కథలు చదవాలా ? భాగం -1

మన బడి మొదటి త్రైమాసికం పరీక్ష  రెండు రోజులుండగా….  ఫోన్లో సమావేశం.. పరీక్ష  గురించి ప్రశ్నోత్తరాల కార్యక్రమం. అప్పుడే భారతదేశం నుండీ విమానం దిగానేమో!! ఏ పని చేయబుద్ధి కాక, తెచ్చిన పెట్టెలలో వస్తువులు చూస్తూ, చూపిస్తూ, మధ్య మధ్యలో సర్దుతూ,  తల్లితండ్రులు వేస్తున్న ప్రశ్నలు వింటున్నాను.  ‘పరీక్షలో, మొదటి త్రైమాసికం పాఠ్యపుస్తకం లోని కథలలో నుంచి  ప్రశ్నలు అడుగుతారు  అని చెబుతున్నారు. అన్ని కథలు గుర్తుంచుకోవడం అంటే కష్టం కదండీ. ఇప్పుడు ఆ కథలన్నీ చదవాలా ?’ అన్న ఒక  ప్రశ్న బాగా గుర్తుండిపోయింది. సమాధానం ఏంటో వినలేదు నేను. ముందస్తుగా,  ఆ ప్రశ్న నేను చెప్పే తరగతి తల్లితండ్రులు నుంచీ కాకపోవడంతో కాస్త సంబరపడ్డాను.

వేసిన ప్రశ్న తప్పు అనట్లేదు. తల్లితండ్రులు తెలుగు తరగతికోసం వారానికి మూడు గంటల సమయాన్ని కేటాయించడమే ఎక్కువ.  పిల్లలతో పరీక్షల కోసం చదివించడం  &  వ్రాయించడం  అనేది ఇంకా ఎక్కువ. అలాంటప్పుడు కథలు చదివించడం అనేది చాలా ఎక్కువ కాబట్టి అటువంటివి ఆశించకూడదు. కానీ ఆ ఒక్క ప్రశ్న, మన జీవితాలు మనం ఎంత ‘task  oriented ‘ గా మార్చుకుంటున్నాము అనడానికి  కేవలం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే!!

అమెరికాలో రోజూ పడుకునేముందు  పిల్లలకి కథలు చదవండీ  అని చెప్తారు. రోజుకి ఒక్క 10 నిముషాలు చాలు, ఒక  కథ చదివి వారితో చర్చించడానికి.  అదే తెలుగే కావచ్చు. ఇంకే  భాషయినా కావచ్చు. కథలు చదువుతున్నపుడు ఎన్ని కబుర్లు చెప్తారో. అదీ పది పన్నెండేళ్ళ వయసు వచ్చేవరకూ మాత్రమే!!  తర్వాత మనం కథ చదువుతాం వినండీ  అన్నా కూర్చునే తీరిక & సమయమూ వారికీ ఉండవు . కానీ వారితో కూర్చుని పుస్తకపఠనం చేయడం అనేది ఒక విత్తనం నాటడంలాంటిది. ఒక చక్కటి చిన్నప్పటి  జ్ఞాపకంగా మిగిలిపోతుంది.  పొద్దున్న లేచినప్పటినుంచీ ఉరుకులు పరుగులు పెట్టే  జీవితాలకి  పుస్తకపఠనం అనేది పిల్లలతో సమయం గడపడానికి  & తల్లితండ్రులతో  బంధం ఏర్పడడానికి  ఒక సులువైన మార్గం. అలా అని  ప్రతీ కథా, ప్రతీ పుస్తకము వారితో కూర్చుని చదివే సమయం ఉండకపోవచ్చు. కానీ కొంత సమయం తీసుకుని ఒకసారి అలవాటు చేయాలి. అంటే రుచి చూపించి వదిలేయాలి.  ఆ అలవాటే వాళ్ళంతట వాళ్ళే అల్లుకుపోయేలా చేసి నెమ్మదిగా భాష మీద ఆసక్తి కలిగిస్తుంది.

ఇక తెలుగు నేర్పించడం అన్న విషయానికి వస్తే  –  లెక్కలు, సైన్స్ అంటే నేర్చుకోకపోతే జీవితంలో భుక్తి గడవదు కాబట్టి, పిల్లలని చెవులు పిండయినా ఎలాగో అలా నేర్పిస్తాం. కానీ తెలుగు అలా కాదు కదా. సరదా కోసం నేర్చుకుంటున్నది. అది నేర్చుకోవడం ఒక పెద్ద పని అనుకుని, పిల్లల మీద ఒత్తిడి పెడితే, వాళ్ళు నేర్చుకోరు  సరికదా తెలుగు అంటే  విముఖత పెరుగుతుంది.  భోజనాల సమయం లో తెలుగులో మాట్లాడాలి అనే నియమం పెట్టుకోవడం, కార్ లో వెళ్ళేటపుడు words building  లాంటి ఆటలు ఆడటం, చిన్న చిన్న flash  cards  చేయటం వంటి చిన్న పనులతో వాళ్ళకి ఆసక్తి పెంచవచ్చు.  ఇది వరకు ‘జోడించు’ అనే ఆట గురించి ఒక టపా పెట్టాను. అటువంటి ఆటలు ఆడటం!! తెలుగనే కాదు  అది ఏ  భాష అయినా, ఏ కళ  అయినా కావచ్చు. తెలుగు నేర్చుకోవడం, శ్లోక/ బాలవికాస్  లాంటి  తరగతులు (activities) పిల్లలకి సరదాగా ఒక ఆట విడుపులాగా ఉండాలి.  మన సంగతే తీసుకుంటే, ఎంత పెద్ద  చదువులయినా చదివి ఉండచ్చు. తెలుగు గురువులని మాత్రం ఎప్పుడూ మర్చిపోము. ఎందుకంటే ఆ తరగతి ఎప్పుడూ  ఒక ‘break ‘ లాగా ఉండేది.

రెండవ భాగం  ఇక్కడ

2 thoughts on “కథలు చదవాలా ? భాగం -1”

వ్యాఖ్యానించండి