వేసవి సెలవలు – 3 సినిమా

వేసవి సెలవలలో బిట్రగుంటలో సినిమా చూడటం కూడా ఓ మరచిపోలేని జ్ఞాపకం మాకు.

కొత్త సినిమాలు చూడాలి అంటే బిట్రగుంట థియేటర్లలో వచ్చేవి కాదు. ఇక నెల్లూరు వెళ్లాల్సి వచ్చేది. దానికోసం ముందే ఓ పెద్ద ప్రణాళిక వేసుకునేవాళ్ళం. మాట్నీకి వెళ్ళాలి  అంటే భోజనాలు చేసి హౌరా ఎక్స్ ప్రెస్ లో బయలుదేరాలి. మా మావయ్య, పిన్ని, కొంతమంది పెద్దపిల్లలం మాత్రమే వెళ్ళేవాళ్ళం. అమ్మమ్మ భోజనాలు తొందరగా పెట్టేసేది పాపం.

ఆ హౌరా  ఎక్స్ ప్రెస్ ఆలస్యంగా వస్తే మాత్రం అంతే సంగతులు!! సాయంత్రం కృష్ణా ఎక్స్ ప్రెస్  వరకూ ఇంకో బండి ఉండేది కాదు. బిట్రగుంట నుంచి నెల్లూరు కి బస్సు లు పెద్దగా ఉండేవి కాదు. ఇక ఆ రోజుకి  సినిమా ప్రోగ్రాం ‘కాన్సల్’ అనేవారు. అలా మధ్యాహ్నం వెళ్లి సాయంత్రం హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ (No 53/54)  లో రాత్రి భోజనాల సమయానికి ఇల్లు చేరేవాళ్ళం.

నెల్లూరులో నాకు గుర్తున్న థియేటర్ లు,  ‘అర్చన’ థియేటర్ & ‘కృష్ణా, కళ్యాణి, కావెరీ ‘ అని మూడు థియేటర్లు కలిపిన కాంప్లెక్స్.  మా మావయ్య ఆ మూడు థియేటర్లకి తీసుకెళ్ళినపుడల్లా ‘ మీ హైదరాబాద్ లో ఏ థియేటర్ పనికొస్తుందే  వీటి ముందు’ అనేవాడు. ‘ అసలు మహేశ్వరి పరమేశ్వరి’ చూసావా అంటూ పోట్లాడేవాళ్ళం నేను & మా అక్క. (మావయ్య తో అంత పోట్లాడేదాన్ని కానీ, ‘మహేశ్వరి పరమేశ్వరి’ నేనే ఎప్పుడూ  వెళ్ళలేదు. వెళదామని ఇప్పుడు అనుకున్నా అంత తీరికా, ఓపికా రెండూ లేవు. అంతా మార్చేసారని విన్నాను)

‘అహ నా పెళ్ళంట’, ‘డాన్స్ మాస్టర్’ నెల్లూరు లోనే చూసాము. ‘క్షణక్షణం’ నెల్లూరులో చూసిన ఆఖరి సినిమా అనుకుంటా.

బిట్రగుంటలో  రెండు థియేటర్ లు ఉండేవి. ఒకటి ‘పంచ రత్న’. ఇంకొకటి ‘సాజిద్’.  ‘పంచ రత్న’ ఇంటికి దగ్గరలో విశ్వనాథ రావు పేటలో ఉండేది. అప్పట్లో కొత్తగా ఊర్లో కొంచం అధునాతనంగా వచ్చింది. ‘సాజిద్’ పాత  థియేటర్ . రైల్వే బ్రిడ్జికి అవతల పక్క ఉండేది. అందుకని అక్కడ సినిమా చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ‘సాజిద్’ లో చూసిన  ఒకే ఒక్క సినిమా ‘జీవనపోరాటం’ . కొత్త సినిమా లో అలా వెంటనే ‘సాజిద్’ లో రావటం అదే మొదటిసారి. 

అలా ఎక్కువగా ‘పంచ రత్న’ కే  వెళ్ళేవాళ్ళం. ‘పంచ రత్న’ లో   25 పైసలు, 75 పైసలు, 1.50 టికెట్లు ఉన్నట్లు గుర్తు.  నేను, నా స్నేహితురాలు వరలక్ష్మి ఇద్దరం డబ్బులు ఏదో ఆదా  చేద్దామని, 75 పైసలు కొనుక్కుని , ఇంటెర్వల్ లో 1.50 కి వచ్చి కూర్చునేవాళ్ళం. అలాంటి  కక్కుర్తి పనులు చేసినందుకు మా పిన్ని బాగా తిట్టేది. మా పిన్నికి నాకు క్షణం పడేది కాదు. ‘పెద్ద గయ్యాళిరా బాబు’  అనుకునేదాన్ని. ఇక్కడ మా పిన్ని గురించి ఒకటి చెప్పాలి. తను నాకు తలకి నూనె రాసి జడ ఎంత గట్టిగా వేసేదంటే, నా తల automaticగా ముందుకి వచ్చేది. అలా తల ముందుకి పెడితే  ‘ఎందుకలా చూస్తావే కొంగా’ అని తిట్టేది. మా గోల భరించలేక అమ్మమ్మే జడ వేసేసేది నాకు. నిస్వార్థమైన ప్రేమ అమ్మానాన్నలకు మాత్రమే ఉంటుంది అంటారు. ఈ రోజుకి కూడా అంతే ప్రేమ చూపిస్తుంది మా పిన్ని.  ఫోన్ చేస్తాను అని చెప్తే ఎదురుచూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీ సినిమాలోకి వచ్చేస్తా !!

బిట్రగుంటలో సినిమా అంటే, సినిమా బండి వచ్చేది. ‘ నేడే చూడండి, నేడే చూడండి’ అంటూ. ఆవరణలో పిల్లలందరం పరిగెత్తుకెళ్ళి బండి దగ్గరికి వెళ్లి  ఏ సినిమానో, ఎన్ని రోజులో తెలుసుకుని వచ్చేవాళ్ళం. వెళ్లాలో వద్దో మా పిన్ని నిర్ణయించేసేది. ఫస్ట్ షో 7:00 కి ఉండేది. సినిమా చూసి వచ్చాక ఇంటికి వచ్చి భోజనాలు చేసేవాళ్ళం. మేము వచ్చేసరికి అందరూ  పక్కలు వేసుకుని నిద్రకి ఉపక్రమిస్తూ ఉండేవారు. అప్పుడు అమ్మమ్మ సినిమాకి వెళ్ళివచ్చినవారందరికీ స్టీల్ బేసిన్లో ముద్దలు కలిపి పెట్టేది. ఒక్కోసారి పూరీలాంటి టిఫిన్ లు చేసి ఉంచేది. అమ్మమ్మ, తాతయ్య మాతో ఎప్పుడూ  సినిమాకి రాలేదు.

మా పిల్లల ఎండాకాలం సెలవలు చూస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి. అమెరికాలో ( మా ఊర్లో అయితే ) సెలవలు ఉన్న పది వారాలు, వారానికి రెండు సినిమాల చొప్పున free  movies, వారాంతం అదనంగా outdoor movies ఉంటాయి. వీళ్ళ చిన్నపుడు ఆ free movie కోసం పొద్దున్నే లేచి, breakfast తిని పరిగెత్తడం కూడా అప్పుడే ఒక జ్ఞాపకం గా అయిపోయింది.  ఎన్నో విషయాలు జ్ఞాపకాలుగా మారిపోతుంటే, కాలం ఎంత తొందరగా పరుగెత్తుతోందా అనిపిస్తోంది!!

 

వ్యాఖ్యానించండి