జరుగుతున్న విషయాలు చూస్తూ చాగంటి గారు చెప్పిన ప్రవచనం కి వాటిని ముడి పెడుతుంటే అన్పిస్తోంది, ప్రవచనాలు నా మట్టి బుర్రకి కూడా ఎక్కుతున్నవీ అని!! నేను ప్రవచనము చెప్పే స్థాయి కి రావాలంటే ఇంకో జన్మ ఎత్తా లేమో, కానీ నేను అన్వయించుకున్నది ఈ టపా లో విశిదీకరించడానికి ప్రయత్నిస్తాను.
చాగంటి గారు వారి ప్రవచనా ల్లో ఒకటికి పది సార్లు చెప్తారు ‘మాట’ అనే దాని గురించి. రంపపు కోత కంటే అనరాని మాటలే గాయపెడతాయి అన్నారట బలిజేపల్లి వారు. మాటలు ఆచితూచి ఎలా మాట్లాడాలో రామాయణం చెప్తుంది అంటారు. నిజమే. కొన్ని ఘట్టాలు ఉదాహరణలు గా చూసి చాలా నేర్చుకోవాలి అనిపిస్తుంటుంది నాకు .
ముఖ్యం గా సుందరకాండ లో హనుమంతుల వారు మాట్లాడిన తీరు, వాలి భార్య తార మాట్లాడే తీరు. ఈ రోజే కష్టేఫలి శర్మ గారు వారి బ్లాగులో వారు చాలా బాగా చెప్పారు “ఎంత చెప్పినా తక్కువే తార గురించి. సుగ్రీవుడు అప్పుడే దెబ్బలుతిని పోయినవాడు మరల తిరిగి వచ్చి, సింహనాదం చేస్తూ వుంటే తార, వాలిని, వెళ్ళవద్దని, బలమైన కారణం వున్నది కనకే మీతమ్ముడు తిరిగి వచ్చాడని, నిశిత పరిశీలనతో చెబుతుంది. హెచ్చరిస్తుంది. వాలి వినడు, అది వేరు. తన సంభాషణా చాతుర్యం తో, కోపంతో వచ్చిన లక్ష్మణుని చల్లపరుస్తుంది. చెప్పిన మాటలు చూడండి. ” చాలా కాలం కష్టాలు పడ్డాడు. ఇప్పుడే ఆయన రాజు అయ్యాడు. రాముని దయ వల్ల రాజ్యం, రుమా,నేనూ దక్కేము, భోగాలనుభవిస్తున్నా, రాముని పని మానలేదు సుమా………….”, అని మత్తుతో కనులు మూసుకుపోతున్న సమయంలో కూడా మాటాడగల్గిన చతుర. మరి కొంచం ముందుకెళితే కనబడేది, మండోదరి, యీమె కూడా తన సంభాషణా చతురత చూపింది కాని, రావణుని వంటి కాముకుని వద్ద పని చేయలేదు. సుందర కాండలో సీత హనుమల సంభాషణ వొక అద్వితీయ ఘట్టం. ఇద్దరు గొప్పవారు మాటాడితే యెలా వుంటుంది అన్నది, చదువుకుని ఆనందిచాలి, నాకు చెప్పగల తాహతు లేదని సవినయంగా మనవి చేసుకుంటున్నా. హనుమ నవ వ్యాకరణ పండితుడట.’’
తండ్రి కైకేయి కి ఇచ్చిన మాటకై అడవులకి వెళ్ళాడు శ్రీరాముడు. మారీచుడు రాముడిలా గొంతు పెట్టి అరిచినపుడు, రాముడికి ఏమయిందోనన్న ఆతృత తో సీతా దేవి లక్ష్మణ స్వామి తో ‘నన్ను చేపడదామని ఆలోచిస్తున్నావేమో’ అన్న అనకూడని ఒక్క మాట రామాయణం నే మార్చేసింది. ‘ఏడాది లంక లో ఉన్న సీత’ అన్న ఒక రజకుడి మాట విని భార్య నే పరిత్యజించాడు శ్రీరాముడు. కుంతీ దేవి ‘బిక్ష ను అందరూ పంచుకోండి’ అన్న మాట అసలు మహా భారతం కథనే నడిపించింది.
రామాయణ భారతాల నుంచి ఈ రోజుకి తిరిగి వచ్చేస్తే …… డోనాల్డ్ ట్రంప్ గారు, ఓట్ల కోసం గత పద్దెనిమిది నెలలలో తన నాలుక ఎటు తిరిగితే అటు మాట్లాడి , మాటలే ఆయుధాలుగా వాడుకుని అధ్యక్షుడి పదవిని కైవసం చేసుకున్నారు. ఈ రోజున ఆ పదవి దొరికింది కానీ, ఈ నిరసనలు, గోలలు చూస్తుంటే ఆయన మాటలే ఆయనకు పాశాలై చుట్టుకుంటున్నాయి అన్పించింది.
కష్టేఫలి శర్మ గారన్నట్లు “పంచేద్రియాలలో ఒకటైన నరం లేని నాలుక చేసేవి రెండే పనులు. ఒకటి రుచి చూడటం. రెండు మాట్లాడ్డం. “. అసలు ఈ నాలుక ని నియంత్రించుకుంటే చాలేమో. అన్నీ విధాలుగా బాగుపడచ్చు 🙂
కొసమెరుపు : ఈ టపా పెట్టే ముందు యాధృచ్చికం గా చాగంటి గారి భారత ప్రవచనం విన్నాను. సభా పర్వం 15/26 భాగం. శిశుపాలుడు రాజసూయా యాగం లో కృష్ణుడి కి అగ్రపూజ చేసినందుకు ధర్మరాజు తూలనాడినప్పుడు మాట్లాడిన మాటలు. చివరి పదిహేను నిముషాలు చాగంటి వారు ‘మాట’ గురించే చెప్పారు. ఈ ఘట్టం లో శిశుపాలుడు గురించి చెప్తుంటే నాకు చాలా విషయాలు గుర్తొచ్చాయి. మోడీ నోట్లని రద్దు చేస్తున్నట్లు చెప్పగానే ముందు మాట్లాడేసింది కేజ్రీవాల్ గారనుకుంటా :). విషయం తెలియక ముందు చాలా మంది చాలా మెచ్చేసుకున్నారు. లైన్లలో నిల్చుని కాళ్ళు నొప్పి పుట్టగానే ‘ముందు వెనుక ఆలోచించకుండా ఈ పని ఏమిటి’ అంటున్న వారు మొదలయ్యారు. నాలిక కదా ఎటు తిప్పితే అటు తిరుగుతుంది మరి !!
మాట రెండంచులా పదునైన ఆయుధం. మాట బతికించగలదు, చంపేయగలదు.
మెచ్చుకోండిమెచ్చుకోండి
నిజమేనండీ . రెండువైపులా పదునైన ఆయుధం. ’మాట బతికించగలదు’ – కౌన్సెలర్ల పని అదే కదా ఇప్పుడు 🙂
మెచ్చుకోండిమెచ్చుకోండి
జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి
జిహ్వాగ్రే మిత్ర బాంధవా
జిహ్వాగ్రే బంధన ప్రాప్తి
జిహ్వాగ్రే మరణం దృవం
ఇది గురువు గారు తరచూ మాట గురించి వాడేది. ఎన్ని దృష్టాంతాలైన ఇవ్వొచ్చు. తార చెప్పినపుడు వాలి చల్లబడలేదు కానీ లక్ష్మణస్వామి ఎలా చల్లబడ్డాడు? అంతా కర్మఫలం అనిపిస్తుంది.
మెచ్చుకోండిమెచ్చుకోండి