ్న, మన జీవితాలు మనం ఎంత ‘task  oriented ‘ గా మార్చుకుంటున్నాము అనడానికి  కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే!!

అమెరికాలో రోజూ పడుకునేముందు  పిల్లలకి కథలు చదవండీ  అని చెప్తారు. రోజుకి ఒక్క 10 నిముషాలు చాలు, ఒక  కథ చదివి వారితో చర్చించడానికి.  అదే తెలుగే కావచ్చు. ఇంకే  భాషయినా కావచ్చు. కథలు చదువుతున్నపుడు ఎన్ని కబుర్లు చెప్తారో. అదీ పది పన్నెండేళ్ళ వయసు వచ్చేవరకూ మాత్రమే!!  తర్వాత మనం కథ చదువుతాం వినండీ  అన్నా కూర్చునే తీరిక & సమయమూ వారికీ ఉండవు . కానీ వారితో కూర్చుని పుస్తకపఠనం చేయడం అనేది ఒక విత్తనం నాటడంలాంటిది. ఒక చక్కటి చిన్నప్పటి  జ్ఞాపకంగా మిగిలిపోతుంది.  పొద్దున్న లేచినప్పటినుంచీ ఉరుకులు పరుగులు పెట్టే  జీవితాలకి  పుస్తకపఠనం అనేది పిల్లలతో సమయం గడపడానికి  & తల్లితండ్రులతో  బంధం ఏర్పడడానికి  ఒక సులువైన మార్గం. అలా అని  ప్రతీ కథా, ప్రతీ పుస్తకము వారితో కూర్చుని చదివే సమయం ఉండకపోవచ్చు. కానీ కొంత సమయం తీసుకుని ఒకసారి అలవాటు చేయాలి. అంటే రుచి చూపించి వదిలేయాలి.  ఆ అలవాటే వాళ్ళంతట వాళ్ళే అల్లుకుపోయేలా చేసి నెమ్మదిగా భాష మీద ఆసక్తి కలిగిస్తుంది.

ఇక తెలుగు నేర్పించడం అన్న విషయానికి వస్తే  –  లెక్కలు, సైన్స్ అంటే నేర్చుకోకపోతే జీవితంలో భుక్తి గడవదు కాబట్టి, పిల్లలని చెవులు పిండయినా ఎలాగో అలా నేర్పిస్తాం. కానీ తెలుగు అలా కాదు కదా. సరదా కోసం నేర్చుకుంటున్నది. అది నేర్చుకోవడం ఒక పెద్ద పని అనుకుని, పిల్లల మీద ఒత్తిడి పెడితే, వాళ్ళు నేర్చుకోరు  సరికదా తెలుగు అంటే  విముఖత పెరుగుతుంది.  భోజనాల సమయం లో తెలుగులో మాట్లాడాలి అనే నియమం పెట్టుకోవడం, కార్ లో వెళ్ళేటపుడు words building  లాంటి ఆటలు ఆడటం, చిన్న చిన్న flash  cards  చేయటం వంటి చిన్న పనులతో వాళ్ళకి ఆసక్తి పెంచవచ్చు.  ఇది వరకు ‘జోడించు’ అనే ఆట గురించి ఒక టపా పెట్టాను. అటువంటి ఆటలు ఆడటం!! తెలుగనే కాదు  అది ఏ  భాష అయినా, ఏ కళ  అయినా కావచ్చు. తెలుగు నేర్చుకోవడం, శ్లోక/ బాలవికాస్  లాంటి  తరగతులు (activities) పిల్లలకి సరదాగా ఒక ఆట విడుపులాగా ఉండాలి.  మన సంగతే తీసుకుంటే, ఎంత పెద్ద  చదువులయినా చదివి ఉండచ్చు. తెలుగు గురువులని మాత్రం ఎప్పుడూ మర్చిపోము. ఎందుకంటే ఆ తరగతి ఎప్పుడూ  ఒక ‘break ‘ లాగా ఉండేది.

రెండవ భాగం  ఇక్కడ

తెలుగు సభలట…

వెంకయ్య నాయుడుగారు  ప్రపంచ తెలుగు మహాసభల  సందర్బంగా  కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పారు !!అవి విన్నాకా నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం కాకముందు నైజాం  పాలనలో ఉండేది. ఆ రోజుల్లో మా ముత్తాత గారు, (అంటే మా నానమ్మ తండ్రి గారు)  హైదరాబాద్ మహబూబ్ కాలేజీ లో పని చేసేవారు.  నైజాం  కొలువు కాబట్టి ఆంధ్రా వాళ్ళలాగా పంచె కట్టుకునేవారు వారు కాదుట. అదొక నియమం !!  అంటే వీళ్ళ కట్టుబొట్టూ  నిజాం  వారి సంప్రదాయంలో ఉండాలి అన్నది నియమం !!  మా నాన్నగారు పుట్టే సమయానికి హైదరాబాద్లో రజాకార్ల గొడవలతో అల్లకల్లోలంగా ఉండేదిట. ఆడవారికి భద్రత అనేది చాలా భయంకరంగా ఉండింది అని చెబుతుంటుంది మా నానమ్మ !!  అందుకని  మా ముత్తాతగారు ఈవిడ పురిటి సమయానికి అప్పటికప్పుడు ఇంట్లో  వారందరినీ  రైలులో ఆంధ్రా కి పంపేసారుట. ఇవి ఆరోజున నైజాం  వారి పాలనలో సామాన్య ప్రజలు పడ్డ కొన్ని బాధలు !!

నైజాం ప్రభువు పాలనలో  ‘తెలుగు’ , ‘ఆంధ్ర’ అలాంటి  పదాలు వినపడకూడదు కూడా. వాటిని గురించిన సభలు కూడా పెట్టకూడదు. అంతటా కూడా ఉర్దూనే !! ప్రజలు మాట్లాడే భాష తెలుగు. మాధ్యమం మాత్రం ఉర్దూ!! ఆనాడు ఆ ఆంక్షలకి తలవంచుతూనే, సభలు పెట్టి, శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం లాంటివి ఎన్నో స్థాపించి తెలుగు భాషని రక్షించిన వారి గురించి చెప్పాలంటే బోలెడంత !!  నిజాం  పాలన ఎటువంటిదో పైన చెప్పాను  కదా!! అంటే ఇటువంటి వారు తెలుగు  భాష కోసం ఆ రోజుల్లో ఎంత risk  తీసుకుని ఉంటారో ఆలోచించండి !! ఆంధ్రా నుంచి వచ్చామా, తెలంగాణా నుంచి వచ్చామా అన్న ప్రశ్న లేదు.

దాదాపు 80 ఏళ్ళ క్రిందట  ‘బాలికలు కూడా చదువుకోవాలి’ అంటూ తెలంగాణా రాజధాని హైదరాబాద్ లో నారాయణ గూడ లో  స్థాపింపబడిన మాడపాటి హనుమంతరావు గారి బడిలో పైసా ఖర్చు   లేకుండా చదువుకున్న ‘మాడపాటి అమ్మాయి’ ని నేను ( అక్క కి  సంవత్సరానికి 20/- రూపాయలు. చెల్లి కూడా అక్కడే చదివితే  10/- రూపాయలు !!).  నాకు , మా అక్కకే  కాదు కొన్ని వేల మంది స్త్రీలకి విద్యాదానం చేసింది ఆ బడి!! ఇంజినీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు !!   

కొంతమంది,  వారు చేసేపని నిశ్శబ్దంగా చేసుకుంటూ పోతుంటారు. కీర్తికండూతి అనేది వారికి  తెలీదు. అటువంటి వారిలో పద్మభూషణ్ ఆంధ్ర పితామహ  మా మాడపాటి హనుమంతరావు తాత గారు ఒకరు !!  

ఆ నాటి హైదరాబాద్ రాష్ట్రంలో తెలుగు సేవ చేసిన  ఇటువంటి మహనీయుల(గురువుల) గురించి, తెలంగాణా ముఖ్యమంత్రి ఈనాటి ప్రపంచ తెలుగు మహాసభలో  ఒక్క మాట కూడా ప్రస్తావించకపోవడం  చాలా శోచనీయం !!