పిల్లి Brain

నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ర్యాగింగ్ ఉండేది. భయంకరంగా కాకపోయినా కొంచెం ఉండేది. కొన్ని సార్లు చాలా సరదాగా కూడా ఉండేది. వాళ్ళని మేము రాగ్ చేసామో వాళ్ళు మమ్మల్ని రాగ్ చేసారో ఇది చదివి చెప్పండి !!
Immediate సీనియర్స్ అంటే మా కంటే ఒక సంవత్సరం పెద్దవాళ్ళు బాగా చేసేవారు. బహుశా క్రిందటేడు సీనియర్స్ బారిన పడి ఉండటం మూలానో ఏమో, జూనియర్లు ఎప్పుడు వస్తారా వీళ్ళ పనిపడదాం అనుకునేవారు.
మొదటిరోజున పెద్దగా ర్యాగింగ్ లేదు. ‘హమ్మయ్య’ అనుకుని (రోజూ ఇలాగే ఉంటుందనుకుని), నేను, అప్పుడే పరిచయమయిన స్రవంతి, అంతకుముందు కౌన్సిలింగ్ లో పరిచయమయిన రాజ్యలక్ష్మి ( ఎంసెట్ లో నాకు, తనకి ఒకటే ర్యాంక్) బస్టాప్ లో కూర్చున్నాం. సీనియర్ ఒకతను వచ్చాడు. చాలా చక్కగా అమాయకుడిలా తల దువ్వుకుని, ఇన్ షర్ట్ చేసుకుని మా దగ్గరికి వచ్చాడు. రావటమే తన పేరు చెప్పుకుని (వాళ్ళ పేరు తొందరగా చెప్పరు. ‘ o mighty mighty senior, we are your dirt dirty juniors’ అని పద్యం చెప్పుకోవాల్సిందే), ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. మనిషి వాలకం చూసి భయం లేకుండా సంతోషంగా సమాధానాలు ఇవ్వటం మొదలు పెట్టేసాం. ముఖ్యంగా నేను, స్రవంతి. ఇంటర్మీడియేట్ లో సబ్జెక్టులలో ఏవి కష్టం ఏవి సులువో తెలుసుకున్నాడు. కెమిస్ట్రీ మాకు సులువు అని చెప్పడం జరిగింది. ‘అయితే ఒకే ఒక్క ప్రశ్న వేస్తాను. ఏమి రాగ్ చేయను. దానికి సమాధానం చెప్పాలి’ అన్నాడు . సరే అడగమన్నాం. ‘ ఈ కెమికల్ రియాక్షన్ ఏంటి , KI +2S → ?’. నేను, స్రవంతి potassium iodide . sulphur కి రియాక్షన్ ఏంటా అని తెగ ఆలోచించడం మొదలు పెట్టాము. అడిగిన సీనియర్ వీరుడు సన్నగా నవ్వడం మొదలుపెట్టాడు. ‘ఆలోచిస్తూ ఉండండి ‘ అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజ్యలక్ష్మి ‘ ఈ వెధవకి సమాధానం చెప్పడం ఏంటే తన్నేవాడు లేకపోతే’ అంది. ‘ఏమైంది’ అన్నాం ఆశ్చర్యంగా . ‘వాడు అడిగిన ప్రశ్న ఏంటో మీకు అర్ధమవ్వలేదని నాకు బాగా అర్ధమయ్యింది’, అని ఏమని అడిగాడో విడమరచి చెప్పింది. ‘ఆ.. ‘ అని నోరువెళ్ళబెట్టి , వెంటనే తెగ నవ్వుకున్నాం!! చేతులు పట్టుకుని బస్సులో ఎక్కేసాం !!
ఆ రోజు నుంచీ, మళ్ళీ నా చేయి ఇంకొకరు వచ్చి పట్టుకుని మమ్మల్ని విడగొట్టే వరకు విడవలేదంటే నమ్మండి !! రెండో సంవత్సరం, మా సర్వే లెక్చరర్ ‘ఆ చేతులు విడవండి’ అని చెప్తే ‘ మేము విడవం’ అని ఖచ్చితంగా జవాబు చెప్పేసింది స్రవంతి. ఆయన ముందు కొంచెం బిత్తరపోయి తరువాత నవ్వేసి వెళ్లిపోయారు. నా అప్పగింతలు సమయంలో నేను అమెరికా వెళ్ళిపోతున్నానని అది ఏడుస్తుంటే , మా బావగారు వెళ్ళి ‘ మీ ఫ్రెండ్ గురించి మీరు అంత బెంగ పెట్టుకోనక్కరలేదు. బాగా చూసుకుంటాం’ అని చెప్పారట. సెంటిమెంటు నుంచీ మళ్ళీ కాలేజీకి వచ్చేస్తాను
అలా ఆ ప్రశ్న అడిగిన అబ్బాయికి మేమే ఓ పేరు పెట్టాం. ఆ పేరేంటో విడమరచి చెప్పనక్కర్లేదనుకుంటా 🙂 అసలు పేరు కంటే మా అందరికీ ఆ పేరే గుర్తుండిపోయింది. ఇంకో అబ్బాయి ఎప్పుడూ నన్ను లంచ్ కి పిలిచేవాడు. అతనికి ఓ పేరు పెట్టేసాం ‘ లంచ్ అనిల్’ అని. ఇంకో సీనియర్ కి కూడా ఎందుకో తెలీదు కానీ ‘decent fellow’ అని పేరు పెట్టాం !!
ఒక రోజు నేను, నా స్నేహితురాలు విరామ సమయం లో మంచినీళ్లు తాగుతుండగా ఇద్దరు సీనియర్స్ అనూప్, మనోహర్ వచ్చి పిలిచారు. రోజు వాళ్ళు ,మేము ఇంటినుంచీ మెహదీపట్నం వరకూ ఒకే బస్సులో వచ్చేవాళ్ళం. అందుకే పాపం అసలు మమ్మల్ని rag చేయలేదు. చెప్పాలంటే తర్వాత తర్వాత మేమే వాళ్ళని ఏడిపించామేమో కూడా!! అనూప్ ‘మాకేదైనా కానుకలు ఇస్తారేమో అనుకున్నాము’ అన్నాడు. మేము ఒకరి మొహాలు ఒకరము చూసుకుని ‘ఎందుకు’ అన్నాం. అనూప్ ‘ఈ రోజు ఏంటో తెలీదా ‘ అన్నాడు. వెంటనే ‘వాలెంటైన్స్ డే ‘ అన్నాడు. అంటే మాకు ఇద్దరికీ అర్ధం కాలేదు. ‘ ఏం చేస్తారు ఆ రోజు ‘ అని అడిగాము. ‘వీళ్ళెవరు రా బాబు‘ అన్నట్లు ఒక వెర్రి వాళ్ళని చూసినట్లు చూసాడు. అంత అమాయకం గా ఉన్న మమ్మల్ని ఏడ్పిస్తున్నందుకు మనోహర్ కి చాలా మొహమాటం వేసి స్టైల్ గా ఆంగ్లంలో ‘That’s okay. That’s okay’ అంటూ అనూప్ ని పక్కకి లాక్కెళ్లి పోయాడు. అప్పట్లో గూగులమ్మ, ఇంటర్నెట్ లాంటివి ఏవి లేవు. ఎప్పటికో కానీ మాకు ఈ ‘డే’ ఏంటో తెల్సి రాలేదు. తరువాత తలుచుకున్నపుడల్లా నవ్వే నవ్వు మాకు !!
ఒకసారి సుధీర్ , స్రవంతిని రిజర్వు బ్యాంకు బస్టాప్ లో చూసాడు. ఆ సంగతి స్రవంతితో చెబుదామని ‘నిన్ను రిజర్వు బ్యాంకు దగ్గర చూసాను’ అన్నాడు. దానికి అది ‘ ఏ బ్రాంచ్ ‘ అందిట. సుధీర్ మళ్ళీ ‘ రిజర్వు బ్యాంకు ‘ అంటే, మళ్ళీ రెట్టింపుతో ‘ ఏ బ్రాంచ్ ‘ అందిట. సుధీర్ కి ఒళ్ళు మండిపోయి ‘ కొడతా పిల్ల నిన్ను!! రిజర్వు బ్యాంకుకి బ్రాంచ్ ఉంటుందా ‘ అని అరిచాడు. స్రవంతి అక్కడే పడీ పడీ నవ్వు!! నాకు చెప్తే నవ్వే నవ్వు!!
ఇంకో రోజు నవ్వాపుకోలేక లేడీస్ రూమ్ కి వచ్చి పడీ పడీ నవ్వింది. ‘ఏమయిందే ’ అంటే, దీన్ని ఎవరో రాగ్ చేద్దామని ఓ సీనియర్ తీసుకెళ్లాడుట . పక్కనే ఉన్న ఇంకో సీనియర్ ని పరిచయం చేసాడు. చేసిన వాడు ఊరుకోకుండా ఈవిడకి చెప్పాడట ‘ వీడు చాలా స్మార్ట్. CAT brain’ అన్నాడట . స్రవంతి ‘ ఆహా’ అలాగా అన్నట్టు బుర్ర ఊపింది. ఆ సీనియర్ ఏదో దీన్ని ఏడిపిద్దామని ‘నీకసలు CAT brain అంటే ఏంటో తెలుసా ‘ అన్నాడట . అంటే ‘IIM లో admission తెచ్చుకునేంత బుర్ర’ అని అతడి ఉద్దేశ్యం. ఇదేమో చాలా గొప్పగా , ‘ఆ… తెలుసు. పిల్లి brain కదా !!’ అని సమాధానం ఇచ్చింది. అడిగిన వాడు తలబాదుకుని ‘ వెళ్ళు తల్లీ. మా వాడి పరువు తీస్తున్నావు ‘ అని చెప్పాడట!! ఈ రోజుకి ఆ ‘పిల్లి brain’ పేరేంటో అస్సలు తెలీదు. గుర్తు లేదు మాకు !!
పిల్లలం అనుకుని వాళ్ళు మమ్మల్ని రాగ్ చేసారో, వాళ్ళని మేము ‘పిల్లుల్ని’ చేసామో తెలీదు !!
ఏదో సరదాగా వ్రాసింది తప్ప, ఎవర్నీ క్రించపరచడానికి కాదు. జంతువులని క్రించపరచారు అంటూ వ్యాఖ్యలు మొదలపెట్టద్దు.

3 thoughts on “పిల్లి Brain”

  1. రిజర్వ్ బ్యాంక్ బ్రాంచ్ 😀😀😀. కౌంటర్ అటాక్ బాగుంది👌.
    (బ్రాంచ్ లు ఉంటాయి, అయితే ఒక నగరానికి ఒక బ్రాంచే ఉంటుంది 🙂)

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

వ్యాఖ్యానించండి