తెలిసితే మోక్షము తెలియకున్న బంధము…

పనిలో  చేరిన కొత్తల్లో  ’మన వాళ్ళు ‘ అంటూ  ఎవరూ కనిపించట్లేదే అనుకుంటూ సీట్లోకి రాబోయాను. వస్తూనే, నా పక్క  సీటులో ‘మన’ పేరు కనిపించేసరికి ‘పోన్లే ఒకడైనా ఉన్నాడు’ అనుకున్నాను. పెద్దగా  మాట్లాడలేదు. తనతో కలిసి చేయవలసిన అవసరం రానే వచ్చింది. ‘నువ్వు ఇండియా లో ఏ ప్రాంతం ‘ అని అడిగా. ‘ నేను  ఇండియన్ కాదు’ అంటూ ఠక్కున సమాధానం వచ్చింది. ‘మరి ఆ పేరు ?’ నాకు ఆశ్చర్యం. ‘ మా తల్లితండ్రులు ఇండియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. అందుకే  ఆ పేరు. వాళ్ళు తెలుగు వారే’ అన్నాడు. మనసులో ‘ఓ ఏబీసీడీ వా తండ్రీ!! అందుకేనా ఆ చిరాకు’ అనుకుని, ‘అయితే తెలుగు అర్ధం అవుతుంది నీకు’ అన్నా. ‘లేదు!! నేను తెలుగువాడ్ని కాదు కాబట్టి నేర్చుకోవాలనుకోలేదు. అందుకే మాట్లాడను’ సమాధానం. ‘అయితే నిన్ను తెలుగులో తిట్టుకోవచ్చన్న మాట’ అంటూ నవ్వేసుకున్నాం. అలా మొదలయ్యి రోజులు కాస్తా ఏళ్ళు గడిచిపోయాయి. పొద్దుటే వెళ్ళగానే నాకంటే ముందే వచ్చేసిన తనని పలకరించడం &&  నేను ఏం చేసినా ‘Indian way ‘ అని తను అనడం, నేను కూడా ‘నువ్వూ!!నీ ఇండియన్ మోహం’ అంటూ ఏడిపించడం మా ‘ఇండియన్ ‘ స్నేహితుడితో  ఓ అలవాటు గా మారిపోయింది.

 

దోసెలు , గోంగూర పచ్చడి, కాజాలు లాంటి తెలుగు వంటలు వాళ్ళమ్మ చేసేవారని, తనకి  చాలా ఇష్టమని చెప్పాడు. సరే ఒకసారి దోసెలు తెచ్చిస్తానని చెప్పా.  ‘సరే అయితే . ఆ పల్లీ పచ్చడి లో కాస్త కొబ్బరి కూడా వేసి పట్రా ‘ అన్నాడు . ‘ నువ్వేమో ఇండియన్ కాదా ?నీకేమో ఇండియన్ రుచులు కావాలా ‘ అంటూ తిట్టా.  ‘హ హ ‘ అంటూ ఓ వికటాట్టహాసం చేసాడు. ఇలా మేమిద్దరం మాట్లాడుకుంటే ఎవరో వచ్చి అడిగారు కూడా ‘అతను నిన్ను race పెట్టి ఏడిపిస్తాడు ఓకేనా ‘ అంటూ. ‘ అయ్యయ్యో కాదు పాపం’ అంటూ చెప్పుకున్నాను.  ఇలా రోజూ ఉంటే ఉంటే ఇంతలా టపా పెట్టవలసిన ఏముంది?

 

రోజూ పొద్దున్నే పనికి వెళ్తూ ఓ త్యాగరాజ కృతో , అన్నమయ్య కీర్తనో , పాత  భక్తి రంజనో వింటూ వెళ్ళడం అలవాటు నాకు. తను ఏ పాటలు వింటూనో కనిపించేవాడు. ‘పొద్దుటే ఏం పాటలు వింటాడో ఏమిటో. మనం ఏం అడిగినా విన్పించకుండా ఉండటానికి చెవిటివాడికి మల్లే headphones’  అనుకునేదాన్ని(నేనే గొప్ప. ఎదుటివాడికి తెలీదు అన్న నా అహంకారం).. తన పని తాను చేసుకునే వాడే కానీ, వెళ్ళి పని కలిపించుకుని మాట్లాడేవాడు కాదు. కానీ చాలా మటుకు అందరూ తనతో వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. ఒక్కోసారి చర్చి గురించిన మాటలు వినిపిస్తూ ఉండేవి. వాళ్ళకి ఏవో సలహాలు ఇస్తూ ఉండేవాడు.  భోజన విరామం లాంటి సమయాల్లో చేతిలో బైబిల్ చదువుతూనో కనిపించేవాడు.

 

అమెరికాలో ఎక్కువ శాతం క్రిస్టియానిటీ  అన్న సంగతి తెలుసు కానీ ఇంత భక్తిగా కూర్చుని బైబిల్  చదవటం చూడటం అనేది నాకు కొంచెం కొత్తగా అనిపించింది. బహుశా తల్లితండ్రులు భారత దేశం నుంచీ కదా అనుకుని ఒకసారి అడిగాను కూడా  ‘మీ తల్లితండ్రులు ఇంత religious గా ఉంటారా ‘ అని. ‘ఏమిటీ ఇది కూడా ‘మీ’ ఇండియా తో లింక్ పెట్టేస్తావా ? ‘ అంటూ, వాళ్ళు కాదు తానే  అలా ఉంటాను అని చెప్పాడు.

తరువాత  నెమ్మదిగా  తెలిసినది ఏంటంటే  తనకి ఒక బ్యాండ్ ఉందని, గిటార్  వాయిస్తూ పాడతాడని, చర్చిలలో కచేరీలు ఇస్తాడని.  తానే lyrics కూడా వ్రాసుకుంటాడుట. ఎవరి మీదో తెలిసి నాకూ చాలా ఆశ్చర్యం వేసింది!! తాను నమ్ముకున్న దేవుడైన ఏసు ప్రభువు మీద మాత్రమే !! ఇవన్నీ చెప్పి  తాను పాడిన పాటలన్నీ ఓ CD రూపంలో పెట్టి ఇచ్చాడు. ఎపుడైనా వీలైతే కచేరీకి రమ్మన్నాడు కూడా. వస్తాను అని చెప్పడమే. వెళ్ళింది లేదు. ఈ ఉద్యోగం పొట్ట కూటి  కోసమే కానీ, తనకి ఇష్టమైన పని మాత్రం ఇలా పాడుకోవడం అని అర్ధం అయ్యింది నాకు.

 

మా అమ్మాయి ఒకసారి ఏదో  వ్యాసం వ్రాయడానికి, తన మతం గురించి తెలుసుకోవడం  జరిగింది. తరువాత కూడా ఒకటి రెండు సార్లు నేనూ ఏవో అడిగాను.  ఆ చెప్పడంలో కళ్ళలో ఒక రకమైన మెరుపు కనిపించేది. చాలా ఇష్టంగా చెప్పేవాడు. కొన్ని సార్లు నా ఆలోచనలు చదివినట్లు  భలే మాట్లాడేవాడు ‘మతం అనేది మనిషిని ఎపుడూ పాజిటివ్ గా ఉండేట్టు చేయాలి. మనల్ని దిగాలు పరచకూడదు. పిల్లలకి చిన్నప్పటినుంచీ చెప్తుంటేనే ఆ విలువలు తెలుస్తాయి. ఇక్కడ బళ్ళో చెప్పకూడదు. కాబట్టి చెప్పరు. మనం కూడా చెప్పకపోతే ఎలా ? అందుకే  మా అమ్మాయి కోసం మా చర్చిలోనే ఒక గ్రూప్ ని తాయారు చేసుకున్నాను. వాళ్ళకి నేనే చెప్తుంటాను’ అంటూ. నేను ఇండియాలో జరిగిన విషయాల గురించి ఏదైనా చెప్తే ‘ ఆ దేశం వదిలేసావు. ఇంకా ఎందుకు బాధ? ఈ దేశానికీ నేనేం ఇవ్వగలను అనేది ఆలోచించు. చుట్టూ పక్కల విషయాలు చూడు. బోలెడు జరుగుతున్నాయి. వాటి మీద ధ్యాస పెట్టు. ఏదైనా  చేయచ్చేమో చూడు’ అంటూ చేసే ఎన్నో వాలంటీర్ పనులు చెప్పాడు. జైళ్ళకి వెళ్లి అక్కడ పిల్లలకి ( Juvenile) కౌన్సిలింగ్ చేయటం అంటూ రకరకాలు. ‘నీ అంత ధైర్యం నాకు లేదు . ఏదో మా బాలవికాస్ ఏది చేస్తే, వాళ్ళతో పాటు కాసేపు వెనకాల నిల్చుంటాను అంతే ‘ అని చెప్పా. ‘ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేయగలరు. చేయలేము అనుకోవడం ఒక సాకు అంతే ‘ అన్నాడు.

 

అంత చక్కగా మాట్లాడే మనిషి ఉన్నటుండి  నువ్వు ఎవరో నేను ఎవరో అన్నట్టు ఉండేవాడు. ఈ మనిషికేమైనా తిక్కా అనుకున్న రోజులు కూడా ఉన్నాయి.

 

కొన్ని రోజులకి నా పక్క సీట్లోంచి తన స్నేహితుడి కోసం వేరే సీట్లోకి మారాడు. ఆ వికటాట్టహాసం మాత్రం వినిపిస్తూనే ఉండేది. వంటింట్లో కలిసేవాడు.  ‘తెలుగులో పాఠాలు చెప్పడం మొదలు పెట్టాను’ అని చెప్పగానే , ‘నేనూ తెలుగు నేర్చుకున్నా ‘ అన్నాడు . ‘ఏమిటీ’ అన్నా ఒక్కసారి !! ‘ఒకటే మాట అనుకో . అదే మా అమ్మాయికి కూడా నేర్పించా ‘ , ‘ఏంటంటే “ఏయ్  పోరా” ‘ . నేను ఒకటే నవ్వు  ‘అదొక మాట.  నువ్వు నేర్చుకోవడం’  అంటూ !!

 

ఇలా ఉండగా  ఓ గురువారం నాడు చివరి ‘Avengers ‘ సినిమా వచ్చింది.  నేను సినిమా చూడను. అయినా పిల్లల కోసం శుక్రవారంకి టిక్కెట్లు కొన్నాను.  తను ఏ ‘Avengers ‘ వదలకుండా చూస్తాడు. అటువంటిది శుక్రవారంకి కాకుండా సోమవారంకి టిక్కెట్లు కొన్నాడు. అందరం బాగా ఏడిపించాము, ముందే కథ చెప్పేస్తాం అంటూ. ‘అందర్నీ block  చేసేస్తా హ హ ‘ అంటూ మళ్ళీ ఓ వికటాట్టహాసం చేసాడు.

 

శుక్రవారం అయి సోమవారం రానే  వచ్చింది. తాను అన్నట్టుగా ఆదివారానికే  అందర్నీ block చేసాడు. చర్చిలో కచేరి మొదలుపెట్టి  ఒకే ఒక పాట తో మొదలు & ముగింపు ప్రార్థన ఈ విధంగా “There wasn’t a day that You weren’t b myside….Your love has been true… I will sing of all You’v done. And I’ll remember how far You’ve carried me. From beginning until the end , You are faithful, faithful to the end”  చెప్పి వెంటనే అతి సునాయాసం గా శరీరాన్ని విడిచిపెట్టి క్రైస్తవులకి పవిత్రమైన ఆ ఆదివారం నాడు తాను నమ్ముకున్న దైవం చెంతకి చేరాడు.

 

ఈ వార్త విన్న వెంటనే ఆపుకోలేని దుఃఖం వచ్చింది. వెంటనే తేరుకునేలా కూడా చేసిందనే చెప్పాలి.  అబ్దుల్ కలాం గారు శరీరాన్ని విడిచి పెట్టిన తీరు గుర్తుకు వచ్చింది. ఎంతటి దైవానుగ్రహం పొంది జీవన్ముక్తుడు అయ్యాడా అనుకున్నాను. ‘ఆ పాటే ఎందుకు పాడాడు ?‘ అన్న ప్రశ్న అందరికీ గుర్తుండిపోయింది. త్యాగయ్య, అన్నమయ్య, గోపన్న పాడుకున్న తీరు వింటాము. కానీ వారిని పక్కనే ఉన్నా గుర్తించలేని మూర్ఖురాలు నా బోటిది. మహాపురుషులు ఎప్పుడూ పిచ్చివాళ్ళలాగానే  కళ్ళకి కనిపిస్తారుట సామాన్యులకి!!

 

‘ఎన్ని ప్రవచనాలు విన్నాను, ఎన్ని కృతులు విన్నాను ఏమిటిలా పక్కన ఉన్న వాడిని గుర్తించలేకపోయాను’ అన్న బాధ చాలా రోజులు తొలిచేసింది. ఒక్కసారి  వెనక్కి వస్తే చేతులు జోడించి నమస్కరించాలి అనిపించింది.

 

ఆ CD  కారులో పెట్టగానే  ‘Ha ha !! You Indian !! Are you listening to it now? ‘ అంటూ  వికటాట్టహాసం చేస్తున్నట్లే అనిపించింది.

 

మనవి :  RIP  అంటూ వ్యాఖ్య చేయవద్దు .  భగవత్సాన్నిధ్యం పొందిన వారికి ఈ మాట వర్తించదేమో అని నా అభిప్రాయం