పురాణాలూ – వక్ర భాష్యాలు

ఈ టపా పురాణాల్ని గురించి  వక్రం గా మాట్లాడేవారికి మాత్రమే 🙂

ఈ రోజు ముఖపుస్తకం లో ఒక పోస్టు నా ఖర్మ కాలి  నా కళ్ళబడ్డది ‘రాముడికి మగపిల్లలు, కృష్ణుడికి మగపిల్లలు  శివుడికి మగపిల్లలే ఉన్నారు. అంతా పితృస్వామ్యం , పురుషాధిక్యత’. మొన్న ఎక్కడో ఇంకోటి ‘కృష్ణుడు దేవుడు కాబట్టి తప్పు చేసినా ఒప్పే అని చూపించేస్తారు భారతం లో ’ .  నా ఖర్మో ఏంటో మరి నాకే కన్పిస్తాయో తలా తోకా లేని పోస్టులు. శ్రీరామ నవమి రోజు కన్పించిన పోస్టులు ఇదిగో ఇలాంటివి    – ‘రాముడు బక్కగా ఉండేవాడు, ఇప్పుడు క్రూరం గా ఉన్నాడు’ .’శూర్పణఖ ముక్కు కోసారు’ . ‘భార్యని అడవుల పాలు చేసాడు’ ‘అగ్ని లో దూకమన్నాడు ‘. ‘బ్రాహ్మణుడి కోసం శంభూకుడి ని చంపాడు’ .ఈ రోజుల్లో ఎంత మందికి సంస్కృతం అర్ధం చేసుకోవడం వచ్చు? పోనీ కనీసం ఓ తెలుగు పద్యం చదవగానే తడుముకోకుండా  అర్ధం చెప్పగలరా? అంతెందుకు ఒక త్యాగరాజ కీర్తన అర్ధం చేసుకోలేరు కొంతమంది. అసలు, అత్యంత  సులువుగా ఉండే తెలుగు కథలనే చదవటం ఆపేస్తున్నరోజులు మొదలయ్యాయి. అటువంటిది ఏం తెలుసు అని  ఒక గ్రంధం గురించి మాట్లాడుతారు?  ఏం  తెలుసు అని ఒక సంస్కృతిని దుమ్మెత్తి పోస్తారు?

ఊర్మిళ నిద్ర వృత్తాంతం, రాముడు సీతని అడవులలో వదిలిపెట్టడం  అసలు వాల్మీకి రామాయణం లో  లేనే లేవని ఎంతమందికి తెలుసు? సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండ లో  ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు.  చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను. 

తిరుమల తిరుపతి దేవస్థానం వారు పబ్లిష్ చేసిన ఆంధ్రమహాభారతం లో ఒక్క ద్రోణపర్వం మాత్రమే 840 పేజీలు ఉంది.(ఈ ద్రోణపర్వం లో ఎన్ని పేజీలు చదవటం  సులభమో  తెలీదు కానీ ద్రోణుడిని విమర్శించడం చాలా తేలిక కొంత మందికి.) ఇక ఈ లెక్కన మొత్తం భారతం ఎన్ని పేజీలుంటుందో ఆలోచించండి. ఆఫీసులో పని చేసి, ఇంట్లో పనులని , పిల్లల బాధ్యతలు  చూసుకుంటూ  ఉండే నావంటి ఒక సగటు వ్యక్తి ద్రోణపర్వం వంటి పుస్తకాలు  ఎన్ని చదవగలడు/దు ? రామాయణం, మహాభారతం , భాగవతం క్షుణ్ణంగా చదవటానికి  ఒక జీవితకాలం సరిపోదు.  అవునా ?  మరి దేనిని ఆధారంగా చేసుకుని మాట్లాడతారు ? ఓ మూడు గంటల సినిమా చూసి, ఓ లెఫ్టిస్ట్  వ్రాసిన పుస్తకం చదివో  అర్ధం పర్ధం లేని థియరీలు అల్లేయటం మర్యాదస్తులకి మంచిపద్ధతేనా !!  తందానా అంటూ వీరికి వేలిముద్రలు, వ్యాఖ్యలు చేసేవారుంటారు. ఇంకో ‘very sophisticated’ పిచ్చి జాడ్యం ఏంటంటే పురాణాలూ ఇంగ్లీష్ లో చదివి పిచ్చి ప్రేలాపనలు చేయడం!!. వీరితో అత్యంతప్రమాదం అసలు. ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కాబట్టి అన్నీ  నిజాలే మాట్లాడుతున్నారు అనుకుంటారు అవతలవారు  కూడా.

పురాణాలన్నా, ప్రవచనాలన్నా  చదివి/విని తీరాలి & తప్పదు  అన్న నియమం ఏది లేదు. (డెమోక్రసీ అన్న పదం వేరే మతాల్లో ఉందో  లేదో నాకు  తెలీదు కానీ ఆ రోజుల్లో సనాతన ధర్మానికి మాత్రం ఉండేది అని ఖచ్చితంగా చెప్పచ్చు). చదవక/వినక పోయినావలన నష్టం ఎవరికీ లేదు. కానీ –  ఒక సంస్కృతి గురించి  ఒక  పుస్తకాన్ని ఆధారం చేసుకుని మాట్లాడేటపుడు  original చదివి విమర్శించండి. పూర్తిగా తెలియని వాటి గురించి  మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదు. వ్యాసుల వారు, వాల్మీకి  వారు వారి పుస్తకాల మీద కాపీ రైట్స్ అందరికి ఇచ్చి వెళ్ళింది వాటిల్లో మంచిని చూడమని . అంతే కానీ వక్రభాష్యం చెప్పమని మాత్రం  కాదండీ !!

 

 

18 thoughts on “పురాణాలూ – వక్ర భాష్యాలు”

  1. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అచ్చు వేసిన పుస్తకాలు కలియుగం నాటివా లేక అంతకు ముందువా. అంతకు ముందువైతే ఎవరు అచ్చు వేశారు. కలియుగం లోనివైతే ఎవరు రాశారు. సీతను అడవికి పంపని ఓక రామాయణం అనే కథ ఓకటి ఉందన్నమాట. అయితే దానిని పీఠాధిపతుల సమక్షంలో పెట్టి ఇదే ఓరిజినల్ కథ అని ఓపించండి. పీఠాధిపతుల సమక్షంలోనే ఎందుకంటే నాలాంటి వారు నమ్మాలి అంటే తప్పదు. లేదు మాకు అ అవసరం అంటే మీరు net లో రాసుకోవడానికే పనికొస్తాయి. లేదా పుస్తకాల ముద్రణాలయాలతో చర్చలు జరిపి వాటిని ఆపి మీరు చెప్పే వాటిని వెయించండి.

    మెచ్చుకోండి

    1. నేను వ్రాయవలసినది సరిగ్గా వ్రాయలేదేమోనండీ . అంతే!! ఇప్పుడు సరి చేశాను. సీతని అడవులకి పంపడం అనేది ఉత్తరకాండలో ఉన్నది. ఉత్తరకాండ వాల్మీకి విరచితం కాదు అంటారు. ఋషిప్రోక్తం అంటారు. చాగంటి గారు కూడా ప్రవచనం చేసేటప్పుడు శ్రీరామ పట్టాభిషేకంతో ఆపేసారు. అసలు ఒక ‘చాకలి’ అన్న మాట కూడా లేదంటారు. ఈ మాట నేను గరికపాటి వారి నోటి వెంట విన్నాను. మీరు నమ్మకపోతే అది మీ సమస్య. రామాయణం నచ్చేవారు చదువుతారు. నచ్చని వారు దాని జోలికి పోకూడదనే నా అభిప్రాయం. అయినా నేనేదో వ్రాయరానిది వ్రాసినట్లు, చేయరాని ఘోరం చేసినట్లు మాట్లాడితే నేనేం చెప్పగలను?

      మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

  2. మీ కోపం సహేతుకమే. పూర్తిగా తెలుసుకోకుండా మాటలాడటం పరిణతిలేని వ్యక్తుల పని. అందువల్ల వాళ్ళని పట్టించుకోకపోవటమే సబబు. అయితే పని కట్టుకొని మన సంస్కృతిని కించపరచేవాళ్ళని మాత్రం వదలటానికి వీలు లేదు.

    మెచ్చుకోండి

    1. పట్టించుకోకపోవడం ఎవరికీ వారికీ మంచిదే. కానీ సమాజానికి మంచిది కాదు కదా అన్యగామి గారు !!మీ లాంటి వారు, నాలాంటి వారు తప్ప చాలా మంది మనకెందుకులే అన్నట్లే ఉంటున్నారు. మాట్లాకపోతే అదేదో కథలో ‘ఆవు’ని చూసి ‘మేకా’ అన్నట్లు తయారవుతుంది.

      మెచ్చుకోండి

  3. చాగంటి గారు చెప్పేది వారి కధ, గరికపాటి గారు చెప్పేది వారి కధ, రామాయణం అనే కధ పాత రోజుల్లో బాగా ప్రాచుర్యం పొందింది. దాని యెక్క ప్రతిఫలం రాసినవానికి దక్కకూడదు అని దానిని అటుత్తిపి ఇటుత్తిపి కొన్ని వందల, వేల వెర్షన్స్ రాసి జనాల మీదకు వదిలేసి ఎమి జరుగుతోందో అని చుస్తునారు. అరోజులో కాపీ రైట్స్ లేవుకాబట్టి ఇన్ని వెర్షన్స్ వచ్చాయి. లేకపోతే సినిమాలో, లేదా పుస్తకాలో మాదిరిగా హారిపోటర్ 1,2,3 @ సింగం 1,2,3 వచ్చేవి.

    మెచ్చుకోండి

    1. నాకు తెల్సిన మహానుభావులలో అన్నీ విషయాలు క్షుణ్ణంగా తెలిసిన వారు చాగంటి మరియు గరికపాటి. వేరే ఎవరైనా ఉండవచ్చు. కాదని నేను చెప్పను. ఒక విషయం నేర్చుకోవడం అంటూ మొదలు పెడితే ఒక ప్రామాణికం తీసుకోవాలి కదా మరి. నాకు సంస్కృతం రాదు. నాకు తెల్సిన సునాయాసమైన దారి ఇదే 🙂 ఇదివరకు రోజుల్లో అంటే భాష మీద పట్టు ఉండేది. పద్యాలూ సునాయాసంగా చెప్పేవారు. వారికి వీరి ప్రవచనముల అవసరం ఉండకపోవచ్చు. నాలాంటి వారికి ఇదే మంచిది. పైగా కారులో వెళ్ళేటప్పుడో, వంట చేసుకుంటూనో ఓ చెవి అటుపడేస్తే చెవుల్లోకి ఏ చెడు వెళ్లకుండా ఉంటుంది కూడాను ఈ గ్రంధాలు అసలు వ్యాపారదృష్టితో వ్రాసినవి కాదు కదండీ 🙂 వ్యాపారం చేసేవాళ్ళు చేస్తున్నారు. వాటిని తిరగవ్రాసి, కథలు అల్లి అవార్డులు కూడా తెచ్చుకుంటున్నారు

      మెచ్చుకోండి

  4. వ్యాపారం చేసేవాళ్ళు చేస్తున్నారు. వాటిని తిరగవ్రాసి, కథలు అల్లి అవార్డులు కూడా తెచ్చుకుంటున్నారు.
    అంటున్నారు కదా.

    మరి జనాలు అందరూ అవే ఎక్కువగా చదువుతున్నారు కదా?.

    ఇకపోతే మీకు మద్దతుగా కొందరు
    నాకు మద్దతుగా కొందరు
    మాట్లాడడానికి మనమేమి శత్రువులం కాదు మీకు తెలిసిన భావాలు మీరుచెపండి. నాకు తెలిసినంతలో నా భావాలు నేను చెపుతాను.
    ఇష్టం ఉన్నవారు వారి భావాలను పంచుకోవచు.
    ఓకరిది తప్పు అని చెప్పడానికి మనకి ఏం అధికారం వుంది. ఎవరి ధ్రుకోణంలో వారిది సరైనదే కనుక మి వెర్షన్ మీది నా వెర్షన్ నాది.

    మెచ్చుకోండి

    1. మీ వెర్షన్ నా వెర్షన్ అన్నమాట లేదు. అసలు వెర్షన్ అన్నమాట ఎందుకు? వాల్మీకి, వేదవ్యాసులవారికంటే మాకే బాగా తెలుసు అనుకున్నవారు రామాయణమహాభారతాల జోలికి వెళ్ళకూడదు మరి. వాళ్ళ పుస్తకాలేవో, వాళ్ళ కథలేవో వాళ్ళు వ్రాసుకోవాలి. వాటిని వక్రీకరించి వ్రాయవలసిన అవసరం లేదు కదా. ఈ రచయితల లక్ష్యం ఒక్కటే –> ప్రజలు వాటిని ఒక ప్రామాణికంగా తీసుకున్నారు. ఆ ప్రజల నమ్మకాన్ని నీరుగార్చాలి. Instant గా కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలి. అదెలా ?అందుకే ఇలా వక్రీకరించి వ్రాయడం. మీరు చెప్పినట్లు మనమేం శత్రువులం కాదు. మీరెవరో నేనెవరో !! మన మధ్య లేని శత్రుత్వం పుట్టించడానికే ఈ వక్రీకరించడడం

      మెచ్చుకున్నవారు 2 జనాలు

      1. కానీ చాలా అవమానకరంగా మాట్లాడతాడు. నా పరువుకోసం నేనిక్కడకికొచ్చాను తప్ప నీకోసం కాదంటాడు. రాముడి పాత్రలో వాల్మీకి ఆ ఒక్క నెగటివ్ షేడ్ ఎందుకుపెట్టాడో నాకస్సలు అర్ధంకాదు.

        మెచ్చుకోండి

  5. @Malakpet Rowdy
    కానీ చాలా అవమానకరంగా మాట్లాడతాడు. నా పరువుకోసం నేనిక్కడకికొచ్చాను తప్ప నీకోసం కాదంటాడు. రాముడి పాత్రలో వాల్మీకి ఆ ఒక్క నెగటివ్ షేడ్ ఎందుకుపెట్టాడో నాకస్సలు అర్ధంకాదు.

    hari.S.babu
    మీ సందేహానికి హిందూ ధర్మ ప్రహేళికలు-రామకధా విశ్లేషణం పోష్టులో నేను జవాబు చెప్పాను.ఇది ఇప్పుడు నా పుస్తకం “శ్రీ రాఘవం!శ్రీ మాధవం!” పుస్తకంలో ఉంది.

    మెచ్చుకోండి

    1. ధన్యవాదాలు హరిబాబు గారు. నేనే వ్రాద్దాం అనుకుంటున్నాను. కానీ నా సమాధానం లో అంత బలం ఉండకపోవచ్చు. అంటే ఎక్కడో తప్పేమో అన్న సంశయంలో నాలోనూ ఉంది. ఇంతలో మీరే చెప్పేసారు :). ఆ రోజున ఏది ధర్మము అని చెప్పారో, అది ఖచ్చితంగా పాటించాడు రాముడు. ఆయన పాటించినవి – మనకి నచ్చినవి మెచ్చుకున్నాము. నచ్చనివాటికి మెచ్చలేకపోతున్నాము.

      మెచ్చుకోండి

      1. నిన్న మీరు పోస్టు చదివాకా చాగంటి గారు ఏం చెప్పారా అని మళ్ళీ విన్నాను. రామాయణం లో ఈ ఘట్టం అర్ధం చేసుకోలేకపోతే రామాయణం విని రాముడిని సరిగ్గా పట్టుకోలేదని అర్ధం .

        మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

Leave a reply to Rajasekhar స్పందనను రద్దుచేయి