ఐరోపా యాత్ర – ఒక చిన్న సంఘటన

బ్లాగు ముఖం చూసి చాలా రోజులయింది.  వ్రాయవలసినవవి బోలెడు ఉన్నాయి. సెలవల్లో ఐరోపా వెళ్ళాము. వెళ్లే ముందు హడావిడి, వచ్చాక అలసట.  లండన్, పారిస్, స్విట్జర్లాండ్. జర్మనీ బోర్డర్ లో ఒక చిన్న ఊరు వెళ్ళివచ్చాము. 15 రాత్రులు/16 రోజులు.  ప్రయాణం కబుర్లు నెమ్మదిగా ఒక్కొక్కటి వ్రాస్తున్నాను.

40038363_1959722564120464_2974206763047321600_o

 

రాగానే గబగబా వ్రాసేసిన విశేషం ఇది:

ఈ పదిహేను రోజుల ప్రయాణంలో  చాలానే చూసాము…అందచందాలు కొన్ని ప్రకృతి సృష్టి అయితే కొన్ని మానవుడి సృష్టి..   చాలానే నేర్చుకోవాలి అనుకున్నాను… ముఖ్యంగా ‘మాతృభాష’ & ‘సంస్కృతి’ !! ఒక చిన్న సంఘటన నాలో ఆలోచనా దుమారాన్నిలేపింది. పారిస్ లో ఒక చిన్న మెట్రో రైలు స్టేషన్ లో,  ‘ నేను మూడు రోజుల మెట్రో టిక్కెట్టు కొనుక్కున్నాను. రేపు పొద్దున్న ప్రయాణానికి కూడా చెల్లుతుందా’ అని నేను ఆంగ్లంలో అడిగిన ప్రశ్న తీరు కౌంటర్లో కూర్చున్న ఆవిడకి అర్ధం కాలేదు.  ‘ అంత గబగబా చెబితే, నేను నీకు సమాధానం చెప్పను. కాబట్టి నెమ్మదిగా చెప్పు’ అంటూ కొంచం కోపంగా ‘అవసరం నీది’ అన్నట్లు సైగలతో ఫ్రెంచ్ లో చెప్పింది. నా ఆంగ్ల భాష అంత బావుందా అని ఏడవాలో సంతోషించాలో అర్ధం కాని పరిస్థితి!! గతి లేక వచ్చావు అన్నట్లున్న ఆ మాట తీరు చూసి, ఇలాంటి దేశాన్ని చూడటానికి వచ్చి డబ్బు ఎందుకు తగలబెట్టాను అనిపించింది. ఇక్కడే కాదు. స్విట్జర్లాండ్ లో Mt.Titlis  టికెట్టు కౌంటర్ లో వారు కూడా ఒక నవ్వు అనేది లేకుండా, అడిగిన ప్రశ్నలకి విసుక్కుంటూ సమాధానం ఇస్తున్నారు. నా లాంటి యాత్రికులు పదిమంది వస్తే అటువంటి వారికి వారి పొట్ట నిండుతుంది అన్న సంగతి తెలీదా అనిపించింది. వీరిని చూస్తుంటే నాకు వచ్చిన ఆలోచన ఒకటే!! ఆంగ్లేయుడు వాడి సరుకు భారతదేశం లో అమ్ముకోవడానికి వచ్చి, తిష్ట వేసి వాడి భాష నేర్పించి మన మాతృభాషలని, మన సంస్కృతిని మృత్యుముఖం లో  నెట్టి వేసాడు. బట్టలు అమ్ముకోవడానికి వచ్చిన వాడిని అంత నెత్తిన పెట్టుకున్నాం. ఆ రోజున వాడికి మన పూర్వికులు, ఈ విధంగా సమాధానాలు ఇచ్చి ఉన్నట్లయితే, ఈ రోజున తిండి,బట్ట,నీడ కోసం పొట్టపట్టుకుని ప్రపంచంలో పలు చోట్లకి వలస వెళ్ళం కదా అనిపించింది. మన భాష & మన సంస్కృతి పట్ల మనకే నమ్మకం లేకపోవడం కారణం కాదా ?? చీరలు,పంచెలు కట్టుకోము. బొట్టు పెట్టుకోము. మంగళ సూత్రాలు. మెట్టెలు అంటే ఫాషన్ కి సరిపోవు. తెలుగులో మాట్లాడితే నామోషి. తెలుగులో వ్రాస్తే అది చదవటం మహా విసుగు.  మనం ఎవరం? మన పిల్లలు ఎవరు !! మనకే తెలీదు !!

15 thoughts on “ఐరోపా యాత్ర – ఒక చిన్న సంఘటన”

  1. మనం ఆ దశ ఎప్పుడో దాటిపోయాం . మా చిన్నప్పుడు ఇంచు మించు 25 సంవత్సరాల క్రితం , ఊరు దాటితే తెలుగు ఎందుకూ పనిచెయ్యదు అని చెప్పడంతో , భయం తో ఇంగ్లీష్ నేచుకోవాల్సి వచ్చింది . నేను జర్మనీ లో 3 ఇయర్స్ ఉన్నా, అక్కడ జర్మన్ వస్తే తప్ప ఉద్యోగం రాదు , by default , జర్మన్ లోనే ఉన్నాయి కంప్యూటర్ లాంగ్వేజ్, application languages కూడా , అవన్నీ చూసి బాధేసింది . మనమేంటి ఇంత బానిసత్వం లో కూరుకుపోయాం అని . ఆ బానిసత్వం మన నర నరాన రక్తం లో ఇంకిపోయి DNA లో కలిసిపోయింది .
    — ఊళ్లలో జనాలు పనులు మానేసి ఎదో ఒక నాయకుడి వెనక తిరుగుతుంటారు , ఎదో ఒకటి మన మొహాన పడేస్తాడని.
    — మన identity ని అభిమాన హీరో సంఘాల్లో వెతుక్కోవడం .
    — ఓటు కి డబ్బులు తీసుకోవడం అత్యంత సర్వ సాధారణం .
    — పొలిటిషన్ కాబట్టి డబ్బులు తీసుకోకుండా పనిచేయడు అని ఒక సహజమైన ఆలోచన .
    — 80 శాతం జనాలు inferior complex తో ఉండటం, మన చదువు లు కూడా ఇవి మార్చలేకపోవడం బాధాకరం .

    ఇవన్నీ బానిసత్వం అని చెప్పినా వాళ్లకి అర్ధం కాదు ,తిరిగి మనలని వింత గా చూస్తారు అలా చెప్పడానికి ప్రయత్నిస్తే . ఎదో ఒక అద్భుతం జరిగితే తప్పిస్తే , మన వాళ్ళు మారడం అసంభవం .

    మెచ్చుకోండి

    1. చాలా బాగా చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసత్వపు ధోరణే !! అమెరికా దారులు మూసుకుపోతున్నాయని ఇప్పుడు వేరే దేశాలకు వలస పోవడానికి, ఆయా భాషలు కూడా నేర్చుకుంటున్నారు. ఆ విషయం కూడా ఈ యాత్రలోనే తెల్సింది. ఇటాలియన్, స్విస్ జర్మన్ నేర్చుకుంటున్న భారత విద్యార్థులు కనిపించారు.

      మెచ్చుకోండి

  2. // “బట్టలు అమ్ముకోవడానికి వచ్చిన వాడిని అంత నెత్తిన పెట్టుకున్నాం.” //

    😀😀.
    ప్రపంచీకరణ పేరుతో ఈ ఆధునిక కాలంలో కూడా అదే పునరావృతం అవుతోందండీ మాదేశంలో. ఇంకా పెచ్చు మీరుతోందనాలి. సరే బట్టలమ్ముకునే వాళ్ళనీ, కొత్తగా .. కార్లమ్ముకునే వాళ్ళనీ, కిరాణా సరుకులు అమ్ముకునే వాళ్ళనీ, బల్లలూ కుర్చీలూ అమ్ముకునే వాళ్ళనీ … నెత్తికెక్కించుకుంటున్నాం. వ్యాపారసంస్ధలే దేవుళ్ళు, వ్యాపారసంస్ధలే నాయకులకు / అధికారులకు ఇష్టులున్నూ.

    ఐరోపాలో మీ అనుభవాలతో నేనూ ఏకీభవిస్తాను. మీకు కలిగిన అనుభవాలకి రేసిజం కారణమని తోస్తోంది. ఐరోపాలో రేసిజం ఒక పాలు ఎక్కువనే అనిపిస్తుంది నాకు. మీరు ఉదహరించిన రెండు దేశాలూ నేనూ కొంత తిరిగాను. స్విట్జర్లాండ్ లోనూ, పారిస్ లోనూ అటువంటి నిర్లక్షధోరణి తగిలింది. అంతే కాదు, ఇంగ్లీష్ తెలిసుండీ మాట్లాడకపోవడం కూడా చూశాను (కొంత .. మన తమిళులు, హిందీవాళ్ళ లాగా అన్నమాట 😀😀😀). చిన్నచూపు, అంతే.

    మెచ్చుకోండి

    1. వచ్చెన్ బట్టల నమ్ముకోవ భళిరా వాణిజ్య మున్ దాటి తా
      జొచ్చెన్ రాజుగ, భారతీయులను బొజ్జోయించె నాంగ్లంబుతో
      గుచ్చెన్ మాయని గాయ మొక్కటిని గగ్గోలై జనుల్ బోవగా
      పిచ్చోళ్ళై, తమ సంసృతిన్ మరచి హా భిక్షంబు కై దేశముల్!

      जिलेबी

      మెచ్చుకోండి

  3. మీ బ్లాగు కి ఇదే రావడం ఇదే మొదటిసారి.మంచి పోస్ట్ రాశారు.బ్రిటీష్ వాళ్ళ లాగానే ఫ్రెంచ్ వాళ్ళు,జర్మన్లు వాళ్ళు ,స్పానిష్ వాళ్ళు ఇంకా యూరపు లోని చిన్న చిన్న దేశాల వాళ్ళు కూడా ఆసియా,ఆఫ్రికా,దక్షిణ అమెరికా ఖండాల లోని దేశాల్ని వలసలు గా పాలించడం వల్లనే అనుకుంటా ..ఇంగ్లీష్ ఎంత గొప్పదో మా భాష అంతే గొప్పది అనే అభిజాత్యం వారికి ఉంటుంది.ఒక రకంగా అది నిజం కూడా..!

    మన దేశీయుల కంటే వర్ణం కాస్త బాగానే ఉండే దక్షిణ ఇటలీ ప్రాంతాలకి చెందిన వారిని,లాటిన్ అమెరికా లోని కొన్ని దేశాల వారిని (మెస్టిజో) ఇలాంటి వారిని కూడా ప్రధాన యూరపు దేశాలవారు “నిగ్గర్” లుగా అవహేళన చేయడం ఇంగ్లీష్ నవలల్లో కనబడుతుంది.ఆ లెక్కన మన ఇండియన్ ల గురించి చెప్పేదేముంది. మేము సముద్రాల్ని దాటి ఈ భూమి పైని ఇతర జాతుల్ని పాలించిన వారము అనే స్పృహ వారికి ఎప్పుడూ ఉంటుంది.

    వారి మానసిక తలాల గూర్చి మనవాళ్ళకి తెలిసింది తక్కువ.మనం ఎంత విద్యాధికులమైనా కావచ్చు గాక..!మీతో ఒక పాశ్చాత్యుడు ఎంత మంచిగా అయినా ఉండవచ్చు గాక..మేలు చేయవచ్చు గాక..అయినా నువు ఒక కంట అతడిని అనుమానించవలసిందే..!ఇది నేను అన్నది కాదు అనేక ఏళ్ళు యూరపు లోనూ,అమెరికా లోనూ జీవించి కాచి వడబోసిన ఓ మహానుభావుడు అన్నది.

    మెచ్చుకున్నవారు 1 వ్యక్తి

వ్యాఖ్యానించండి